పేట్రియాట్ తరహాలో మనకో క్షిపణి! | india successfully test fires interceptor missile | Sakshi
Sakshi News home page

పేట్రియాట్ తరహాలో మనకో క్షిపణి!

Published Sat, Feb 11 2017 1:27 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

పేట్రియాట్ తరహాలో మనకో క్షిపణి! - Sakshi

పేట్రియాట్ తరహాలో మనకో క్షిపణి!

ఖండాంతర క్షిపణి వ్యవస్థలో భారతదేశం మరో మైలురాయిని దాటింది. మొట్టమొదటిసారిగా పూర్తిగా స్వదేశంలో తయారుచేసిన ఇంటర్‌సెప్టర్ మిసైల్‌ను ఒడిషా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. అబ్దుల్ కలాం ద్వీపంలో దీన్ని శనివారం ఉదయం పరీక్షించారు. భూమి వాతావరణానికి 50 కిలోమీటర్ల పైన ఉండే లక్ష్యాలను కూడా ఛేదించే పీడీవీ మిషన్ అని దీనికి పేరు పెట్టినట్లు డీఆర్‌డీఓ అధికారి ఒకరు తెలిపారు. పీడీవీ ఇంటర్‌సెప్టర్‌తో పాటు రెండు దశల టార్గెట్ మిసైల్‌ను కూడా విజయవంతంగా పరీక్షించామన్నారు. ప్రయోగ కేంద్రానికి 2వేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉన్న ఒక నౌక నుంచి ఒక క్షిపణిని ప్రయోగించగా, దాన్ని ఈ ఇంటర్‌సెప్టర్ విజయవంతంగా అడ్డుకుంది. 
 
దాడి చేసేందుకు వస్తున్న శత్రు క్షిపణిని రాడార్ అధారంతో గుర్తించి, ట్రాక్ చేసి దాన్ని ఛేదించడమే ఈ కొత్త ఇంటర్‌సెప్టర్ మిసైల్ పని. పూర్తిగా కంప్యూటర్ల నియంత్రణలో ఉండే పీడీవీ.. ఆ కంప్యూటర్ నుంచి తగిన ఆదేశం రాగానే బయల్దేరింది. దీనికి అత్యంత కచ్చితమైన ఇనెర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్) ఉంది. దాని సాయంతోనే లక్ష్యం దిశగా ఇది నూటికి నూరుశాతం కచ్చితంగా వెళ్తుంది. భూమి వాతావరణాన్ని దాటగానే దానికున్న హీట్ షీల్డ్ ఊడిపోతుంది. ఐఆర్ సీకర్ డోమ్ తెరుచుకుని, లక్ష్యం ఎక్కడుందో వెతుకుతుంది. వెంటనే దాన్ని అడ్డుకుని ధ్వంసం చేస్తుంది. గల్ఫ్ యుద్ధం సమయంలో స్కడ్ క్షిపణులను అడ్డుకున్న పేట్రియాట్ మిసైళ్ల తరహాలోనే ఈ పీడీవీ ఉంటుందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement