54% పెరిగిన మరణశిక్షలు
గతేడాది చైనా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల్లోనే 90 శాతం..
22 దేశాల్లో 1,634 మందికి మరణశిక్ష
ఇస్లామాబాద్: మరణశిక్షలు నిషేధించాలంటూ ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ 2015లో ఆశ్చర్యకరంగా వాటి సంఖ్య 54 శాతం పెరిగింది. అత్యధికంగా మరణశిక్షలు విధిస్తున్న దేశాల జాబితాలో చైనా, ఇరాన్, పాకిస్తాన్, సౌదీఅరేబియా, అమెరికాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇక మొదటి మూడు దేశాల్లోనే దాదాపు 90 శాతం మరణశిక్షలు అమలయినట్లు వెల్లడించింది.
2014లో 22 దేశాల్లో 1,061 మరణశిక్షలు అమలుకాగా, 2015లో ఈ సంఖ్య 1,634కు పెరిగిందని తెలిపింది. 1989 తర్వాత గతేడాదే అత్యధికంగా మరణశిక్షలు విధించారు. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో మరణశిక్షలు విధిస్తున్నారని, అయితే వాటి వివరాలను ఆ దేశం గోప్యంగా ఉంచుతోందని ఆమ్నెస్టీ వివరించింది. డిసెంబర్16, 2014లో పెషావర్‌లో పాఠశాలపై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మరణశిక్షపై నిషేధాన్ని ఎత్తేసి.. 2015లో 326 మందిని ఉరి తీసిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో మరణశిక్షను నిషేధించారు. గతేడాది దాదాపు 61 దేశాల్లో 1,998 మరణశిక్షలు నమోదయ్యాయి.
భారత్‌లో ఒక మరణశిక్ష..
257 మంది మృతిచెందిన 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్‌ను గతేడాది జూలై 30న నాగపూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. అలాగే గతేడాది వివిధ కేసుల కింద దాదాపు 75 మందికి ఉరిశిక్ష విధించాలని తీర్పునిచ్చారు. క్రిమినల్ కోడ్ సవరణల కింద అత్యాచార కేసుల్లో నలుగురికి ఉరిశిక్ష ఖరారు చేశారు. మొత్తంగా 2015 చివరకు దాదాపు 320 మందికి ఉరిశిక్ష పెండింగ్‌లోఉంది.