
జోగేశ్వరీ రైల్ ఓవర్ బ్రిడ్జికి కలాం పేరు
సాక్షి, ముంబై : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మృతికి చిహ్నంగా జోగేశ్వరిలోని రైల్ ఓవర్ బ్రిడ్జికి కలాం పేరును నామకరణం చేయాలని స్థానికులు ఆశిస్తున్నారు. ఇందుకుగాను సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు ప్రారంభమవకపోవడంతో అబ్దుల్ కలాం పేరు మీదుగా బ్రిడ్జిని ప్రారంభించాలని కోరుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వెస్ట్రర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి ఎస్‌వీ రోడ్ వరకు అనుసంధానం చేస్తూ ఈ జోగీశ్వరీ రైల్ ఓవర్ బ్రిడ్జ్‌ను నిర్మించారు. మిస్సైల్ మన్‌గా పేరుగాంచిన దివంగత మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం పేరును ఈ బ్రిడ్జికి పెట్టినట్లయితే ఆయనకు ఒక గొప్ప నివాళి అర్పించిన వారమవుతామని స్థానికులు అభిప్రాయపడ్డారు. సంతకాల సేకరణను వివిధ విభాగాల అధికారులకు పంపించామని వారు వెల్లడించారు.
బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారో...?
గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి వరకు, మున్సిపల్ క మిషనర్ నుంచి కార్పొరేషన్ వార్డు అధికారుల వరకు సంతకాల సేకరణను పంపించామని స్థానికులు చెప్పారు. ఇటీవల చాలా మంది రాజకీయ నాయకులు రోడ్లకు, నగరాలు, ట్రాఫిక్ ఇంటర్‌సెక్షన్లకు తిరిగి కొత్తగా నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నారని, అయితే ఇప్పటివరకు ప్రారంభించని ఈ బ్రిడ్జికి అబ్దుల్ కలాం పేరును పెట్టాల్సిందిగా తామందరం కోరుకుంటున్నామని జోగేశ్వరి స్థానికులు పేర్కొంటున్నారు. జోగేశ్వరి ఈస్ట్-వెస్ట్‌ను కలిపే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి చాలా కాలం అయిందని, అయితే కొ న్ని రాజకీయ కారణాల వల్ల ఈ బ్రిడ్జిని ఇంకా ప్రారంభించడం లేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రైల్ ఓవర్ బ్రిడ్జిని ఎప్పు డు ప్రారంభిస్తారో అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
బ్రిడ్జిని ప్రారంభిస్తే సమయం ఆదా!
బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఓషివారా, జోగేశ్వరి స్థానికులు రైల్వే ట్రాక్‌లను దాటడానికి అంధేరీ సబ్‌వేను లేదంటే గోరేగావ్ ద్వారా చుట్టూ తిరగి వెళ్లాల్సి వస్తోందని, రైల్వే ట్రాక్ దాటడానికి ఆటోలలో రూ. 50 వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జిని ప్రారంభిస్తే చార్జీ తక్కువవడంతోపాటు సమయం వృథా అవదని చెబుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని బ్రిడ్జిని త్వరగా ప్రారంభించి అబ్దుల్ కలాం పేరుతో నామకరణం చేయాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు.