sentenced to be hanged
-
అసాధారణ చర్యలకూ వెనుకాడం!
-
అసాధారణ చర్యలకూ వెనుకాడం!
జాధవ్‌కు పాక్ ఉరిశిక్ష విధించడంపై భారత్ స్పందన ► న్యాయం జరిగేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తాం ► పార్లమెంటులో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన ► ఉభయసభల్లో సభ్యుల ఆందోళన ► 60 రోజుల్లో జాధవ్ అప్పీలు చేసుకోవచ్చు: పాక్ రక్షణ మంత్రి కుల్‌భూషణ్ జాధవ్‌కు పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అసాధారణ చర్యలకూ వెనుకాడబోమంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ సభ్యులు లేవనెత్తారు. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఉభయసభల్లో సవివర ప్రకటన చేశారు. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు దౌత్యపరంగానే కాకుండా.. అన్ని మార్గాల్లోనూ కృషి చేస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్: భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు ఉరిశిక్షతో భారత్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు కుయుక్తులకు పాల్పడుతోందని పార్లమెంట్లో ప్రభుత్వం విమర్శించింది. ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తూ ‘జాధవ్‌కు న్యాయం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం, అమాయకుడైన భారతీయుడ్ని పాక్ కిడ్నాప్ చేసింది. మరణశిక్షపై పాకిస్తాన్ ముందుకెళ్తే జాధవ్ ఉరిని పథకం ప్రకారం చేసిన హత్యగా పరిగణిస్తాం. అనంతరం ఇరుదేశాల దౌత్య సంబంధాలపై ఏర్పడే ప్రతికూల పరిణామాల గురించి పాకిస్తాన్ ఆలోచించుకోవాలి’ అని సుష్మా హెచ్చరించారు. జాధవ్‌ను కలిసేందుకు అనుమతించలేదు ‘జాధవ్ తప్పుచేశాడనేందుకు ఎలాంటి ఆధారం లేదు. జాధవ్‌పై ఆధారాల కోసం పాకిస్తాన్ భారత్ సాయాన్ని కోరింది. ఈ సందర్భంగా కేసుతో సంబంధం లేని కొందరు భారతీయ ఉన్నతాధికారులపై అర్థంలేని ఆరోపణలు చేసింది. తాము చూపించిన ఆధారాల్ని అంగీకరిస్తేనే జాధవ్‌ను కలిసేందుకు భారత్ రాయబార కార్యాలయాన్ని అనుమతిస్తామని పాకిస్తాన్ లింకు పెట్టింది. నిజ నిర్ధారణకు, పాకిస్తాన్లో జాధవ్ ఉండడానికి గల కారణాల కోసం భారత్ రాయబార కార్యాలయాన్ని అనుమతించడం తప్పనిసరన్న అంశాన్ని మేం లేవనెత్తాం. తమ షరతులు ఒప్పుకుంటేనే అనుమతిస్తామని మరోసారి పాక్ పేర్కొంది’ అని సుష్మా తెలిపారు. అంతకముందు లోక్‌సభలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... జాధవ్‌కు న్యాయం జరిగేందుకు చేయదగ్గ అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. మౌనం ఎందుకు?: లోక్‌సభలో కాంగ్రెస్ జాధవ్ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘ఎలాంటి ఆహ్వానం లేకపోయినా మీరు పెళ్లికి(నవాజ్ షరీఫ్ కుమార్తె పెళ్లికి) హాజరుకావచ్చు. కానీ ఈ అంశంపై అతణ్ని(షరీఫ్) కలవడం, మాట్లాడడం గానీ చేయలేదు’ అని మోదీని ఉద్దేశించి ఖర్గే పరోక్షంగా విమర్శించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆజాద్ మాట్లాడుతూ.. జాధవ్ తరఫున ప్రభుత్వం అత్యుత్తమ న్యాయవాదిని ఏర్పాటు చేయాలన్నారు. సుష్మ స్పందిస్తూ.. పాకిస్తాన్ సుప్రీంకోర్టులోని అత్యుత్తమ న్యాయవాదుల్ని ఏర్పాటు చేయడంతో పాటు, పాక్ అధ్యక్షుడితో మాట్లాడతామని చెప్పారు. మరణశిక్షపై 60 రోజుల్లోపు కుల్‌భూషణ్ అప్పీలు చేసుకోవచ్చని పాక్రక్షణ మంత్రి అసిఫ్ చెప్పారు. ముప్పును తిప్పికొట్టే సత్తా ఉంది పాక్ ప్రధాని షరీఫ్ ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే సత్తా తమ బలగాలకు ఉందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అన్నారు. ‘పాకిస్తాన్ శాంతికాముక దేశం. అన్ని దేశాలతో.. ముఖ్యంగా పొరుగు దేశాలతో స్నేహసంబంధాలను కోరుకుంటోంది. అయితే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి’ అని చెప్పారు. కుల్‌భూషణ్ జాధవ్‌ను ఉరితీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత అనే భావన మారిపోయిందని, యుద్ధాలు ప్రస్తుతం సైన్యాలకు పరిమితం కాలేదని అన్నారు. మంగళవారం ఖైబర్–పంక్తూన్ఖ్వా రాష్ట్రంలోని అస్ఘర్ ఖాన్‌లో జరిగిన ఓ సైనిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఘర్షణలకు కాకుండా సహకారానికి, అనుమానానికి కాకుండా ఉమ్మడి శ్రేయస్సుకు తమ దేశం ప్రాధాన్యమిస్తుందన్నారు. జాధవ్‌కు మరణశిక్షను వ్యతిరేకించిన బిలావల్.. జాధవ్‌కు మరణశిక్షను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో పరోక్షంగా వ్యతిరేకించారు. ఇది వివాదాస్పద అంశమని, తమ పార్టీ మరణశిక్షకు వ్యతిరేకమని పేర్కొన్నారు. -
54% పెరిగిన మరణశిక్షలు
