
స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలు
నెన్నెల: కరెంట్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా పట్టుతప్పి కింద పడడంతో కాంట్రాక్టు ఉద్యోగి రెండు కాళ్లు విరిగిన ఘటన నెన్నెల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సోదారి చంద్రయ్య విద్యుత్‌శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పదేళ్లుగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో శుక్రవారం గంగారాం శివారులోని మైసమ్మ ఆలయం వద్ద కరెంట్ స్తంభంపైన మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. కరెంట్ వైర్ సరి చేస్తుండగా పట్టు తప్పి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సహచర సిబ్బంది మంచిర్యాల ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు చంద్రయ్యకు రెండు కాళ్లు విరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.