‘విభజన విషయంలో మనం విజ్ఞతతో వ్యవహరించగలిగామా, సక్రమంగా వ్యవరించగలిగామా అనేది చరిత్ర మాత్రమే నిర్ణయిస్తుంది.’ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్న మాట ఇది. అబుల్ కలాం ఆజాద్– స్వతంత్ర భారత తొలి విద్యామంత్రిగానే సాధారణంగా చెప్పుకుంటారు. లేదా బహు భాషా పండితునిగా ప్రస్తావిస్తారు. కానీ ఆజాద్‌కు ఎంతో ఘనమైన గతం ఉంది. అంతకు మించి సమకాలీన చరిత్ర పరిణామాలు భవిష్యత్తు మీద ఎలా ప్రతిబింబించగలవో తూకం వేసినట్టు వెల్లడించగల దృష్టి ఆయన సొంతం. ఇందుకు పైన చెప్పిన మాటే గొప్ప సాక్ష్యం. అందులోని ‘విభజన’ అంటే దేశ విభజన (1947) అని గమనించాలి. నిజానికి విభజనను గాంధీజీ ‘స్పిరిచ్యువల్ ట్రాజెడీ’ అని నిరసించారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించుకోవడం గురించి భిన్నాభిప్రాయాలు కొత్తకాదు. భారత జాతీయ కాంగ్రెస్‌లో పలువురికీ, హిందూ మహాసభ వంటి సంస్థల నాయకులకీ కూడా దేశ విభజన మీద తీవ్ర నిరసనలు ఉన్నాయి. స్వాతంత్య్ర పోరాట క్రమంలో కొన్ని వివాదాంశాలు లేవని ఎవరూ చెప్పలేరు. అలా చెప్పడం అచారిత్రకం కూడా. దేశ విభజన తరువాతే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇది ఎక్కువ మందికి– అటు హిందువులు, ఇటు ముస్లింలకు కూడా రుచించని పరిణామం. ఆ పరిణామాలలో భాగస్వామి అబ్దుల్ కలాం. ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ అన్న తన గ్రంథంలో భారతీయులు జీర్ణించుకోలేని చాలా వాస్తవాలను ఆజాద్ కుండబద్దలు కొట్టినట్టు ప్రకటించారు. నేతలు గొప్పవారు కావచ్చు. కానీ వారిని సృష్టించిన చరిత్ర ఇంకా గొప్పది. దేశం అంతకంటే గొప్పది. ఆ వాస్తవాలను నిష్కర్షగా చెప్పడంలో ఆజాద్ అంతరంగం అదేనని అనిపిస్తుంది.
అబుల్ కలాం (నవంబర్ 11,1888–ఫిబ్రవరి 22, 1958) మక్కాలో పుట్టారు. కలాం తండ్రి ఢిల్లీలోనే అమ్మమ్మగారి ఇంట ఉండేవారు. ఆయన తండ్రి (అబుల్ కలాం తాతగారు) చిన్ననాడే కన్నుమూశారు. 1857లో అబ్దుల్ కలాం తండ్రి మక్కా వెళ్లిపోయారు. మళ్లీ కలాం పుట్టిన రెండేళ్ల తరువాత 1890లో కలకత్తా వచ్చారు. ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ, ఇంగ్లిష్ భాషలు ఆయన అక్కడే నేర్చుకున్నారు. నిజానికి ఆయన మత పెద్ద కావలసి ఉంది. కానీ కొంత విప్లవాత్మక ధోరణి వల్ల జర్నలిస్టుగా మారారు. రెండు పత్రికలు నడిపారు. అటు ఇస్లాం మీద ప్రగాఢ విశ్వాసం, ఇటు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకత ఉజ్జ్వలంగా ఉన్న ముస్లింలు ఆ కాలంలో చాలా దేశాలలో ఉండేవారు. అలాంటి ధోరణికి చెందినవారే అబ్దుల్ కలాం. అఫ్ఘానిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, టర్కీలలో పర్యటించి అలాంటి ధోరణి కలిగిన ముస్లిం ప్రముఖులను ఆయన కలుసుకున్నారు. బెంగాల్ విభజనను వ్యతిరేకించడం, ఖిలాఫత్ ఉద్యమంతో మమేకం కావడం ఇలాంటి ధోరణినే ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖిలాఫత్ ఉద్యమాన్ని విస్తరింపచేసిన గాంధీజీకి అబుల్ కలాం సన్నిహితుడు కావడం అత్యంత సహజంగా కనిపిస్తుంది. ఖిలాఫత్ ఉద్యమం ఉద్దేశం– టర్కీలోని ఖలీఫా పీఠాన్ని (ప్రపంచ ముస్లింల గురుపీఠం) పునరుద్ధరించడం. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓటమితో ఆ పీఠాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది. చిత్రమేమిటంటే, ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్థించడం సరికాదని మహమ్మదలీ జిన్నా వాదన. ఖిలాఫత్ ఉద్యమాన్నీ, భారత స్వాతంత్య్రోద్యమన్నీ అంటే రాజకీయోద్యమాన్నీ కలపరాదన్నది జిన్నా అభిప్రాయం. దానివల్ల రాజకీయాలలో మతం చొరబడుతుందని ఆయన వాదించాడు. 1928 వరకు జాతీయవాదిగా వ్యవహరించిన జిన్నా తరువాత తన నాయకత్వంలోని ముస్లింలీగ్‌ను దేశ విభజన కార్యక్రమం దిశగా నడిపించాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి హిందువులు, ముస్లింలు ఒకటి కాదని ప్రచారం చేశాడు. దీనిని అబ్దుల్ కలాం వ్యతిరేకించడమే మరొక చారిత్రక వైచిత్రి.
