కాకరకాయ.. లాభాల ‘షేక్’
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : కాకర.. చేదైన కూరగాయ.. అయినప్పటికీ రైతులకు లాభాల తీపినందిస్తోంది. మార్కెట్లో కూరగాయల డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షేక్ సలీం. కాకర సాగు, మార్కెటింగ్‌పై ఆయన మాటల్లోనే.. ఆదిలాబాద్ మండలం నిషన్ఘట్ గ్రామంలో రెండెన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నీటి సౌకర్యం ఉండడంతో బిందు సేద్యం పద్ధతిలో కాకరకాయ సాగు చేసిన. ఈ కాకర విత్తనాలు ఇదివరకే మా బంధువులు మహారాష్ట్రలో సాగు చేశారు. ఈ విత్తనాలు ఇక్కడ దొరక్కపోవడంతో హైదరాబాద్ నుంచి 50 గ్రాముల ప్యాకెట్లు 25 తెప్పించుకున్న. ఒక్కో ప్యాకెట్ ధర రూ.420 చొప్పున రూ.10,500 వరకు ఖర్చయింది.
విత్తుకోవడానికి కూలీలకు రూ.3వేలు చెల్లించిన. విత్తనం నాటే ముందు ఎరువుకు రూ.6వేలు, ఆవుపేడ రెండు లారీ వరకు వేసిన. కొంత సేంద్రియ పద్ధతిలో, మరికొంత రసాయన ఎరువులు వేసిన. కంకబొంగులు పాతి తీగలతో పందిరి నిర్మించాను. కలుపునకు కూలీల ఖర్చు రూ.18వేలు, రసాయన ఎరువులు 20 రోజులకోసారి యూరియా, డీఏపీ, పొటాష్ ఒక్క బ్యాగ్ కలిపి వేస్తాను. వీటి ఖర్చు రూ.14వేలు అయింది. తెగుళ్లు నివారణకు కాన్ఫిడార్, స్రై రడన్ కలిపి వారం పది రోజులకోసారి పిచికారీ చేస్తాను. రూ.6వేల వరకు ఖర్చవుతుంది. ఇతర ఖర్చులు కలుపుకొని మొత్తంగా రూ.65వేలు అయ్యాయి.
దిగుబడి ఇలా..
విత్తనం నాటిన రెండు నెలల్లో కాతకు వచ్చింది. ఆ తర్వాత నుంచి రెండు నెలలుగా రోజుకు 30 నుంచి 40 క్యారెట్లు దిగుబడి వస్తుంది. ఒక్కో క్యారెట్(డబ్బా)లో 14 నుంచి 16 కిలోల కాకరకాయలు పడుతాయి. ఇలా రోజుకు నాలుగైదు క్వింటాళ్ల కాకరకాయలు ఎగుమతి చేస్తున్న. ఆదిలాబాద్ మార్కెట్‌తోపాటు మహారాష్ట్ర, యావత్మాల్, చంద్రాపూర్ మార్కెట్లకు తీసుకెళ్తాను. ఒక్కో క్యారెట్ ధర రూ.420 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. సాగుతోపాటు నాకు ఆదిలాబాద్ మార్కెట్లో కూరగాయల దుకాణం ఉంది. అందులో మా కుటుంబ సభ్యులు కూరగాయలు విక్రయిస్తుంటారు. మార్కెట్లోకి ఏ కూరగాయలు తక్కువగా వస్తున్నాయనేది గమనించి మంచి ధర పలికే వాటినే సాగు చేస్తాను.
కాకరకాయ సాగు కోసం రూ.65వేల వరకు పెట్టుబడిన పెట్టిన. ఇప్పటివరకు కాకరకాయలు అమ్మడం ద్వారా రూ.5లక్షల వరకు వచ్చింది. పాలేర్ల ఖర్చు, రవాణా, ఇతర ఖర్చులు పోను రూ.3.80లక్షల లాభం వచ్చింది. కాకరకాయ సాగు మంచి లాభదాయకంగా ఉంది. మరో 20రోజుల తర్వాత పంట దిగుబడి తగ్గి పంట కాత గడువు ముగుస్తుంది. ఈ పంట మంచి దిగుబడి వచ్చినా ఇదే పంటను, వేసిన పంట మళ్లీ వేయకుండా చూస్తున్న. బీరకాయ, వంకాయ సాగు చేయాలని ఆలోచిస్తున్న. గతంలో కొత్తిమీర, టమాటా సాగు చేసిన. కొత్తిమీర లాభదాయకంగా ఉండే. టమాటా మాత్రం పెట్టిన పెట్టుబడి వచ్చింది. ప్రభుత్వం ఇతర కూరగాయల విత్తనాలు సబ్సిడీపై రైతుల అంచినట్లుగానే కాకరకాయ విత్తనాలు అందిస్తే ప్రోత్సహించినట్లు అవుతుంది.