కమల్ హాసన్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ పేరుతో రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ బుధవారం ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో వాక్చాతుర్యం తప్ప విషయ పరిజ్ఞానం లేదని స్పష్టమవుతోంది. సినిమాల్లో ఇంతకాలం ముఖానికి రంగు పులుముకున్న తాను తెలియని రంగులుగల రాజకీయ రంగంలోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందో చెప్పలేదు. ఇలా అనేక కీలకమైన అంశాలపై స్పష్టతనివ్వడంలో కమల్ విఫలమయ్యారు. తన పార్టీ సిద్ధాంతాలేమిటో అంతకన్నా వివరించలేదు. అవినీతిని నిర్మూలించడం, అభివృద్ధికి కృషి చేయడం లాంటివి తన ఆదర్శాలని చెప్పుకున్నారంతే. అయితే, వాటినైనా ఎలా సాధిస్తారో స్పష్టం చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల పట్ల తన వైఖరేమిటో వెల్లడించలేదు. ఆయనలో తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదం పరిష్కారం పట్ల అవగాహన కనిపించలేదు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కుల, మతాల ఆదిపత్య కుమ్ములాటలను ఎలా ఎదుర్కోవాలో అంతకన్నా తెలియదు.
‘నువ్వు లెఫ్ట్‌వా, రైట్‌వా’ అని అడిగితే తాను సెంటర్‌నని చెప్పుకున్నారు. ఇక్కడ సెంటర్ అంటే తటస్థమనే అర్థం చేసుకోవచ్చు. ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ లాగా రాజకీయాల్లో తటస్థానికి తావుండదు. స్పష్టత ఉండాలి. అవినీతిని నిర్మూలించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న కమల్ హాసన్, అవినీతికి మారుపేరుగా విమర్శల్లో వినతికెక్కిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఆదర్శం అని చెప్పడం తటస్థం అనుకోవాలా, అవగాహనా రాహిత్యం అనుకోవాలా! ‘రైట్’ నుంచి వచ్చే మంచి సూచనలను తప్పకుండా స్వీకరిస్తానని అనడమంటే ‘లెఫ్ట్’ నుంచి వచ్చే సూచనలు స్వీకరించను అని అర్థమా? లేదా ఇప్పటికే ‘లెఫ్ట్’ సూచనలు స్వీకరిస్తున్నానని చెప్పడమా!
1989లో ఎస్. రామదాస్ నాయకత్వాన ఏర్పాటైన ‘పట్టాలి మక్కాళ్ కాచ్చి, 1997లో ఏర్పడిన ‘పుథియా తమిళగం’ మినహాయిస్తే తమిళనాడులో ద్రావిడ అనే పదం లేకుండా కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు. పార్టీ పేరులో లేకపోయినా తనదీ ద్రవిడ సిద్ధాంతమనే ఆయన చెప్పకనే చెప్పుకున్నారు. ఆరు ద్రవిడ రాష్ట్రాల (పుదుచ్చేరిని కలుపుకొని) ఐక్యతకు చిహ్నంగా తన పార్టీ జెండాలోని ఆరు చేతులను చూపించారు. ఆరు చేతుల్లో మూడు చేతులు ఎరుపు రంగులో ఉండగా, మూడు చేతులు తెలుపురంగులో ఉన్నాయి. మధ్య నలుపులో తెలుపు నక్షత్రం ఉంది. ఎరుపు, నలుపు, తెలుపు...ఈ మూడు రంగులు ద్రావిడ ఉద్యమానికి బండ గుర్తులు. 1917లో తరామత్ మాధవన్ నాయర్ ఏర్పాటు చేసిన ‘జస్టిస్ పార్టీ’ నాటి నుంచి ద్రవిడ పార్టీలు ఈ రంగులనే ద్రవిడ స్ఫూర్తిగా వాడుతున్నాయి.
ద్రవిడ రాష్ట్రాలపై హిందీని, సంస్కృతాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ వైఖరిని ఓ ద్రవిడ పార్టీగా తప్పనిసరిగా బహిరంగంగానే విమర్శించాలి. రాష్ట్రంలోని డీఎంకే, ఏఐడిఎంకే లాంటి ద్రవిడ పార్టీలకు, తన ద్రవిడ పార్టీకి ఉన్న తేడా ఏమిటో స్పష్టం చేయాలి. కావేరి సమస్యను ఎలా పరిష్కరిస్తారంటే ‘బెంగుళూరు నుంచి రక్తం తీసుకొచ్చినవాడిని, నీళ్లు తీసుకరానా‘ అన్నంత సులువు కాదు ఆ సమస్యను పరిష్కరించడం. అక్కడ మీకు రక్తం ఇచ్చే అభిమానులు ఉన్నారు. నీళ్లిచ్చే అభిమానులు లేరు.
1974 నుంచి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వాన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్ని విడతలుగా చర్చోపచర్చలు జరిపినా సమస్య పరిష్కారం లభించలేదన్న విషయాన్ని కొంత అర్థం చేసుకోవాలి! అవినీతి కావాలంటే డీఎంకే, ఏఐఏడిఎంకేలను ఎన్నుకోండీ! అవినీతి నిర్మూలన, పాఠశాలలు, వైద్యశాలలలాంటి అభివృద్ధి కావాలంటే కమల్ హాసన్‌ను ఎన్నుకోండీ!’ అంటూ పార్టీ ఆవిర్భావ వేదిక నుంచి ప్రజలకు పిలుపునిచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాటలకు తలూపుతూ తనదీ అదే ఉద్దేశం తందానా! అంటే సరిపోదు. స్పష్టత, స్పష్టత ఉండాలి. తటస్థం అంటే మాట తూలరాదనుకోవాలిగానీ తూలనాడరాదనుకోకూడదు! ఏ రంగులో తెలియని రాజకీయ రంగంలో స్పష్టత, అవగాహన లేకుండా రాణించడం కష్టం. ఎప్పటికీ సెంటర్‌లోనే ఉండాలనుకుంటే రాజకీయ భవిష్యత్తులో ‘లెఫ్ట్ అండ్ రైట్’ ఆటుపోట్లు తప్పవు!
Comments
Please login to add a commentAdd a comment