రేపు అబ్దుల్ కలాం అంత్యక్రియలు
నేడు రామేశ్వరానికి భౌతికకాయం
రక్షణ వలయంలో రామేశ్వరం
ప్రధాని సహా పలువురు రాక
30న రాష్ట్ర ప్రభుత్వ సెలవు
చెన్నై, సాక్షి ప్రతినిధి:భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు రామేశ్వరం సన్నద్ధం అవుతోంది. పూర్తి అధికార లాంఛనాలతో ఈనెల 30వ తేదీన అబ్దుల్ కలాం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కలాం భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి ఆయన స్వస్థలమైన రామేశ్వరానికి బుధవారం ఉదయం చేరుస్తారు. బుధవారం అంతా ప్రజల సందర్శనార్థం ఉంచి గురువారం ఉదయం ముస్లిం మత సంప్రదాయంలో ఖననం చేస్తారు. ఇందుకోసం రామేశ్వరంలో కట్టపల్లి, నటరాజపురం, ఉదయం పాలిటెక్నిక్ సమీపంలో ఇలా మూడు స్థలాలను ఎంపిక చేశారు. ఈ మూడు స్థలాలను రామేశ్వరం జిల్లా కలెక్టర్ నందకుమార్, ఎస్పీ మయిల్‌వాహనం మంగళవారం పరిశీలించారు. కలాం బంధువులు ఈ మూడు స్థలాల్లో ఒకదానిని ఎంపిక చేసుకున్న తరువాత ఖననం జరిగే ప్రదేశాన్ని ఖరారు చేస్తారు.
రామేశ్వరంలో రక్షణ వలయం: భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు వీవీఐపీలు హాజరుకానున్న దృష్ట్యా రామేశ్వరం రక్షణ వలయంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఆరు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, ఇంకా అధికార, అనధికార ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 30న సెలవు: అబ్దుల్ కలాం అంత్యక్రియల దృష్ట్యా ఈనెల 30 వ తేదీన సెలవు దినంగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు సెలవుదినాన్ని పాటించాలని మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
కలామ్ మరణ వార్త వెలువడగానే ఏడురోజులు సంతాపదినాలుగా ప్రకటించిన ప్రభుత్వం చెన్నై సచివాలయంలో జాతీయ పతాకాన్ని అవనతం చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ఇవ్వక పోవడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్, పీఎంకే నేతలు ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మూడు దినాలు సంతాపం పాటిస్తున్నట్లు వెల్లడించారు.