
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. పంటలు పండి, చేతికొచ్చి అమ్ముకునేంత వరకు అంతా సజావుగా జరిగితేనే రైతులు ఊపిరి పీల్చుకునేది. మధ్యలో అధిక వర్షాలతో వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మాత్రం కోలుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంట నష్టం జరిగితే బీమా కానీ, పరిహారం అందించే పరిస్థితి కానీ లేకపోవడం ఇందుకు కారణం.
ఈ ఏడాది యాసంగిలో మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు మూడు దఫాలుగా కురిసిన తీవ్రమైన వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 10 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లినట్లు అనధికార అంచనా కాగా.. మార్చిలో 1.51 లక్షల ఎకరాలు, ఏప్రిల్‌లో 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టుగా నిర్ధారించిన ప్రభుత్వం.. ఆ మేరకు పరిహారం ఇవ్వాలని ప్రకటించింది.
మిగిలిన వారికి ఎలాంటి సాయానికీ దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం పరిహారం ప్రకటించినప్పుడు ఆ సందర్భంలో జరిగిన పంట నష్టానికి మాత్రమేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే మున్ముందు జరిగే పంట నష్టాలకు ఇది వర్తించదని అర్థమవుతుండగా, ఈ సీజన్‌లో పంటలు సాగు చేస్తున్న రైతులను పరిహారానికి సంబంధించిన ఆందోళన వెంటాడుతోంది.
కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి బయటకు...
రాష్ట్ర రైతులకు అనుకూలంగా లేదన్న భావనతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ (పంటల) బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం నుంచి 2020లో రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. కేంద్ర బీమా పథకాలు రైతులకు నష్టం చేకూర్చడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి బయటకు వచ్చిందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పంజాబ్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా పీఎంఎఫ్‌బీవై నుంచి బయటకు వచ్చాయని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.
బీమా సంస్థలకే ఎక్కువ ప్రయోజనం?
రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది రైతులున్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది తమ పంటలకు బీమా చేయించేవారు. దీంతో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం వచ్చేది. 2015–16లో 7.73 లక్షల మంది పంటల బీమా చేయగా, ఆ ఏడాది నష్టం ఎక్కువ జరగటంతో ఏకంగా రూ.441.79 కోట్ల నష్ట పరిహారం రైతులకు అందింది. 2016 వానాకాలం సీజన్ నుంచి దేశ వ్యాప్తంగా పీఎంఎఫ్‌బీవై పథకం అమలులోకి వచ్చింది.
2016–17లో 8.87 లక్షల మంది మంది రైతులు 7.33 లక్షల ఎకరాలకు ఈ పథకం కింద బీమా చేయించగా, 1.34 లక్షల మంది రైతులకు రూ.111.33 కోట్ల పరిహారం వచ్చింది. అలాగే 2018–19, 2019–20లో రూ.960 కోట్ల పరిహారం రాష్ట్రానికి మంజూరు కాగా.. అందులో కొంతమేరకు రైతులకు దక్కింది. అయితే కేంద్ర పథకం వల్ల రైతులకు జరిగే లాభం కంటే బీమా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
కొందరు రైతులు కూడా బీమా పథకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు భారీగా లాభాలు గడిస్తున్నప్పటికీ ప్రీమియం ధరలను బీమా కంపెనీలు పెంచుకుంటూ పోయాయి. ప్రైవేటు సంస్థలకు సైతం పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పంటల బీమా పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ పథకం జాడేదీ?
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గతంలో వ్యవసాయశాఖ కసరత్తు చేసింది. రైతు యూనిట్‌గా దీన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వ్యక్తిగత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా నగదు అందేలా చూస్తోంది.
కానీ పంటల బీమా పథకంపై ఇంతవరకు ముందడుగు పడక పోవడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. దేశంలో రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకోవడాన్ని రైతు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment