మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌కలామ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
మద్రాసు హైకోర్టు తీర్పు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌కలామ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అబ్దుల్‌కలామ్ సోదరుడు మహ్మద్‌ముత్తు మీరాన్ మరక్కయ్యర్ (99) మద్రాసు హైకోర్టులో ఇటీవల వేసిన పిటిషన్ శుక్రవారం అత్యవసర విచారణకు వచ్చింది. పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. భారత 11వ రాష్ట్రపతిగా ఉండిన తన తమ్ముడు అబ్దుల్ కలామ్ జీవితాంతం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని ముత్తుమీరాన్ తెలిపాడు. తన తమ్ముని వద్ద సలహాదారుగా పనిచేసిన పొన్‌రాజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అబ్దుల్‌కలామ్ విజన్ ఇండియా పేరుతో పార్టీని స్థాపించాడని, పార్టీ జెండాపై తన తమ్ముడి ఫొటోను ముద్రించాడని తెలిపారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఇతర రాజకీయ పార్టీల నేతల ఫొటోలు, విగ్రహాలకు ముసుగు తగిలించినట్లే తన సోదరుడి బొమ్మలకు కూడా మూసివేయడం బాధాకరమని అన్నారు. తన సోదరుడు పేరు ప్రతిష్టలకు కళంకం తెస్తూ అబ్దుల్‌కలామ్ పేరుతో ఏర్పాటైన పార్టీ కార్యవర్గాన్ని (గౌరవాధ్యక్షులు వి.పొన్‌రాజ్, ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శి ఆర్ తిరుచెందూరన్) రద్దు చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎస్ విమల అబ్దుల్‌కలామ్ పార్టీని, కార్యవర్గాన్ని నిషేధిస్తున్నట్లు శుక్రవారం తీర్పు చెప్పారు.