అబుల్ కలాం పూర్తి మత నిబద్ధుడు. వారి పూర్వీకులు కూడా సనాతన ముస్లింలే. కానీ భారతదేశం విడిపోవడానికి కలాం అంగీకరించలేదు. జిన్నా మహమ్మదీయుడే అయినా మత ఆచరణకు కడుదూరంగా ఉండిపోయాడు. కేవలం ఆయన తాతగారే మతం మారారు. కానీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికగా దేశ విభజన కోరాడు. అదే జరిగింది. అబుల్ కలాం నమోదు చేసిన జ్ఞాపకాలను యథాతథంగా వెల్లడించడం సాధ్యం కాలేదు. కొన్నింటిని పరిహరించి మాత్రమే వాటిని జనంలోకి పంపించవలసి వచ్చింది. స్వరాజ్య పోరాటంలో నెహ్రూ పాత్ర చరిత్రాత్మకమే అయినా అది విమర్శలకు అతీతం కాదు. మౌంట్‌బాటన్ (ఆఖరి ఆంగ్ల వైస్రాయ్), కమ్యూనిస్టు ముద్రాంకితుడు వీకే కృష్ణమేనన్‌ల ప్రభావంతో నెహ్రూ కొన్ని తప్పిదాలు చేశారని అబుల్ కలాం నిష్కర్షగా చెప్పారు. నెహ్రూ అంతటి వ్యక్తి మీద విమర్శలే అయినప్పటికీ వీటిని కొట్టి పారేయలేమన్నది చాలామంది అభిప్రాయం. 1940 నాటికి స్వాతంత్య్రోద్యమంలో కనిపించిన మొదటి ఐదురుగు ప్రముఖులలో అబుల్ కలాం కూడా ఒకరు. ఆయన వ్యాఖ్యలు ఇవి. ముస్లిం వేర్పాటువాద ధోరణికి ప్రతినిధిగా జిన్నా కనిపిస్తారు. సామ్యవాద పునాదిగా సామాజిక వ్యవస్థ అభివృద్ధిని ఆకాంక్షించిన వ్యక్తిగా నెహ్రూ అగుపిస్తారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారతీయత ఆధారంగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణ ం గురించి ఆలోచించిన మనిషిగా వినుతికెక్కారు. అబ్దుల్ కలాం అఖండ భారత్ కోసం తుదికంటా కట్టుబడిన యోధుడిగా దర్శనమిస్తారు. కేబినెట్ మిషన్ ప్రతిపాదనలను అంగీకరించడం ద్వారా నెహ్రూ ముస్లిం లీగ్‌కు ప్రాధాన్యం పెరగడానికి అవకాశం కల్పించారన్నది కలాం అభియోగం. ఆ సమయంలో పటేల్ కనుక కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటే ముస్లింలీగ్ ఒక ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఇచ్చేవారు కాదని కలాం నమ్మకం. 1946 వరకు కలాం కాంగ్రెస్ అధ్యక్షుడు. తన తరువాత ఆచార్య జేబీ కృపలానీ ఆ పదవికి వచ్చినా, వాస్తవికంగా వ్యవహారాలు నడిపినవారు నెహ్రూయే. మొదటి నుంచి నెహ్రూను గాంధీజీకి ఆప్తునిగా చెబుతారు. కానీ కలాం తరువాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు నెహ్రూకు ఇవ్వడం గాంధీజీకి కూడా పూర్తిగా సమ్మతం కాలేదని కలాం వెల్లడించారు. పటేల్‌కు పగ్గాలు ఇవ్వాలన్నది గాంధీజీ కోరిక. కానీ పటేల్ తన వారసునిగా రావడం కలాంకు సమ్మతం కాలేదు. నిజానికి ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరించి, పాకిస్తాన్ విడిపోతేనే తలనొప్పి వదులుతుందని తీవ్ర నిస్పృహలో పడిన పటేల్ భావించారని ఆజాద్ అంచనా. తాత్కాలిక మంత్రివర్గంలో ఆర్థికమంత్రి లియాఖత్ అలీ (ముస్లింలీగ్ నాయకుడు, విభజన