
మోదీ పాలనను ఓర్వలేకే విమర్శలు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
పాలమూరు: మోదీ పాలన ద్వారా చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని హరిహర హైటెక్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శేషప్ప పదవీ విరమణ సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళితుల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అంబేద్కర్, అబ్దుల్‌కలాంలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 1975లో అప్పటి కేంద్రప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన పోరాటంలో భాగస్వాములయిన యోధులను ఈ సందర్భంగా సన్మానించారు. ఎమర్జెన్సీవి చీకటి రోజులని అన్నారు.
దేశం నలుమూలల నిరసన జ్వాలలు రగిలాయని, జిల్లా నుంచి యువకులు అనేక మంది ఉద్యమ బాట పట్టారని అన్నారు. ఏబీవీపీ జరిపిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న శేషప్ప ముందు వరుసలో ఉండి పోరాడి జైలు జీవితం గడిపారని అన్నారు. ఈ సందర్భంగా శేషప్పను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏలే శ్యామ్‌కుమార్, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, మురళిమనోహర్, లక్ష్మన్, నాగూరావునామాజి, శ్రీనివాస్,టి. ఆచారీ, రతంగ్‌పాండురెడ్డి, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.