ప్రస్తుతం యువతరం చాలా ఇష్టంగా లాగించే చికెన్ వెరైటీలో కేఎఫ్‌సీ ఒకటి. చాలామందికి ఈ కేఎఫ్‌సీ చికెన్ అంటే మహా ఇష్టం. ఫ్రైడ్ చికెన్‌లో ఇంతలా ప్రత్యేకతను సంతరించుకునేలా విభిన్నంగా ఎలా తయారు చేయాగలిగారో వింటే ఆశ్చర్యపోతారు. అందులోనూ లేటు వయసులో తన ఆర్థిక భద్రత గురించి కలిగిన ఆందోళన బిజినెస్ మెదలుపెట్టాలన్న ఆలోచనకు దారితీసింది. అదే చివరికి వెరైటీ రెసిపీని తయారు చేసేందుకు పురిగొల్పింది. చివరకు కనివిని ఎరుగని రీతీలో సక్సెస్‌ని అందుకుని స్ఫూర్తిగా నిలిచాడు. కలను సాకారం చేసుకోవాలన్న తపన ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు.
అతడే కేఎఫ్‌సీ చికెన్ సృష్టికర్త కల్నల్ హార్లాండ్ సాండర్స్. అందరూ యంగ్ ఏజ్‌లో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. కొందరూ పూర్తి స్థాయిలో విజయవంతమవ్వగా మరికొందరూ..చిన్న చిన్న విజయాలతో సరిపెట్టుకుంటారు. చివరికి రిటైర్డ్ వయసు వచ్చేటప్పటికీ ఎంతోకొంత ఆర్థిక భద్రతతో కాలం వెళ్లదీస్తుంటారు. అయితే కల్నల్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చెప్పాలంటే ఎన్నో బిజినెస్‌లు చేశాడుగానీ ఎందులోనూ మంచి విజయం దక్కించుకోలేదు. అలా 65 ఏళ్లు వచ్చేటప్పటికీ అతడు ఎందులోనూ సక్సెస్ అందుకోని వ్యక్తిగా మిగిలిపోయాడు.
పోనీ మిగతా జీవితం సాఫీగా గడిపేందుకు ఎలాంటి ఆర్థిక భద్రతను వెనకేసుకోలేదు. అతడి వద్ద కేవలం రూ. 8వేల రూపాయలే ఉన్నాయి. ఒక్కసారిగా ఏంటీ జీవితం ఇలా వృధాగా అయిపోయిందన్న బాధ కల్నల్‌ని నిలువనివ్వలేదు. ఆ సమయంలోనే తాను ఒక రుచకరమైన రెసిపీని తయారు చేయాలని గట్టిగా అనుకున్నాడు. తాను తయారు చేసే రెసిపీని చూడగానే తానే గుర్తొచ్చేలా.. అత్యద్భుతంగా తయారు చేయాలనుకున్నాడు. తన వద్ద కొద్దిపాటి వనరులతో చికెన్‌తో వెరైటీ రెసిపీ ఏదైనా చేయాలనుకున్నాడు. చెప్పాలంటే రెస్ట్ తీసుకునే వయసులో లక్ష్యం కోసం ఆహర్నిశలు కష్టపడటం మొదలుపెట్టాడు కల్నల్.
ఫ్రైడ్ చికెన్ అంటే చాలామందికి ఇష్టమనే విషయం గ్రహించాడు. దానిలోనే ప్రత్యేక రుచితో కూడిన వెరైటీ ఫ్రైడ్ చికెన్ చేయాలనుకున్నాడు. అక్కడకు వరకు బాగానే ఉంది. తాను తయారు చేసిన ఫ్రైడ్ చికెన్‌లు సమీపంలోని రెస్టారెంట్ల వద్దకు వెళ్లి చేసి చూపించి వాళ్ల చేత శెభాష్ అనిపించుకోవడం అంత ఈజీ కాలేదు కల్నల్‌కి. ఏకంగా ఒక వెయ్యి తొమ్మిది సార్లుకు పైగా అతడు చేసిన రెసిపీ రిజక్ట్ అయ్యింది. విసుగు, కోపం వచ్చేస్తున్నా.. వెనకడుగు వేయకుండా వారి చేత బాగుంది అని ఒప్పుకునేదాక ప్రయత్నం విరమించలేదు. ఒక రోజు మజ్జిగలో నానబెట్టిన చికెన్‌ని బ్రెడ్ పౌడర్‌లో దొల్లించి తాను రెడీ చేసి పెట్టుకున్న మసాల మిశ్రమంలో ముంచి డీప్ ఫ్రై చేసి ఇవ్వగా ఒక రెస్టారెంట్ ఆ టేస్ట్‌కి ఫిదా అయిపోయింది.
ఇక అంతే కొద్ది కాలంలో కల్నల్ చేసిన ఫ్రైడ్ చికెన్ బాగా ఫేమస్ అయిపోయింది. దానికి కెంటకీ ఫ్రైడ్ చికెన్ పేరుతో కేఎప్‌సీగా జనాల్లోకి తీసుకురావడం, ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడం చకచక జరిగిపోయాయి. అలా 1964 నాటికి అతడి బ్రాండ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్ దేశవ్యాప్తంగా 600 ఫ్రాంచైజీలను కలిగి ఉంది.
అదే సంవత్సరం తన బ్రాండ్‌ని సుమారు రూ. 16 కోట్లుకు విక్రయించాడు(ప్రస్తుత రోజుల్లో రూ. 144 కోట్లకు సమానం). అయితే అతనే ఆ బ్రాండ్‌కి అంబాసిడర్, ప్రతినిధి. దీంతో కల్నల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. కనీస ఆర్థిక భద్రత లేని వ్యక్తి కోటీశ్వరుగా మారిపోయాడు. చాలా లేటు వయసులో లక్ష్యం కోసం యత్నంచి అతిపెద్ద సక్సెస్‌ని అందుకుని.. లక్ష్యానికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.
(చదవండి: 77 ఏళ్ల నాటి కేకు ముక్క..! వేలంలో ఏకంగా..)
Comments
Please login to add a commentAdd a comment