తరువాత పాకిస్తాన్ ప్రధాని) నెహ్రూనూ, పటేల్‌నూ ముప్పుతిప్పలు పెట్టారు. ఆయన ప్రవేశ పెట్టిన బడ్జెట్ సైతం ముస్లింలీగ్ అనుకూల రాజకీయమే. ఆయన విధానాలు మొత్తం దేశంలోని ధనికులకు శరాఘాతలయ్యాయి. అది ధనికుల మీద కక్షతోనో, పేదల మీద ప్రేమతోనో లియాఖత్ చేయలేదు. వారంతా కాంగ్రెస్‌ను ఆర్ధికంగా ఆదుకుంటున్నవారే. వీటి మూలంగానే పటేల్ పాకిస్తాన్ ఏర్పాటును అంగీకరించిన తొలి కాంగ్రెస్ వాదిగా చరిత్రకు ఎక్కారు. ఇంకా చిత్రం– మౌంట్‌బాటన్‌ను భారతదేశానికి పంపించినదే విభజన ప్రణాళికను అమలు చేయడానికి. కానీ అతడు దేశంలో అడుగు పెట్టడానికి ముందే పటేల్ విభజనకు యాభై శాతం అంగీకారంతోనే ఉన్నారని కలాం నిశ్చితాభిప్రాయం. ‘విభజన జెండాను ఎగరవేసినవారు జిన్నాయే, కానీ దానిని భుజానికెత్తుకున్నవారు పటేల్’ అనేదాకా అబుల్ కలాం వెళ్లారు. ఇక్కడ పటేల్ ఆలోచన వేరు. పాకిస్తాన్‌ను కోరుకున్నా, విభజన జరిగినా మళ్లీ ముస్లింలు మనసు మార్చుకుని సరిహద్దు రేఖలు చెరుపుకుని వచ్చి చేరిపోతారని ఆయన అంచనా. ఈ అంచనా తప్పింది. లియాఖత్ అలీఖాన్‌కు అలాంటి వేధింపునకు అవకాశం కల్పించినవారు సాక్షాత్తు పటేల్ అని కలాం అభిప్రాయం. ఎలాగంటే, ఆర్థికశాఖను పటేల్‌కు అప్పగించాలని వేవెల్ (మౌంట్‌బాటన్‌కు ముందు ఉన్న వైస్రాయ్. విభజనను వేగంగా అమలు చేయడానికి ఇతడి ఉద్యోగం పీకి, మౌంట్‌బాటన్‌ను హుటాహుటిన భారత్‌కు పంపారు) అనుకున్నారు. కానీ పటేల్ హోంశాఖకే మొగ్గు చూపారు.
నెహ్రూ, అబుల్ కలాం సన్నిహిత మిత్రులు. కానీ నెహ్రూ చేసిన తప్పిదాలను తాను క్షమించలేనని రాసుకున్నారాయన. అందులో మొదటిది 1936 నాటి ఎన్నికలలో నెహ్రూ అనుసరించిన విధానం. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం దేశంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సెస్‌లలో తప్ప మిగిలిన చోట్ల ముస్లింలీగ్‌కు భంగపాటు తప్పలేదు. కొన్నిచోట్ల కాంగ్రెస్‌కు కూడా మెజారిటీ రాలేదు. ఆ సమయంలో ఆ రెండు చోట్ల తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని ముస్లింలీగ్ కోరింది. అలాగే కాంగ్రెస్‌కు మెజారిటీ తక్కువైన చోట లీగ్ మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. ఇందుకు నెహ్రూ పూర్తిగా వ్యతిరేకించారు. ఈ పరిణామమే జిన్నాను ద్విజాతి సిద్ధాంతం వైపు, క్రమంగా దేశ విభజన వైపు అడుగులు వేసేటట్టు చేసిందని చరిత్రకారుల అభిప్రాయం. వీరందరికంటే ముందు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినవారు అబుల్ కలాం. హిందువులను విశ్వసించలేమన్న అభిప్రాయానికి జిన్నా వచ్చేటట్టు చేసింది ఆ పరిణామమే. అప్పటి నుంచి ఆయన మాజీ జాతీయవాది అయ్యారు. 1940 నాటి లాహోర్ తీర్మానంలో ముస్లింలీగ్ దీనినే సుస్పష్టంగా వెల్లడించింది.
