మా నాన్న ఆ రోజున ఆ దెబ్బ కొట్టాడు కాబట్టే... | Father's anger described in Abdul Kalam book | Sakshi
Sakshi News home page

మా నాన్న ఆ రోజున ఆ దెబ్బ కొట్టాడు కాబట్టే...

Published Sat, May 13 2017 11:22 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

మా నాన్న ఆ రోజున ఆ దెబ్బ కొట్టాడు కాబట్టే... - Sakshi

మా నాన్న ఆ రోజున ఆ దెబ్బ కొట్టాడు కాబట్టే...

‘రామా  అదిగో తాటక, బాణమేసి సంహారం చెయ్‌’ అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు ఎందుకో సంకోచిస్తున్నట్లనిపించింది విశ్వామిత్రుడికి. ‘‘అది తప్పా, ఒప్పా పక్కనబెట్టు, పాపమా కాదా అని ఆలోచించకు. ప్రజల రక్షణకోసం, లోక కళ్యాణంకోసం ఎంతటి పాపమైనా మూటగట్టుకోవలసిందే, స్త్రీ అని చూడకు, బాణం వేసెయ్‌’’ అన్నాడు. దానికి రాముడేమన్నాడో చూడండి ‘మా నాన్నగారు నన్ను మీతో పంపినప్పుడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళు, ఆయన ఏదిచెప్తే అది చెయ్యి అన్నారు. మా నాన్నగారి మాట మీద గౌరవం, మీ మీద గౌరవం. వేస్తున్నా బాణం’ అన్నాడు. అదీ తండ్రిమాటకిచ్చే విలువ అంటే.

శ్రీరామాయణం బాలకాండలోవచ్చే కుశనాభుడు అన్న రాజుకు ఘృతాచికి నూరుగురు కన్యలు పుట్టారు. వారు మహా అందగత్తెలు. వాళ్ళ అందం చూసి మోహించిన వాయుదేవుడు ‘మానవ కాంతలయితే మీ అందం క్షణికమే. నాకు భార్యలయితే దాన్ని శాశ్వతం చేస్తా’ అన్నాడు. దానికి వాళ్ళు ‘కన్యాదానం చేస్తే పది తరాల ముందు, పదితరాల వెనక తరిస్తారని ఆడపిల్లను కన్నతండ్రి ఎంతో మురిసిపోతాడు. మా తండ్రికూడా అంతే. తండ్రి చెప్పని వాళ్ళని మేం చేసుకోం. వివేకవంతుడివయితే మా నాన్నను అడుగు. ఆయన కన్యాదానం చేస్తే నీకు భార్యలమవుతాం’ అన్నారు. ఆగ్రహించిన వాయుదేవుడు వాళ్ళని గూని పొందమని శపించాడు. తరవాత తండ్రి వారిని బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం చేయడం, ఆయన శక్తికి వారు శాపవిముక్తులవడం జరిగింది. తండ్రిస్థానానికి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చింది భారతీయ సంస్కృతి.

తండ్రికి కోపం ఎప్పుడొచ్చినా సరే, అది అభ్యున్నతి కోసమే వస్తుంది తప్ప ఏదో పాడుచేయడానికో, నిందించడానికో కాదు... తండ్రి కోపం అమృతం పైకి పొంగి చిలికిన చినుకు. నేను మంచిగా చెబితే వినక ప్రమాదం తెచ్చుకుంటాడేమోనన్న ఆర్తిలో, కోపంలో తండ్రి కేకలేస్తాడు. అలా కేకలేయడం సంతోషకారకం కాదు తండ్రికి. తర్వాత ఎంత బాధపడతాడో! అరే, తొందరపడి దెబ్బలాడానే, వాడు చిన్నబుచ్చుకున్నాడనుకుని తండ్రి కుమిలిపోతాడు. చిన్న పిల్లలయితే తప్పు సరిచేసుకుంటారు. పెద్దవాడయిన తరువాత కూడా నన్ను మా తండ్రి తిట్టకూడదనుకోవడం మహాదోషం.

తండ్రి ఇంట్లో లేనప్పుడు ఎవరో ఏదో ఒక వస్తువు తీసుకొచ్చి ‘ఇది మీ నాన్నగారికి బహుమానం. ఆయనకు అందచేయండి’ అని చిన్న కుమారుడికి ఇచ్చి వెళ్ళారు. తండ్రి తిరిగొచ్చి ఈ వస్తువేమిటని అడిగితే కొడుకు ‘అది ఎవరో మీకు బహుమానమని ఇచ్చివెళ్ళా’ అని చెప్పాడు. వెంటనే ఎర్రబడ్డ కళ్ళతో తండ్రి ఈడ్చి ఒక్కలెంపకాయ కొట్టాడు. ‘బుద్ధుందిరా నీకు, అలా తీసుకోకూడదు. కారణం లేని బహుమానాలు చిట్టచివరకు దాస్యానికి కారణమవుతాయి. వాళ్ళమాట వినవలసి వస్తుంది.

ఎందుకు పుచ్చుకున్నావ్‌? మా నాన్నగారికే ఇవ్వండని చెప్పి ఉండాల్సింది’’ అన్నాడు తండ్రి. ‘‘మా నాన్నగారు ఆనాడు నన్ను కొట్టిన దెబ్బ జీవితంలో బహుమానాలు, పొగడ్తల విషయంలో ఎప్పుడూ జాగత్తగా మసలుకునేటట్లు చేసింది. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఆనాడు మా నాన్నగారు నన్ను కొట్టిన దెబ్బే’’ అని రాసుకున్నారు అబ్దుల్‌ కలాం తన పుస్తకం ‘ఇన్‌డామిటబుల్‌ స్పిరిట్‌’లో. అదీ తండ్రి కోపాన్ని అర్థం చేసుకోవడం అంటే. అదీ విధేయత అంటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement