పోఖ్రాన్‌లో అణు పరీక్షల దృశ్యం (ఫైల్), పోఖ్రాన్–2 జాయింట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అబ్దుల్ కలాంతో గోపాల్ కౌశిక్ (ఫైల్)
పోఖ్రాన్ పరీక్షలు.. భారతదేశం తన అణు పాటవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సందర్భమది. తొలిసారి 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో పోఖ్రాన్–1 పేరిట ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్‌తో అణు పరీక్షలు నిర్వహించగా, 1998లో ప్రధాని వాజ్‌పేయి ఆదేశాలతో ఆపరేషన్ శక్తి(పోఖ్రాన్–2) పేరుతో అణు పరీక్షలు నిర్వహించారు. కానీ 1974తో పోల్చుకుంటే 1998లో అణు పరీక్షల నిర్వహణకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది.
అమెరికా నిఘా సంస్థ సీఐఏకు చెందిన శక్తిమంతమైన ఉపగ్రహాలు ఈ ప్రాంతంలో నిఘా పెట్టడంతో వ్యూహాత్మకంగా వాటిని బురిడీ కొట్టిస్తూ అధికారులు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ (రిటైర్డ్) గోపాల్ కౌశిక్ , చేతన్ కుమార్‌లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ చేసింది. నాటి ఆపరేషన్ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై తమ అనుభవాలను వీరిద్దరూ మీడియాతో పంచుకున్నారు.
ఎన్నో జాగ్రత్తలు..
ఈ విషయమై కల్నల్ గోపాల్ కౌశిక్ మాట్లాడుతూ.. ‘1974తో పోల్చుకుంటే 1998లో ఆపరేషన్ శక్తి సందర్భంగా భారత్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చి ంది. ఎందుకంటే తొలిసారి అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భారత్ సామర్థ్యం, ఉద్దేశం గురించి ఎవ్వరికీ తెలియదు. అలాగే అణు బాంబును ఎక్కడ పరీక్షిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు అవసరమైనన్ని ఉపగ్రహాలు అమెరికా వద్ద అప్పట్లో లేవు.
కానీ 1998 నాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే 1995–96లో భారత్ అణు పరీక్షలకు రహస్యంగా చేస్తున్న ఏర్పాట్లు బయటకు పొక్కడంతో అమెరికా సహా అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో పరీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియడంతో శక్తిమంతమైన అమెరికా నిఘా ఉపగ్రహాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి’ అని తెలిపారు.
ఎదురైన సవాళ్లు ఎన్నో..
అణు పరీక్షల ఏర్పాట్ల సందర్భంగా ఎదురైన ప్రతికూల పరిస్థితులపై కౌశిక్ స్పందిస్తూ.. ‘ఈ పరీక్షల ఏర్పాట్లలో శాస్త్రవేత్తలు, అధికారులకు వాతావరణం ప్రధాన సవాలుగా నిలిచింది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటే శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్ 3 డిగ్రీలకు పడిపోయేది. అంతేకాకుండా ఈ ప్రాంతమంతా విషపూరితమైన పాములు, తేళ్లు ఉండేవి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది.
దీంతోపాటు అణు బాంబుల్ని భూమిలోపల అమర్చేందుకు తవ్విన ఆరు గుంతల్లో నీటి ధార రావడం మరో తలనొప్పిగా మారింది. విపరీతమైన వేడి ఉన్న ఈ ప్రాంతంలో వర్షపు కోట్ ధరించి అణు బాంబును అమర్చేందుకు తవ్విన గుంతల్లో దిగి పనిచేయడం శాస్త్రవేత్తలు, సైనికులకు ఇబ్బందికరంగా తయారైంది. అలాగే వీటిలో అమర్చిన లోహపు పరికరాలు నీటి ప్రభావంతో తుప్పుపట్టడం మొదలుపెట్టాయి. దీంతో నీటిని బయటకు తోడేద్దామని తొలుత అనుకున్నాం.
అయితే నీటి ప్రభావంతో మారిపోయే ఇసుక రంగును, అక్కడ మొలిచే పచ్చికను సైతం విదేశీ నిఘా ఉపగ్రహాలు గుర్తించే వీలు ఉండటంతో మరో మార్గాన్ని అన్వేషించాం. దూరంగా ఉన్న ఇసుకలో పైపుల్ని లోతుగా పూడ్చి వాటిద్వారా నీటిని పంపింగ్ చేసేవాళ్లం. దీంతో పైకి కన్పించకుండానే నీళ్లు పూర్తిగా ఇంకిపోయేవి’ అని అన్నారు. ‘తవ్విన గుంతల్లో అణు బాంబుల్ని అమర్చిన అనంతరం వాటిని ఇసుక బస్తాలతో నింపడం మరో సవాలుగా నిలిచింది. ఇసుక బస్తాలను పైనుంచి విసిరేస్తే అణు బాంబులు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, అధికారులు చురుగ్గా ఆలోచించారు.
ఓ జాలీ లాంటి పరికరంతో బ్యాగుల్ని జారవిడిచే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇలా 6,000 ఇసుక బస్తాలను జారవిడిచేందుకు వారం పట్టే అవకాశం ఉండటంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. చివరికి బిలియర్డ్స్ ఆటలో వినియోగించే క్యూ స్టిక్స్‌తో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంతల్లో పైపుల్ని ఒకదానిపక్కన మరొకటి అమర్చిన అధికారులు, వాటిపై ఇసుక బస్తాలను జారవిడిచారు. ఈ వ్యూహం పనిచేయడంతో ఏర్పాట్లు పూర్తిచేసి 1998 మే 11 నుంచి 13 మధ్య ఐదు అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించాం’ అని తమ అనుభవాలను పంచుకున్నారు.
పగలు క్రికెట్.. రాత్రి ఏర్పాట్లు
‘అమెరికా నిఘా ఉపగ్రహాల్ని పక్కదారి పట్టించేందుకు వినూత్నంగా ఆలోచించాం. పోఖ్రాన్ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, శాస్త్రవేత్తలు పగటిపూట క్రికెట్ ఆడేవారు. దీంతో చుట్టుపక్కల ఉండే జనాలు బాగా గుమిగూడేవారు. జనసంచారం ఉండటంతో విదేశీ నిఘా వర్గాలు పోఖ్రాన్‌లో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎంతమాత్రం అనుమానించలేదు. సాధారణ సైనికులే అక్కడ ఉన్నారని భావించాయి.
కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయోగ పనుల్ని చేపట్టేవారు. అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ ఆర్.చిదంబరం, బార్క్ మాజీ చీఫ్ అనీల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం సహా 100 మంది శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. శాస్త్రవేత్తల కదలికల్ని నిఘా ఉపగ్రహాలు గుర్తించకుండా వారందరూ సైనిక దుస్తులు ధరించేవారు. అబ్దుల్ కలామ్‌ను మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అని, చిదంబరాన్ని మేజర్ నటరాజ్‌గా వ్యవహరించేవారు’ అని కౌశిక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment