కలాం విజన్ సాధనే అసలు నివాళి | Kalam Vision as original tribute | Sakshi
Sakshi News home page

కలాం విజన్ సాధనే అసలు నివాళి

Published Fri, Oct 16 2015 2:57 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

కలాం విజన్ సాధనే అసలు నివాళి - Sakshi

కలాం విజన్ సాధనే అసలు నివాళి

సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో అత్యంత కీలకపాత్ర పోషించే క్షిపణి వ్యవస్థల రూపకల్పనలో భారత్ సాధించిన ప్రగతి మొత్తం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దార్శనికత ఫలితమేనని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపై యువతలో ఆసక్తి రేకెత్తించిన వ్యక్తి కలాం అని కొనియాడారు. అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ శివార్లలో డీఆర్‌డీవో మిసైల్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమానికి పారికర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆయన కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) మిసైల్ కాంప్లెక్స్ పేరును ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్’గా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం శాస్త్రవేత్తలు, ఆర్‌సీఐ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ, డీఆర్‌డీవో పరిశోధనశాలలు డీఆర్‌డీఎల్, ఆర్‌సీఐ, ఏఎస్‌ఎల్‌లతో కూడిన మిసైల్ కాంప్లెక్స్‌కు కలాం పేరు పెట్టడం ఆయనకు అర్పించిన అతి చిన్న నివాళి మాత్రమేనని అన్నారు.

కలాం స్ఫూర్తితో ఐదేళ్లలో మిసైల్ టెక్నాలజీలో పూర్తిస్థాయిలో స్వావలంబన సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. డీఆర్‌డీవో సామర్థ్యం, లోటుపాట్లన్నింటినీ బేరీజు వేసిన తరువాత కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ఆరెంజ్, కౌటిల్య పేర్లతో ఏర్పాటు చేసిన రెండు కీలకమైన వ్యవస్థలను పారికర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్‌సీఐ డెరైక్టర్, రక్షణ మం త్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కె.విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
చొరబాట్లను అణచివేస్తాం
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లు గణనీయంగా తగ్గాయని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఆర్‌సీఐ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైమానిక దళంతోపాటు నావికా, పదాతిదళాల్లో మహిళా సైనికుల సేవలు మౌలిక సదుపాయాల లేమి ఉన్నచోట మినహా అన్ని విభాగాల్లోనూ వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు ఎయిర్‌షో మునుపటి మాదిరి అక్కడే కొనసాగుతుందని, మరోచోటికి మార్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement