
‘అబ్దుల్ కలాం పార్టీ’ ఆవిర్భావం
సాక్షి, చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌కలాంకు సలహాదారు అయిన పొన్‌రాజ్ ఆదివారం ‘అబ్దుల్‌కలాం విజన్ ఇండియా పార్టీ(వీఐపీ)’ని స్థాపించారు. రామేశ్వరంలో యాన కలాం అంత్యక్రియలు జరిగిన చోట నివాళులర్పించారు. అక్కడే వేదికపై పార్టీ బోర్డును ఆవిష్కరించారు. పార్టీ ఏర్పాటుపై కలాం బంధువుల మద్దతు పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కలాం సోదరుడు ముత్తుమీర ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
తన సోదరుడు పార్టీలకతీతమైన వ్యక్తి అని, అతని ఫొటోను పెట్టుకుని రాజకీయం చేయడం బాధాకరమని ముత్తుమీర అన్నారు. తమ తాత పేరుతో పార్టీ నెలకొల్పడం ఆయన వ్యక్తిగత అభీష్టమని, ఇందులో కలాం బంధువులకు సంబంధం లేదని కలాం మనవడు షేక్ సలీం స్పష్టం చేశారు. కలాం పేరుకు కళంకం రాకుండా పార్టీని నడపాలని కొందరు బంధువులు పొన్‌రాజ్‌కు సూచించినట్లు సమాచారం.