కలాంకు ఇదేనా మర్యాద!
చెన్నై : మనిషి ఉన్నంత వరకే విలువ..అన్న నాడికి అద్దం పట్టే రీతిలో భారత రత్న అబ్దుల్ కలాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉంది. స్మారక కేంద్రానికి స్థల కేటాయింపులో సాగుతున్న అలసత్వాన్ని బట్టి చూస్తే, ఇదేనా ఆ మహనీయుడికి ఇచ్చే మర్యాద అన్న ఆవేదన ప్రతి ఒక్కరి మదిలో మెదలక మానదు. రాష్ర్ట ప్రభుత్వ అలసత్వంపై కేంద్ర బృందం సైతం అసహనం వ్యక్తం చేసింది.
‘కలలు కనండి.... వాటిని సాకారం చేసుకోండి..
ఏపీజే అబ్దుల్ కలాం పిలుపునకు స్పందించిన వాళ్లు దేశ విదేశాల్లో కోట్లల్లో ఉన్నారు. భారతరత్నగా, మాజీ రాష్ట్రపతిగా, మిస్సైల్ మ్యాన్‌గా పేరు గడించిన ఈ నిరంతరం ఉపాధ్యాయుడు గత ఏడాది జూలై 27న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. అల్లంత దూ రాలకు వెళ్లినా, ఆయన సందేశాలు, పి లుపు శాశ్వతం. అందుకే ఆయన అంటే పట్టభద్రులు, యువత, విద్యార్థిలోకాని కి అమితాభిమానం. అయితే, పాలకుల్లో ఆ అభిమానం, గౌరవం కన్పించడం లే దని చెప్పవచ్చు. మనిషి ఉన్నంత వరకే విలువ...తదుపరి...అన్న నానుడికి అద్దం పట్టే రీతిలో వ్యవహారాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. తాను పుట్టిన గడ్డ రామేశ్వరంలోని తేకరంబు వద్ద శాశ్వత నిద్రలో కలాం ఉన్నారు.
ఆ ప్రదేశంలో స్మారక మండపం, ఎగ్జిబిషన్, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని పాలకులు ప్రకటించారు. ఇందుకు తగ్గ హామీని కలాం సొదరుడు మహ్మద్ ముత్తు మీరాన్‌కు ఇచ్చారు. అయితే, పనులన్నీ నత్తనడకే. పర్యాటక, ఆథ్యాత్మిక కేంద్రం గా ఉన్న రామేశ్వరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కలాం సమాధిని సందర్శించి వెళ్తున్నారు. అయితే, అక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే. ఇప్పుడిప్పుడే ప్రహరీ నిర్మాణాలు, కంచె ఏర్పాటు పనుల్ని ముగించారు. ఇనుప కమ్మిలను ఏర్పాటు చేసి బయటి నుంచి కూడా జనం సమాధిని వీక్షించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. సమాధి మీద ఎండ పడకుండా ఓ షెడ్డును నిర్మించారు. అంతటితో తమ పని ముగిసినట్టే అన్నట్టుగా పాలకుల తీరు స్పష్టం అవుతున్నాయి.
ఇదేనా మర్యాద : కలాం భౌతికంగా అందర్నీ వీడి మరో రెండు వారాల్లో ఏడాది కావస్తున్నది. అయినా, ఇంత వరకు కలాం స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, కలాంకు సంబంధించిన వస్తువుల ప్రదర్శన శాల, చిన్న పిల్లల పార్కు పనులు అడుగైనా ముందుకు సాగ లేదు. విజ్ఞాన కేంద్రం తదితర పనులకు రూ. 60 కోట్లను కేంద్రం కేటాయించినట్టు సంకేతాలు ఉన్నా, అందుకు తగ్గ పనులు చేపట్టేందుకు స్థలం సమస్య నెలకొని ఉన్నది. కలాం సమాధి ఉన్నప్రదేశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. కలాం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1.5 ఎకరాల స్థలాన్ని గతంలో కేటాయించింది. ఈ స్థలంలోనే ప్రస్తుతం ఆ మహనీయుడు శాశ్వత నిద్రలో ఉన్నారు. అయితే, స్మారక మండపం, విజ్ఞాన కేంద్రం, ఇతర నిర్మాణాలకు తగ్గ స్థలం సమస్య నెలకొని ఉన్నది. ఈ స్థలాన్ని కేటాయించాలంటూ మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా, రాష్ట్ర పాలకుల్లో స్పందన కరువైనట్టుంది.
అసెంబ్లీ ఎన్నికలు అడ్డొచ్చినా, మళ్లీ అమ్మ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నది. అయినా, ఇంత వరకు స్థల కేటాయింపు విషయంగా ఎలాంటి నిర్ణయం వెలువడ లేదు. దీంతో ఏడాదిలోపు పనుల్ని ముగించి తీరుతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలకు రాష్ర్ట ప్రభుత్వ తీరు అసహనాన్ని రేకెత్తిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఎం మోహన్, ఆర్‌కే కౌహలాల్, మహేంద్రలతో కూడిన బృందం కలాం సమాధి పరిసరాల్ని మంగళ, బుధవారం పరిశీలన జరిపారు. అక్కడ ఇప్పటి వరకు సాగిన, సాగుతున్న పనుల్ని పరిశీలించి, స్థల కేటాయింపులో జాప్యంపై ఆ బృందం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.