సాక్షి, న్యూఢిల్లీ : సరికొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుడుతున్న ప్రముఖ దక్షిణాది నటుడు కమల్ హాసన్ బుధవారం రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్మారక భవనాన్ని సందిర్శించడం వెనక మతలబు ఏమైనా ఉందా? కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజకీయ పార్టీకి ముస్లింల మద్దతు కూడగట్టడంలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్లినట్లు స్పష్టం అవుతుంది. అబ్దుల్ కలామ్‌ను మైనారిటీల నాయకుడిగా ఎవరూ పరిగణించనప్పటికీ దేశాధినేతగా దేశ ప్రజల్లో ఆయనకు సముచిత గౌరవం ఉంది. ముఖ్యంగా తమిళనాడు ముస్లిం ప్రజల్లో కలాంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.
మొదటి నుంచి హేతువాదిగా చెప్పుకునే కమల్ హాసన్‌కు అబ్దుల్ కలాం స్మారక భవనం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం ద్వారా ముస్లింలకు ఆకర్షించవచ్చని భావించి ఉండవచ్చు. తమిళనాడు జనాభాలో ఏడు శాతం ముస్లింలు ఉన్నారు. వారిలో కమల్ హాసన్ పట్ల సానుకూలత ఉందో, లేదోగానీ వ్యతిరేకత మాత్రం ఉంది. 2013లో కమల్‌హాసన్ నటించి, నిర్మించిన ‘విశ్వరూపం’ చిత్రం వివాదాస్పదం అవడమే కాకుండా దాన్ని నిషేధించాలంటూ తమిళ ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ చిత్రంలో ముస్లింలను టెర్రరిస్టులుగా చూపించడమే అందుకు కారణం. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, డైలాగులను తొలగిస్తే సినిమా విడుదలకు అనుమతిస్తామని, లేదంటే లేదని ముస్లిం నాయకులు నాడు హెచ్చరించారు.
తన సినిమా విడుదల చేయకపోతే తాను దేశం విడిచి మరో దేశానికి వలసపోతానుగానీ సినిమాలో ఒక్క సన్నివేశాన్నిగానీ, డైలాగునుగానీ తొలగించే సమస్యే లేదని కమల్ హాసన్ ప్రతిఘటించారు. చివరకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత జోక్యంతో సమస్య పరిష్కారమైంది. కొన్ని డైలాగులను తొలగించి సినిమాను విడుదల చేశారు. సినిమా విడుదలకు సహకరించినందుకు కమల్ హాసన్, జయలలితను కలసుకొని మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ముస్లింలు కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా మారారు. ఆయన తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తనే కోపం కూడా వారికి ఉంది. ఇలాంటి కులాలు, మతాల పట్టింపు తమిళ ముస్లింలకు ఒకప్పుడు అసలు ఉండేదికాదు.
అందుకనే మొదటి నుంచి తమిళనాడు ముస్లింలు ద్రావిడ పార్టీలను, ముఖ్యంగా డీఎంకే పక్షాన ఉంటూ వచ్చారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం మొదటిసారి వారిలో ర్యాడికల్ భావాలను రేకెత్తించాయి. ‘క్వాయిద్ ఏ మిల్లాత్’ (మత సామరస్యానికి స్ఫూర్తిదాత)గా గుర్తింపు పొందిన మొహమ్మద్ ఇస్మాయిల్ నాయకత్వంలోని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ ప్రభావంతో అన్ని కులాలు, మతాలు సమానమన్న స్ఫూర్తితోనే తమిళ ముస్లింలు జీవించారు. తమిళ భాషాభివృద్ధికి వారు కూడా కృషి చేశారు. ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు ఈవీ రామస్వామి కూడా ముస్లింల పట్ల ఎంతో సానూభూతితో వ్యవహరించేవారు.
1972లో మొహమ్మద్ ఇస్మాయిల్ మరణంతో ముస్లింలీగ్‌లో విభేదాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఆ లీగ్ ద్రవిడ పార్టీలతోనే కొనసాగింది. బాబ్రీ మసీదు విధ్వంసంతో లీగ్‌లో ర్యాడికల్ భావాలు ఊపందుకున్నాయి. ముస్లిం వ్యాపారస్థుల ప్రయోజనాలకు పనిచేస్తున్నారనే ఆరోపణలు, వివాదాలు తలెత్తాయి. పర్యవసానంగా పలువురు నాయకులు బయటకు వచ్చి 1994లో ‘ఇండియన్ నేషనల్ లీగ్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 1998లో కోయంబత్తూరు వరుస బాంబు పేలుళ్లతో తమిళనాడులో హిందువులు, ముస్లింలు అంటూ స్పష్టమైన విభజన ఇరువర్గాల ప్రజల్లో ఏర్పడింది.
‘అల్ ఉమ్మా’ అనే రాడికల్ ఇస్లాం గ్రూపునకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హత్యకు ప్రతీకారంగా జరిగినట్లు భావిస్తున్న నాటి వరుస బాంబు పేలుళ్లలో 58 మంది అమాయకులు మరణించారు. 2000 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘ఇండియన్ తవీద్ జమాత్, తమిళనాడు తవీద్ జమాత్’ కరడుగట్టిన ముస్లిం సంస్థలు పుట్టుకొచ్చాయి. 1995లో ‘తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం’ అనే సంస్థ ఏర్పడగా, దాని రాజకీయ పార్టీ 2009లో ‘మానితనేయ మక్కల్ కాచి’ ఏర్పాటయింది. ఈ పార్టీలు ఇప్పటికీ డీఎంకే లేదా ఏఐడీఎంకే ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ దశలో కమల్ హాసన్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చారు.
ఆయనకు ముస్లింలు మద్దతిచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ముస్లింల రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేందుకు సొంతంగానే పలు పార్టీలు ఉన్నాయని, మరో పార్టీ అవసరం లేదని ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన రాజకీయాలేమిటో తమకు తెలియవని, ప్రజలు మాత్రం ఆయన ‘విశ్వరూపం’ మరచిపోలేదని అన్నారు. కమల్ హాసన్ ‘ఓ గందరగోళం నాయకుడు’ అని తమిళ ముస్లింల మత చరిత్ర, సంస్కృతిని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించిన ప్రముఖ రచయిత, చిత్ర నిర్మాత కొంబాయ్ ఎస్. అన్వర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment