
ఆయన మళ్లీ తెలుగువాడిగా పుట్టాలి!
హైదరాబాద్: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజీ అబ్దుల్ కలాంకు తెలంగాణ శాసనసభ ఘన నివాళులు తెలిపింది. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ మధుసూదనాచారి కలాం మృతిపట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కలాం సేవలను కొనియాడారు. తమిళనాడులోని రామేశ్వరంలో కడు పేదరికంలో జన్మించిన కలాం అత్యున్నత శిఖరాలకు ఎదిగారని, దేశానికి అపరిమితంగా సేవలందించారన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, హైదరాబాద్ లోని డీఆర్డీఎల్ కు కలాం పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ తీర్మానాన్ని విపక్ష పార్టీలన్నీ బలపరిచాయి.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షనేత, సీఎల్పీ లీడర్ కె. జనారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేఎల్పీ నాయకుడు డాక్టర్ కె. లక్షణ్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంఐఎం తరఫున చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ లు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. అధికార టీఆర్ఎస్ తరఫున ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 'కలాంను రాష్ట్రపతిని చేయాలనే నిర్ణయం వెనుక తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కృషి ఉందన్నారు. 'అబ్దుల్ కలాంగారు మళ్లీ ఆంధ్రదేశంలోనే జన్మించాలని కోరుకుంటున్నా' అని ఎర్రబల్లి అనగానే సభలో చిన్నపాటి కలకలం చెలరేగింది. 'ఆంధ్రదేశమేంటి? తెలంగాణ కదా!' అని కొందరు సభ్యులు అరవడంతో సభలో నవ్వులు విరిశాయి. సీఎం, స్పీకర్ అందరూ నవ్వేశారు. ఆ తరువాత 'ఆ.. అదే.. తెలంగాణలోనే.. తెలుగు పౌరుడిగానే కలాం మళ్లీ జన్మించాలి' అని ముగించారు ఎర్రబెల్లి దయాకర్ రావు.