interceptor missile
-
రెండు మిస్సైల్స్ ఢీకొట్టుకోవడం చూశారా..
సాక్షి, న్యూఢిల్లీ : స్టార్ వార్స్ మూవీ చూశారా.. అందులో ఓ మిసైల్‌ను మరో మిసైల్ ఢీకొట్టుకుంటుంటాయి. ఆ సమయంలో మనకు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. అచ్చం అలాంటి సీనే సినిమాలో కాకుండా నిజజీవితంలో దర్శనం ఇస్తే.. అవును అదెక్కడో కాదు.. మన దేశంలోనే చోటు చేసుకుంది. గురువారం నిర్వహించిన శత్రు క్షిపణిని ఢీకొట్టే పరీక్ష విజయవంతమైంది. పై నుంచి వచ్చే శత్రు క్షిపణిని మరో క్షిపణితో కిందనున్న రాడార్ల సాయంతో సరాసరిగా ఢీకొట్టించారు. దానికి సంబంధించిన ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చింది. సాధారణంగా పాకిస్థాన్ మద్యంతర శ్రేణి క్షిపణులను ఎక్కువగా పరీక్షిస్తుంటుంది. వీటితో భారత్‌పై దాడి చేయాలని దాని వ్యూహం. అయితే, వాటిని నేరుగా ఢీకొట్టే లక్షిత క్షిపణులు ఇప్పటి వరకు భారత ఆర్మీ వద్ద లేవు. దీంతో తాజాగా తొలుత ఓ క్షిపణిని ప్రయోగించి దానిని మరో బాలిస్టిక్ క్షిపణితో విజయవంతంగా ఢీకొట్టించారు. గురువారం ఉదయం 9.45నిమిషాలకు ఇది పూర్తి చేశారు. కింద ఉండే రాడార్లు సిగ్నల్ ఇవ్వడం ద్వారా శత్రు క్షిపణిపైకి దూసుకెళ్లే క్షిపణి తనను తాను యాక్టివేట్ చేసుకొని నేరుగా ఓ బుల్లెట్‌ను మరో బుల్లెట్ ఢీకొట్టినట్లుగా ఢీకొడుతుంది. ఇది తొమ్మిదో పరీక్ష. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పాక్ నుంచి వచ్చే ఎలాంటి క్షిపణినైనా భారత్ మధ్యలోనే నిలువరించగలుగుతుంది. -
పేట్రియాట్ తరహాలో మనకో క్షిపణి!
ఖండాంతర క్షిపణి వ్యవస్థలో భారతదేశం మరో మైలురాయిని దాటింది. మొట్టమొదటిసారిగా పూర్తిగా స్వదేశంలో తయారుచేసిన ఇంటర్‌సెప్టర్ మిసైల్‌ను ఒడిషా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. అబ్దుల్ కలాం ద్వీపంలో దీన్ని శనివారం ఉదయం పరీక్షించారు. భూమి వాతావరణానికి 50 కిలోమీటర్ల పైన ఉండే లక్ష్యాలను కూడా ఛేదించే పీడీవీ మిషన్ అని దీనికి పేరు పెట్టినట్లు డీఆర్డీఓ అధికారి ఒకరు తెలిపారు. పీడీవీ ఇంటర్‌సెప్టర్‌తో పాటు రెండు దశల టార్గెట్ మిసైల్‌ను కూడా విజయవంతంగా పరీక్షించామన్నారు. ప్రయోగ కేంద్రానికి 2వేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉన్న ఒక నౌక నుంచి ఒక క్షిపణిని ప్రయోగించగా, దాన్ని ఈ ఇంటర్‌సెప్టర్ విజయవంతంగా అడ్డుకుంది. దాడి చేసేందుకు వస్తున్న శత్రు క్షిపణిని రాడార్ అధారంతో గుర్తించి, ట్రాక్ చేసి దాన్ని ఛేదించడమే ఈ కొత్త ఇంటర్‌సెప్టర్ మిసైల్ పని. పూర్తిగా కంప్యూటర్ల నియంత్రణలో ఉండే పీడీవీ.. ఆ కంప్యూటర్ నుంచి తగిన ఆదేశం రాగానే బయల్దేరింది. దీనికి అత్యంత కచ్చితమైన ఇనెర్షియల్ నేవిగేషన్ సిస్టమ్ (ఐఎన్ఎస్) ఉంది. దాని సాయంతోనే లక్ష్యం దిశగా ఇది నూటికి నూరుశాతం కచ్చితంగా వెళ్తుంది. భూమి వాతావరణాన్ని దాటగానే దానికున్న హీట్ షీల్డ్ ఊడిపోతుంది. ఐఆర్ సీకర్ డోమ్ తెరుచుకుని, లక్ష్యం ఎక్కడుందో వెతుకుతుంది. వెంటనే దాన్ని అడ్డుకుని ధ్వంసం చేస్తుంది. గల్ఫ్ యుద్ధం సమయంలో స్కడ్ క్షిపణులను అడ్డుకున్న పేట్రియాట్ మిసైళ్ల తరహాలోనే ఈ పీడీవీ ఉంటుందని అంటున్నారు.