
కలాం బంగ్లా.. కయ్యాల మంత్రికి?
న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖా సహాయ మంత్రి మహేష్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. రాజాజీ మార్గ్ లోని టైప్ VIII కేటగిరీకి చెందిన నెం.10 బంగ్లాకు ఆయన యజమాని కానున్నారు. ఇటీవలే మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజె అబ్దుల్ కలాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన మహేష్ శర్మ ఇపుడు అబ్దుల్ కలాం బంగ్లాను సొంతం చేసుకోనున్నారు. ఈ నెలాఖరుకు ఆయన ఆధీనంలోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వివాదం చెలరేగింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆప్ మండిపడుతోంది. అంతటి మహనీయుడు నివసించిన భవనాన్ని వివాదాస్పద మంత్రికి కేటాయించడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు తమిళనాడుకు సీనియర్ జర్నలిస్టు భగవాన్ సిగ్ దీనిపై ఇప్పటికే చేంజ్.ఆర్గ్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. మిసైల్ మ్యాన్ నివసించిన బంగ్లాను ఒక విజ్ఞాన కేంద్రంగా కానీ, మ్యూజియంగా కానీ తీర్చిదిద్దాలని కోరారు ఆయన వినియోగించిన వేలాది పుస్తకాలు, డాక్యుమెంట్లు, వాడిన వీణ అక్కడ ఉంచాలని కోరారు. కలాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి మహేష్ శర్మ ఆయన భవనాన్ని కేటాయించి కలాంను అవమానించొద్దని కోరారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం టైప్ viii భవనాలను కేబినెట్ స్థాయి ర్యాంక్ ఉన్న మంత్రులకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన సామన్లను ప్యాక చేసి ఉంచిన ఈ బంగ్లాను ఈ అక్టోబర్ 31కి ఖాళీ చేయనున్నారని సమాచారం.
కాగా ఇటీవల అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం తరువాత కలాం ముస్లిం అయినా కూడా జాతీయవాది , మానవతావాది అంటూ మంత్రి వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్నారు. దీంతోపాటు, మత ఘర్షణల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు, ఇండియాలో అమ్మాయిలు అర్థరాత్రి రోడ్లపై ఎందుకు తిరుగుతారంటూ మాట్లాడి విమర్శల పాలయ్యారు.