గతేడాది చైనా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల్లోనే 90 శాతం.. 22 దేశాల్లో 1,634 మందికి మరణశిక్ష ఇస్లామాబాద్: మరణశిక్షలు నిషేధించాలంటూ ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ 2015లో ఆశ్చర్యకరంగా వాటి సంఖ్య 54 శాతం పెరిగింది. అత్యధికంగా మరణశిక్షలు విధిస్తున్న దేశాల జాబితాలో చైనా, ఇరాన్, పాకిస్తాన్, సౌదీఅరేబియా, అమెరికాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇక మొదటి మూడు దేశాల్లోనే దాదాపు 90 శాతం మరణశిక్షలు అమలయినట్లు వెల్లడించింది. 2014లో 22 దేశాల్లో 1,061 మరణశిక్షలు అమలుకాగా, 2015లో ఈ సంఖ్య 1,634కు పెరిగిందని తెలిపింది. 1989 తర్వాత గతేడాదే అత్యధికంగా మరణశిక్షలు విధించారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో మరణశిక్షలు విధిస్తున్నారని, అయితే వాటి వివరాలను ఆ దేశం గోప్యంగా ఉంచుతోందని ఆమ్నెస్టీ వివరించింది. డిసెంబర్16, 2014లో పెషావర్‌లో పాఠశాలపై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మరణశిక్షపై నిషేధాన్ని ఎత్తేసి.. 2015లో 326 మందిని ఉరి తీసిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో మరణశిక్షను నిషేధించారు. గతేడాది దాదాపు 61 దేశాల్లో 1,998 మరణశిక్షలు నమోదయ్యాయి. భారత్‌లో ఒక మరణశిక్ష.. 257 మంది మృతిచెందిన 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ను గతేడాది జూలై 30న నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. అలాగే గతేడాది వివిధ కేసుల కింద దాదాపు 75 మందికి ఉరిశిక్ష విధించాలని తీర్పునిచ్చారు. క్రిమినల్ కోడ్ సవరణల కింద అత్యాచార కేసుల్లో నలుగురికి ఉరిశిక్ష ఖరారు చేశారు. మొత్తంగా 2015 చివరకు దాదాపు 320 మందికి ఉరిశిక్ష పెండింగ్‌లోఉంది. -
మెమెన్ ఉరిపై ఆగ్రహం
సాక్షి, చెన్నై : దేశంలో ఉరి శిక్ష అమలును రద్దు చేయాలని ప్రజా సంఘాలు, పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. భారత జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటిన అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే తీవ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు ఉరి శిక్ష అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో వ్యవహరించిందంటూ పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది నుంచి రాష్ట్రంలోని పార్టీలు, ప్రజా సంఘాలు , తమిళాభిమాన సంఘాలు ఉరి శిక్షను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులకు పడ్డ ఉరి శిక్ష యావజ్జీవంగా మారే వరకు ఆందోళనల్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిందే. ఉరికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంఘాలు, పార్టీలు దేశంలో ఆ శిక్ష అమలైన సమయాల్లో తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఉరి శిక్షను అనేక దేశాలు రద్దు చేసి ఉంటే, భారత్‌లో మాత్రం ఆ శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ముంబై పేలుళ్ల నిందితుడు తీవ్ర వాది యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్‌కు గురువారం ఉరి శిక్ష అమలు కావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ శిక్ష అమలు చేయాల్సిన అవశ్యం, ఒత్తిడి ఉండి ఉంటే, మరో వారం రోజుల తర్వాత అమలు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరిగిన రోజే మెమన్ ఉరి శిక్షను అమలు చేయడం బట్టి చూస్తే, ఏ మేరకు మహారాష్ట్ర పాలకులు కలాంకు గౌరవాన్ని ఇచ్చారోనన్నది స్పష్టం అవుతున్నదని మండి పడుతున్నాయి. అత్యుత్సాహం : పీఎంకే అధినేత రాందాసు తన ట్విట్టర్లో ఉరి శిక్ష అమలుపై తీవ్రంగానే స్పందించారు. మెమన్‌కు ఉరి శిక్ష విధించడంతో మహారాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు తిలోదకాలు దిద్ది మెమన్ను ఉరి తీశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మెమన్ పిటిషన్‌పై మరో మారు పరిశీలన జరిపి ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం మృతితో కన్నీటి మడుగులో దేశం మునిగిఉన్నదని, ఉరికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం తమ సందేశాల్ని ఇచ్చి ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో ఉరిశిక్షను అమలు పరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హత్యే : న్యాయం ముసుగులో మెమన్ను ఉరి శిక్ష పేరుతో హత్య చేశారని వీసీకే నేత తిరుమావళవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ముందు భారత గౌరవాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటుగా, దేశం కోసం అవిశ్రాంతంగా చివరి క్షణాల వరకు శ్రమించిన అబ్దుల్ కలాం భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా పూర్తి కాక ముందే, ఆగమేఘాలపై మెమన్‌కు ఉరి శిక్షను అమలు చేయడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన ఏడు రోజుల్లో , కోర్టుల్లో పిటిషన్ తిరస్కరించ బడ్డ పక్షంలో పదహారు రోజుల్లో ఉరిశిక్షను అమలు చేయొచ్చని నిబంధనలు చెబుతున్నాయన్నారు. అయితే, ఆ నిబంధనలకు తిలోదకాలు దిద్ది, అత్యవసరంగా, ఆగమేఘాలపై న్యాయం ముసుగులో మెమన్ను ఉరి తీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.