మౌంట్‌బాటన్ దేశానికి వచ్చిన తరువాత నెహ్రూలో క్రమంగా వచ్చిన మార్పునకు అంతా చెప్పే కారణం ఒకటి ఉంది. అదే అబుల్ కలాం వంటి పెద్దమనిషి కూడా చెప్పారు– ఆ మార్పును నెహ్రూలో తీసుకువచ్చిన మనిషి మౌంట్‌బాటన్ భార్య ఎడ్వినా. నెహ్రూ అడుగులను చూసి, విభజన దిశగా సాగుతున్న నడకను చూసి ఒక దశలో అబుల్ కలాం హెచ్చరించారట. ఇదంతా చూస్తే, దేశ విభజన ముస్లింలీగ్ వల్ల కాదు, కాంగ్రెస్‌తోనే జరిగిందన్న అపవాదు వచ్చేలా ఉందని కలాం హెచ్చరిక సారాంశం. విభజనకు ఆమోదం చెబితే మనలని చరిత్ర క్షమించదని కూడా కలాం నెహ్రూను హెచ్చరించారు. సరైన పరిష్కారం దొరికే వరకు వేచి ఉందామంటూ ఆయన ఎంత నచ్చ చెప్పినా కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. ‘వాస్తవాలను చూడ నిరాకరించడం, వారిని కమ్మేసిన నైరాశ్యం వారి దృష్టిని మసకబారేటట్టు చేసింది’ అని చెప్పుకున్నారు కలాం.
తన సమకాలికుల తప్పులు చూడడానికే అబుల్‌కలాం పరిమితం కాలేదు. ఆఖరికి తన వల్ల జరిగిన తప్పిదాలను కూడా అంగీకరించారు. 1946లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టడం తప్పిదమని, గాంధీజీ పరిభాషలో ‘హిమాలయమంత తప్పిద’మని ఆయన అన్నారు. ఆ సంవత్సరం ఏప్రిల్ 15న విభజన అంశం గురించి విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన మాట చరిత్రాత్మకమైనది. ‘దేశ విభజన కోసం ముస్లింలీగ్ ప్రతిపాదించిన ప్రణాళికను ప్రతి కోణం నుంచి పరిశీలించవలసిన అవసరం నాకు ఉంది. ఒక భారతీయునిగా ఆ ప్రణాళిక ప్రభావం భవిష్యత్తు మీద ఎలా ఉంటుందో యోచించవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. భవిష్యత్తులో ఆ ప్రణాళిక ముస్లిం జనాభా మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా నేను ఒక ముస్లింగా గమనించవలసి ఉంది. ఇవన్నీ పరిశీలించిన తరువాత ఆ ప్రణాళిక భారత్‌కు మాత్రమే కాదు, మొత్తం ముస్లింలకు, ముఖ్యంగా భారతీయ ముస్లింలకు ఎంతో చేటు చేస్తుందని నా అభిప్రాయం. ఇది సమస్యను పరిష్కరించదు. పైగా మరిన్ని కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది’ అన్నారు. నిజమే. వర్తమానం అదే నిరూపిస్తున్నది. ‘తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లు తమ సమస్యలను పరిష్కరించుకుని సఖ్యంగా ఉంటాయని ఎవరూ చెప్పలేరు’ అన్నారాయన (1958). ఇది నిజమైంది. పశ్చిమ పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా అవతరించింది. తూర్పు పాకిస్తాన్‌లో కూడా సిం«ద్, బలూచిస్తాన్, వాయువ్య సరిహద్దు ప్రాంతాలకు ఎవరి ఆకాంక్షలు వారికి ఉన్నాయని కలాం చెప్పారు. పాకిస్తాన్ మనుగడ గురించి కలాం చెప్పిన జోస్యం చాలా వరకు నిజమైంది. ఆయన చూస్తూ ఉండగానే ఆ దేశం మత దేశంగా మారిపోయింది. సైనిక పాలన కింద మగ్గింది. జిన్నా మరణం, లియాఖత్ అలీఖాన్ హత్య దక్షిణాసియాను కుదిపేసిన పరిణామాలే అయ్యాయి. ‘దేశ విభజన విషయంలో మనం విజ్ఞతతో వ్యవహరించామా? సక్రమంగా వ్యవరించగలిగామా?’ ఆయన ప్రశ్నకు బదులు చెప్పడం ఇప్పుడు ఎవరికీ కష్టం కాదు.
- డా. గోపరాజు నారాయణరావు
చరిత్ర సాక్షి భవిష్యవాణి
Published Sun, May 13 2018 12:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment