
కలాం అంత్యక్రియలకు జయ దూరం
చెన్నై: అనారోగ్యం కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరుకావడం లేదు. బుధవారం జయలలిత ఈ విషయాన్ని వెల్లడించారు. 'అబ్దుల్ కలాం అంటే నాకు ఎనలేని గౌరవం. ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించాలని ఉన్నా.. ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రయాణించడానికి సాధ్యం కావడం లేదు' అని జయలలిత చెప్పారు. కలాం మృతికి సంతాప సూచకంగా గురువారం తమిళనాడులో సెలవు ప్రకటించారు. కలాం కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన అంత్యక్రియలకు స్థలం కేటాయించినట్టు జయలలిత చెప్పారు.
గురువారం ఉదయం రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నై నుంచి రామేశ్వరం 600 కిలో మీటర్ల దూరంలో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. తమిళనాడు తరపున మంత్రులు పన్నీర్ సెల్వం, విశ్వనాథన్, వైద్యలింగం తదితరులు వెళ్లనున్నారు.