
గంటూరు జిల్లా పొన్నూరు మండలం జడవల్లిలో పంట కోత ప్రయోగం చేస్తున్న సిబ్బంది
సాక్షి, అమరావతి: 2020 ఖరీఫ్‌లో సాగైన పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లింపునకు రంగం సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో సీజన్ ముగిసే లోగానే పంటల బీమా సొమ్ము రైతుల చేతుల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులపై పైసా ఆర్థిక భారం పడకుండా ఈ–పంట నమోదు ప్రామాణికంగా అమలు చేస్తోన్న ఈ పథకం కోసం వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫై చేసిన పంటల బీమా సొమ్మును మే నెలలో చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం తలపెట్టిన పంట కోత ప్రయోగాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. గతంలో ఏదైనా ఒక సీజన్‌లో నోటిఫైడ్ పంటలకు చెల్లించాల్సిన బీమా సొమ్మును ఏడాదికో రెండేళ్లకో చెల్లించేవారు. అది కూడా కొంత మంది రైతులకు మాత్రమే.
అవగాహన లేక కొందరు, ఆర్థిక భారంతో మరికొందరు పంటల బీమాకు దూరంగా ఉండడం వల్ల అన్నదాతలు ఏటా తీవ్రంగా నష్ట పోయేవారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయలేని రీతిలో ఉచిత పంటల బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. నోటిఫై చేసిన పంటలకు సంబంధించి ఈ క్రాప్‌లో నమోదైన ప్రతి ఎకరాకు బీమా వర్తింప చేస్తోంది. గతేడాది జూన్ 26వ తేదీన 2018–19 రబీ పంటలకు సంబంధించి 5.94 లక్షల మంది రైతులకు రూ.596.40 కోట్లు, 2019 ఖరీఫ్ పంటలకు సంబంధించి 9.48 లక్షల మందికి రూ.1,252 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇక నుంచి సీజన్ ముగియకుండానే రైతుల చేతికి బీమా సొమ్ము చేతికందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం గతేడాది రూ.101 కోట్ల వాటా ధనంతో ఏపీ జనరల్ ఇన్‌స్రూ?న్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఐసీఎల్) ఏర్పాటు చేసింది.
88.4 శాతం ప్రయోగాలు పూర్తి
► 2020 ఖరీఫ్‌లో సాగైన పంటలకు సంబంధించి దిగుబడి ఆధారంగా 21 రకాల పంటలు, వాతావరణం ఆధారంగా 9 రకాల పంటలను పంటల బీమా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 8వ తేదీన
నోటిఫై చేసింది.
► రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఏయే పంటలకు బీమా వర్తింప చేస్తున్నారో వాటి జాబితాను కూడా వెల్లడించింది. గత ఖరీఫ్‌లో 90,13,924 ఎకరాల్లో వ్యవసాయ, 22,54,221 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఈ క్రాప్‌లో నమోదు కాగా, నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి 36,656 పంటకోత ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
► ఇప్పటి వరకు 32,413 ప్రయోగాల (88.4 శాతం)ను పూర్తి చేశారు. కాగా నోటిఫై చేసిన సజ్జలు, మినుములు, పెసలు, వేరుశెనగ, మొక్కజొన్న, కొర్రలు, రాగులు, ఆముదం, ఉల్లి, మిరప, పసుపు, పొద్దుతిరుగుడు పంట కోత ప్రయోగాలు నూరు శాతం పూర్తయ్యియి.
► వరిలో 27,926 పంట కోత ప్రయోగాలకు 27,241 ప్రయోగాలు (97.5 శాతం) పూర్తి చేశారు. పత్తి (ఐ) 62.2 శాతం, పత్తి (యూఐ) 49.3, జొన్నలు 44.8, పత్తి 44.2, కందులు 46.7, చెరకు (మొక్క) 37.7, చెరకు (రాటూన్) 47 శాతం ప్రయోగాలు పూర్తయ్యాయి. మిగిలినవి నెలాఖరులోగా పూర్తి చేస్తారు.
ఎలా అంచనా వేస్తారంటే..
► దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి పంట కోత ఫలితాల ఆధారంగా బీమా యూనిట్ పరిధిలో ‘వాస్తవ దిగుబడి’ని అంచనా వేస్తారు.
► ఏడు సీజన్లలో ఉత్తమమైన ఐదు సీజన్ల సరాసరి దిగుబడిని ‘హామీ దిగుబడి’గా భావించి దాని కంటే ‘వాస్తవ దిగుబడి’ తక్కువగా ఉన్నట్టుగా గుర్తించిన సందర్భంలో నష్ట పరిహార స్థాయిని లెక్కిస్తారు. ఆ మేరకు బీమా పరిహారం చెల్లిస్తారు. ప్రస్తుతం దిగుబడి అంచనాలను మదింపు చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.
► వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి ఏపీఎస్‌డీపీఎస్, ఐఎండీ వాతావరణ కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వ మండల స్థాయి రెయిన్ గేజ్ స్టేషన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తారు. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి ఉధృతి, తేమ వంటి అంశాల ఆధారంగా పరిహారాన్ని లెక్కిస్తారు.
మేలో జమ చేసేందుకు సన్నాహాలు
ఈ నెలాఖరులోగా పంటకోత ప్రయోగాలు పూర్తవుతాయి. మదింపు ప్రక్రియ పూర్తికాగానే దిగుబడి, వాతావరణ పంటల బీమా లబ్ధిదారుల జాబితాలను సామాజిక తనిఖీల కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. అర్హత గల అన్ని క్‌లైయిమ్‌లకు సంబంధించిన బీమా సొమ్మును ఖరీఫ్–2021 ప్రారంభానికి ముందే మే నెలలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
– హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment