బహిరంగ మార్కెట్లో రొటోవేటర్లు
ఇచ్చోడ(బోథ్): జిల్లాలోని అన్నదాతలు కోటి ఆశలతో వానాకాలం పంటల సాగు మొదలుపెట్టారు. మృగశిర కార్తె ప్రవేశంతో పొలం బాట పట్టారు. అయితే రైతులకు సర్కారు నుంచి ప్రోత్సాహం లభించడంలేదు. ప్రత్యామ్నాయ లాభాసాటి పంటలు వేయాలని ప్రభుత్వం సూచనలు చేస్తూనే రాయితీపై విత్తనాలు, రుణమాఫీ, వ్యవసాయ పని ముట్లు, అందించే పథకాలు క్రమంగా కనుమరుగు చేస్తోంది. రైతుబంధు పథకం వచ్చిన తర్వాత సబ్సిడీ పథకాలన్నీ ఎత్తేయడంతో రైతులు విత్తనాల నుంచి మొదలు వ్యవసాయ పనిముట్ల వరకు పూర్తి గా సొమ్ము చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రైతన్నకు సాగు భారంగా మారుతోంది.
రూ.8.5 కోట్ల అదనపు భారం
జిల్లాలో పత్తి పంట తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట సోయా. గతంలో ప్రభుత్వం సోయా విత్తనాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేసేది. కానీ మూడేళ్లుగా సబ్సిడీ పూర్తిగా నిలిపేసింది. దీంతో పూర్తి ధర చెల్లించి రైతులు బహిరంగ మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేయాల్సివస్తోంది. సబ్సిడీ ఎత్తివేతతో జిల్లా రైతులపై రూ.8.5 కోట్ల అదనపు భారం పడుతోంది.
జాడలేని పంటల బీమా
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. కొన్నేళ్ల నుంచి పత్తి పండిస్తున్న రైతులు అతివృష్టి, అనావృష్టి కారణంగా దిగుబడులు రాక త్రీవంగా నష్టపోతున్నారు. వారికి లబ్ధిచేకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరేళ్ల కిత్రం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాయి. పథకంలో 80 శాతం మంది రైతులు చేరారు. రెండేళ్ల క్రితం అతివృష్టితో నష్టపోయిన రైతులు ఎకరాకు రూ.12 వేల చొప్పున పరిహారం పొందారు. ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులు పరిహారానికి నోచుకోవడంలేదు.
‘యంత్రలక్ష్మి’కి మంగళం
రైతులు ఆధునిక వ్యవసాయం చేసేందుకు సాగులో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకాన్ని ప్రవేశ పట్టింది. దీని ద్వారా చిన్న సన్న కారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, రొటోవేటర్లు, నాగళ్లు, పవర్‌స్ప్రేలు, యంత్రాలు రాయితీపై అందించేది. యంత్ర లక్ష్మి పధకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రైతులు పనిముట్లు సైతం బయట మార్కెట్లో కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది.
రద్దయిన పావలా వడ్డీ
పంటలపై తీసుకున్న రుణాలు మార్చి 30లోపు చెల్లించిన వారికి గతంలో పావలా వడ్డీ మాత్రమే వసూలు చేసేవారు. మిగితా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. మూడేళ్ల కిత్రం పావలా వడ్డీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతులకు పంట రుణాలపై వడ్డీ భారం తప్పడంలేదు.
అటకెక్కిన రుణమాఫీ
2018 డిసెంబర్ 11 లోపు రైతులు తీసుకున్న రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటి వరకు కేవలం 20 వేల మంది రైతులకు సంబంధించిన కేవలం రూ.39 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ చేశారు. మరో 80 వేల మంది రైతుల రుణాలు మాఫీ కావాల్సి ఉంది.
విత్తనాలు సబ్సిడీపై అందించాలి
విత్తనాలు సబ్సిడీపై అందించక పోవడంతో చిన్న సన్న కారు రైతులపై అదనపు భా రం పడుతోంది. రైతులకు సంబంధించిన పథకాలపై ప్రభుత్వం పునరాలోచించాలి. విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించాలి.
– బొర్రన్న, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment