సాక్షి, చెన్నై : తమిళనాడులో రాజకీయాలు, సినిమాలు అన్నదమ్ముల లాంటివనే విషయం అందరికి తెల్సిందే. అందుకనే సినిమా నటులు ఎక్కువగా రాజకీయాల్లోకి వచ్చి హిట్టవుతుంటారు. అలాంటి హిట్లను ఆశిస్తూ ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఎంజీ రామచంద్రన్ సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి ఇలాంటి వారికి ముందుగానే మార్గదర్శకం చేశారు. ఎంజీఆర్ రాజకీయాల్లో రాణింపుకు ఆయన సినిమాల్లోని పాటలు ఆయనకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి.
ఎంజీఆర్‌ను సినిమాల్లో ఎక్కువగా నిలబెట్టిందీ ఎంఎస్ విశ్వనాథన్ సమకూర్చిన పాటలు కాగా, ఆ పాటలను రాసిందీ కన్నదాసన్, వాలీ. 1965లో వచ్చిన ‘ఉంగల్ వీటు పిల్లయ్’ సినిమాలోని నాన్ అనయిట్టల్ అతు నాదంతువిట్టల్ (నేను ఏది ఆదేశిస్తే అదవుతుంది) అన్న పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఆయన డీఎంకే నుంచి విడిపోయి అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీని పెట్టినప్పుడు ఈ పాట పార్టీ గీతంగా ఊరు, వాడ మారుమోగిపోయింది.
ఇప్పుడు ఆయన తరహాలోనే రాజకీయాల్లో రాణించేందుకు కమల్ హాసన్ తాను నటించిన సినిమాల్లోని, ముఖ్యంగా రాజకీయ సినిమాలు లేదా సినిమాల్లోని రాజకీయపరమైన పాటలను ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తున్నారని తెల్సింది. ఎంజీఆర్‌కు ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకుడిగా ఉన్నట్లుగా, కమల్ హాసన్‌కు కూడా ఇళయరాజా సమకూర్చిన పాటలే ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెల్సిందే. నిజంగా చెప్పాలంటే ఆయన నటించిన చాలా సినిమాల్లో ఇళయరాజా సమకూర్చిన పాటలే ఆయనకు ప్రాణం పోశాయి.
కమల్ హాసన్ మొన్న బుధవారంనాడు తన కొత్త పార్టీని పకటించినప్పుడు తమిళనాడులోని ఎనిమిది గ్రామాలను ఆదర్శగ్రామాలుగా దిద్దుతానని చెప్పారు. తాను హీరోగా నటించిన దర్శకుడు కే. బాలచందర్ 1988లో తీసిన ‘ఉన్నల్ ముడియం తంబీ (నీవు సాధించగలవు, సోదరా!)’ చిత్రంలోనిదే ఆ ఐడియా. అదే సినిమాను బాలచందర్ అదే ఏడాది తెలుగులో చిరంజీవి హీరోగా ‘రుద్రవీణ’ను తీశారు. మద్యం మత్తును వదిలించుకోవాలంటూ ఆ సినిమాలో టైటిల్ సాంగ్ సాగుతుంది. రాజకీయ నాయకులు మద్యాన్ని ప్రోత్సహించడాన్ని తూర్పార పడుతుంది.
ఈ పాటను కూడా ఆయన తన ప్రచారానికి ఎక్కువ వాడుకుంటారని తెల్సింది. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1989లో వచ్చిన ‘అపూర్వ సహోదరర్‌గళ్ (తెలుగులో–విచిత్ర సోదరులు)’ చిత్రంలోని అవినీతికి వ్యతిరేకంగా సాగే ఓ పాటను కూడా ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో తరతరాలుగా పెరుగుతూ వస్తున్న అవినీతిని అంతం చేయాల్సిన అవసరం కూడా తనను పార్టీని పెట్టేల ప్రేరేపించిందని కూడా పార్టీ ఆవిర్భావ సభలో కమల్ హాసన్ ప్రకటించారు. ఇక ‘తేవర్ మగన్’ చిత్రంలో ఎంజీఆర్‌తో కలిసి ఆయన నటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న తేవర్ కులస్థుల దర్పానికి ప్రతిబింబంగా పేరు పొందిన ఈ సినిమాల్లోని పాటలను కూడా ఆయన ప్రచారానికి వాడుకుంటారనడంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment