
అమెరికా వర్సిటీలో కలాం ఫెలోషిప్
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాంకు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయం అరుదైన గుర్తింపును ఇచ్చింది. ఆయన గతంలో తమ యూనివర్సిటీని సందర్శించడాన్ని గౌరవిస్తూ ఆయన పేరిట డాక్టోరియల్ గ్రాంట్స్ ను ఏర్పాటుచేసింది. 'ఏపీజే అబ్దుల్ కలాం ఫెలోషిప్' అని దానికి పేరు పెట్టింది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా(యూఎస్ఎఫ్)ను అబ్దుల్ కలాం 2012లో సందర్శించారు.
ఆ సమయంలో ఆయన మొత్తం ఆ యూనిర్సిటీ బృందంపై తిరుగులేని ప్రభావం చూపించారు. ఆ సందర్భాన్ని గౌరవిస్తూ ఏకం రూ.1,03,71,660ల ఫెలోషిప్ ను ప్రారంభించింది. శాస్త్రసాంకేతిక రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో పీహెచ్డీ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ ఫెలోఫిప్ ను అందిస్తారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ అబ్దుల్ కలాం పేరిట ఒక ఫెలోషిప్ ను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. 2016-17 నుంచి ఈ ఫెలోషిప్ అందించనున్నారు.