
ఇక సెలవు
అబ్దుల్ కలాం అంత్యక్రియలు పూర్తి
ప్రధాని మోదీ సహా పలువురు రాక
ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (84) మరణవార్త జాతి యావత్తును కదిలించివేసింది. చిన్నా పెద్ద, పండిత పామర అనే తేడాలేకుండా కంటతడిపెట్టారు. గొప్ప మానవతావాది మమ్మువీడిపోయాడనే బరువెక్కిన గుండెలతో లక్షలాది మంది వీక్షిస్తుండగా ఆ మహామనిషి అంత్యక్రియలు రామేశ్వరంలో గురువారం పూర్తయ్యాయి. కలాంకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు హాజరై కలాంకు ఘన నివాళులర్పించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: మేఘాలయ రాష్ట రాజధాని షిల్లాంగ్‌లో ఈనెల 27వ తేదీన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా గుండెపోటు రావడంతో వేదికపైనే కుప్పకూలి తుదిశ్వాస విడిచిన సంగతి పాఠకులకు విదితమే. 28 వ తేదీన ఢిల్లీలో కలాం భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలు పూర్తిచేశారు. అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలన్న అంశం చర్చకు రాగా కలాం స్వస్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆయన బంధువుల కోర్కెను కేంద్ర ప్రభుత్వం అమలుచేసింది. ఢిల్లీ నుంచి ఈనెల 29వ తేదీన రామేశ్వరానికి తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి 10 గంటల వరకు వేలాదిగా ప్రజలు గంటల తరబడి క్యూలో నిల్చుని మరీ కలాంకు నివాళులర్పించారు.
అంత్యక్రియలకు ముందు కుటుంబ సభ్యుల నివాళి కోసం కలాం పార్థీవదేహాన్ని ఆయన అన్న 99 ఏళ్ల వృద్ధుడైన మహమ్మద్ ముత్తుమీర మరైక్కార్ ఇంటికి చేర్చారు. ఇంటి వద్ద సైతం వేలాది మంది కలాంను కడసారి చూసుకున్నారు. తెల్లవారుజాము 3.30 గంటలకు గానీ కలాం బంధువులు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం రాలేదు. గురువారం ఉదయం 9.35 గంటలకు ముగైద్దీన్ ఆండవర్ మసీదుకు కలాం భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. ఇస్లాం మత పెద్దలు సంప్రదాయరీతిలో అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తరువాత మసీదు నుంచి సైనిక వాహనంలో ఊరేగింపుగా 10.30 గంటలకు పేక్కరుంబు గ్రామంలోని అంత్యక్రియల ప్రాంగణానికి చేర్చారు.
ప్రధాని సహా పలువురు నివాళి: ప్రధాని నరేంద్రమోదీ ముందుగా కలాం భౌతికకాయం వద్ద పుష్పవలయాన్ని ఉంచి సుమారు 5 నిమిషాలు పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత తమిళనాడు గవర్నర్ కే రోశయ్య నివాళులర్పించి ప్రదక్షిణం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ, అధికార అనధికార ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యకారణాల వల్ల హాజరుకాకపోవడంతో ఆమె తరపున ఆర్థికమంత్రి ఓ పన్నీర్‌సెల్వం నేతృత్వంలో ఏడుగురు మంత్రుల బృందం కలాం భౌతికకాయానికి నివాళులర్పించారు. టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎండీకే అధినేత విజయకాంత్, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్, ఎండీఎంకే నేత వైగో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, కలాంకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖులు నివాళుల కార్యక్రమం ముగిసిన అనంతరం అంత్యక్రియల బాధ్యతను ఇస్లాం మతపెద్దలకు అప్పగించారు. మతపెద్దలు ప్రార్థనలు చేస్తూ 12 గంటల సమయానికి ఖననం పూర్తిచేశారు.
ముత్తుమీరకు పరామర్శలు: అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు కలాం అన్న మహమ్మద్ ముత్తుమీరను పరామర్శించారు. ప్రధాని మోదీ కలాంకు నివాళులర్పించిన తరువాత, ఖననం ముగిసిన తరువాత రెండుసార్లు మహమ్మద్ ముత్తుమీర వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు ఆయన పక్కనే కూర్చుని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ, ఎండీఎంకే అధ్యక్షులు వైగో సైతం ముత్తుమీరను పరామర్శించారు.
జనసంద్రంగా మారిన రామేశ్వరం: తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. రామేశ్వరం రోడ్లన్నీ జనసంద్రంగా మారిపోయాయి. వాహనాలను శివార్లలో నిలిపివేయడంతో జనం సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చారు. మసీదు నుండి అంత్యక్రియల ప్రాంగణానికి కలాం భౌతికకాయం ఊరేగింపు వస్తున్న తరుణంలో రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులుతీరారు. అనేక చోట్ల పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియలు నిర్వహించిన పరిసరాల్లోని ఇళ్లతోపాటు వృక్షాలు సైతం జనంతో నిండిపోయాయి. భారత దేశ చరిత్రలో తొలిసారిగా అంత్యంత శాంతియుత వాతావరణంలో కలాం అంత్యక్రియలు జరిగాయని విశ్లేషకులు భావించారు.
ఇదిలా ఉండగా, కలాం అంత్యక్రియల సందర్భంగా రాష్ట్రం యావత్తు చిన్నబోయింది. విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారు. వ్యాపార,వాణిజ్య సంస్థలన్నింటినీ స్వచ్చందంగా మూసివేశారు. సినిమా హాళ్లలో ప్రదర్శనలు నిలిపివేశారు. సినిమా షూటింగులు రద్దయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ జనం వాహనాలు లేక బోసిపోయాయి. కలాం అంత్యక్రియలను వీక్షించేందుకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు అక్కడి కార్మికులు పెట్రోలు పట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా సందు సందునా కలాం ఫొటోలు పెట్టి నివాళులర్పించారు.
రామేశ్వరానికి ప్రత్యేక రైళ్లు, బస్సులు నడిపారు. తమిళనాడు జాలర్లు మూడురోజుల పాటూ చేపల వేటకు వెళ్లకుండా నివాళి అర్పించారు. రాష్ట్రంలో అనేక చోట్ల కొవ్వొత్తులు వెలిగించి మౌన ప్రదర్శన నిర్వహించారు. చెన్నైకి చెందిన కలైఅరసన్ అనే ఆటో డ్రైవర్ ఉచిత సవారి నిర్వహించి కలాం పట్ల తనదైన శైలిలో శ్రద్దాంజలి ఘటించారు. రామేశ్వరం పాంబన్ వంతెన సమీపం సముద్రంలోని గుట్టపై అబ్దుల్ కలాం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వాట్సాప్‌లో ఆయన అభిమానులు పంపిన ఊహాచిత్రం ప్రత్యేక ఆకర్షణగా మారింది.