
మెమెన్ ఉరిపై ఆగ్రహం
సాక్షి, చెన్నై : దేశంలో ఉరి శిక్ష అమలును రద్దు చేయాలని ప్రజా సంఘాలు, పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. భారత జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే తీవ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు ఉరి శిక్ష అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో వ్యవహరించిందంటూ పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది నుంచి రాష్ట్రంలోని పార్టీలు, ప్రజా సంఘాలు , తమిళాభిమాన సంఘాలు ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులకు పడ్డ ఉరి శిక్ష యావజ్జీవంగా మారే వరకు ఆందోళనల్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే. ఉరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంఘాలు, పార్టీలు దేశంలో ఆ శిక్ష అమలైన సమయాల్లో తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి.
ఉరి శిక్షను అనేక దేశాలు రద్దు చేసి ఉంటే, భారత్‌లో మాత్రం ఆ శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ముంబై పేలుళ్ల నిందితుడు తీవ్ర వాది యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు గురువారం ఉరి శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ శిక్ష అమలు చేయాల్సిన అవశ్యం, ఒత్తిడి ఉండి ఉంటే, మరో వారం రోజుల తర్వాత అమలు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే మెమన్ ఉరి శిక్షను అమలు చేయడం బట్టి చూస్తే, ఏ మేరకు మహారాష్ట్ర పాలకులు కలాంకు గౌరవాన్ని ఇచ్చారోనన్నది స్పష్టం అవుతున్నదని మండి పడుతున్నాయి.
అత్యుత్సాహం : పీఎంకే అధినేత రాందాసు తన ట్విట్టర్‌లో ఉరి శిక్ష అమలుపై తీవ్రంగానే స్పందించారు. మెమన్‌కు ఉరి శిక్ష విధించడంతో మహారాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు తిలోదకాలు దిద్ది మెమన్‌ను ఉరి తీశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మెమన్ పిటిషన్‌పై మరో మారు పరిశీలన జరిపి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం మృతితో కన్నీటి మడుగులో దేశం మునిగిఉన్నదని, ఉరికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం తమ సందేశాల్ని ఇచ్చి ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో ఉరిశిక్షను అమలు పరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
హత్యే : న్యాయం ముసుగులో మెమన్‌ను ఉరి శిక్ష పేరుతో హత్య చేశారని వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ముందు భారత గౌరవాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటుగా, దేశం కోసం అవిశ్రాంతంగా చివరి క్షణాల వరకు శ్రమించిన అబ్దుల్ కలాం భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా పూర్తి కాక ముందే, ఆగమేఘాలపై మెమన్‌కు ఉరి శిక్షను అమలు చేయడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన ఏడు రోజుల్లో , కోర్టుల్లో పిటిషన్ తిరస్కరించ బడ్డ పక్షంలో పదహారు రోజుల్లో ఉరిశిక్షను అమలు చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయన్నారు. అయితే, ఆ నిబంధనలకు తిలోదకాలు దిద్ది, అత్యవసరంగా, ఆగమేఘాలపై న్యాయం ముసుగులో మెమన్‌ను ఉరి తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.