ఇక సెలవంటూ...
రామేశ్వరం : మహామనిషి మహాభినిష్క్రమణం. బంధువులు, అభిమానులు, అనుచరులు కడసారి వీడ్కోలు పలకగా ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. బంధువులు, అభిమానులు, అనుచరులు తరలి రాగా మిస్సైల్ మ్యాన్కు భారతావని వీడ్కోలు పలికింది. ముద్దుబిడ్డను మాతృభూమి శోకతప్త హృదయంతో సాగనంపింది. సొంతగడ్డపైనే తన అంతిమ సంస్కరాలు పూర్తి కావాలన్న కలాం ఆకాంక్ష మేరకు ఆయన సొంత గడ్డపైనే అంత్యక్రియలు జరిగాయి.
కలాం అంత్యక్రియలకు వీవీఐపీలతో పాటు రాజకీయ, శాస్త్ర-సాంకేతిక రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. కేరళ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నీరు సెల్వం హాజరు కాగా ఆయనతో పాటు పలువురు మంత్రులు, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కలాం అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిస్సైల్ మ్యాన్కు తుది నివాళులు అర్పించారు. కలాం భౌతికాకాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఆ తర్వాత ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత కలాం పార్థివ దేహాన్ని ఖననం చేశారు.
మరోవైపు రామేశ్వరం జనసంద్రమైంది. కలాంను చివరిసారిగా చూసేందుకు తరలివచ్చిన అభిమాన గణంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అంతకు ముందు జరిగిన కలాం అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. రోడ్డుపై బారులు తీరిన జనం ...కలాం సలామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.