కలాం చివరి చూపు కోసం..
చెన్నై: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టినగడ్డ రామేశ్వరం ఆయన పార్థివదేహం దర్శనం కోసం ఎదురు చూస్తోంది. తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం ఇంటి దగ్గర జనం బారులు తీరారు. కలాం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు చివరి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం తీసుకురానున్నారు. కలాం ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కలాం చివరి దర్శనం కోసం బంధువులు అందరూ వచ్చారని, ఆత్మీయులు పెద్దసంఖ్యలో వచ్చారని ఆయన మనవడు ఏపీజే ఎంకే షేక్ సలీం చెప్పారు. రాత్రి 8 గంటలకు వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని రామేశ్వరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉంచి, ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తామని తెలిపారు.
ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో రామేశ్వరం సమీపంలోని మధురైకు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రామేశ్వరం తరలిస్తారు. రామేశ్వరంలో ఓ పేద కుటుంబంలో జన్మించి.. దేశం గర్వపడే శాస్త్రవేత్తగా ఎదిగి.. అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించి.. దేశానికి ఎనలేని సేవలు అందించిన కలాంకు నివాళులు అర్పించేందుకు బాధాతప్త హృదయాలతో నిరీక్షిస్తున్నారు. షిల్లాంగ్లో ఐఐఎంలో ప్రసంగిస్తూ కలాం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.