రామేశ్వరంలో కలాం విగ్రహం
అమృత్ పథకంలో మాజీ రాష్ట్రపతి స్వస్థలం
రామేశ్వరం/సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని తమిళనాడులోని ఆయన స్వస్థలమైన రామేశ్వరంలో బుధవారం నిర్వహించారు. రక్షణ, పట్టణాభివృద్ధి శాఖలతో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధానికి గుర్తుగా రామేశ్వరంలో డీఆర్‌డీవో(డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) జరిపిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పరీకర్, పొన్ రాధాకృష్ణన్ ఘనంగా నివాళులర్పించారు.
పేకరంబులో కలాంనిలువెత్తు విగ్రహాన్ని కేంద్రమంత్రులు ఆవిష్కరించారు. కలాంకు నివాళిగా ఆయన స్వస్థలం రామేశ్వరాన్ని అమృత్(అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్‌మేషన్) కింద చేర్చినట్లు వెంకయ్య తెలిపారు. రూ. 48 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేటాయించామన్నారు. సాధారణంగా లక్ష లేదా ఆపైన జనాభా ఉన్న నగరాలనే ఈ పథకం కింద చేరుస్తారని, కానీ కలాంకు నివాళిగా 45 వేల జనాభా ఉన్న రామేశ్వరాన్ని ప్రధాని మోదీ ఈ పథకంలో చేర్చారన్నారు. కలాం సైకత శిల్పాన్ని ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఆవిష్కరింపజేశారు. కలాం లేని లోటు తీర్చలేనిదని మోదీ ట్వీట్ చేశారు. కాగా, కడలూరులో ప్రజలు నెలకొల్పిన కలాం విగ్రహాన్ని అనుమతులు లేవంటూ అధికారులు తొలగించారు.