పైనొక రైలు.. కిందొక రైలు | Rail over Rail Bridge at Pagidipally | Sakshi
Sakshi News home page

పైనొక రైలు.. కిందొక రైలు

Published Thu, Jun 13 2024 4:17 AM | Last Updated on Thu, Jun 13 2024 4:17 AM

Rail over Rail Bridge at Pagidipally

పగిడిపల్లిలో రైల్‌ ఓవర్‌ రైల్‌ బ్రిడ్జి 

సికింద్రాబాద్‌–కాజీపేట మార్గంలో రూ.180 కోట్లతో నిర్మాణం

క్రాసింగ్‌ కోసం రైళ్లు నిలపాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: పైన రైలు.. కింద రైలు.. అలాంటి వంతెనలు మన దేశంలో తక్కువ. ఒక రైలు మార్గాన్ని మరో మార్గం క్రాస్‌ చేసే సందర్భాల్లో వీటి అవసరమున్నా.. ఆర్థిక భారం, ఇతర కారణాలతో నిర్మించడం లేదు. అయితే క్రాసింగ్‌ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్‌ ఓవర్‌ రైల్‌ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. 

గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్‌ పరిధిలో గూడూరు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్‌–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్‌ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. 

సికింద్రాబాద్‌ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్‌ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 

రెండు మూడు మార్గాల సమస్య తీరేలా.. 
ప్రస్తుతం సికింద్రాబాద్‌–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్‌–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్‌ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్‌ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్‌ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్‌ చేయాలంటే.. సికింద్రాబాద్‌–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్‌లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది.

ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్‌–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్‌ రైళ్ల సంఖ్య పెరగనుంది. మరోవైపు విష్ణుపురం–మోటుమర్రి మధ్య 89కిలోమీటర్ల మేర సరుకు రవాణా రైలు మార్గం ఉంది. ఇది సికింద్రాబాద్‌–కాజీపేట, సికింద్రాబాద్‌–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. 

ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్‌ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్‌ వద్ద రైల్వే ట్రాఫిక్‌ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్‌ వద్ద రైళ్లు జామ్‌ కాకుండా రైల్‌ ఓవర్‌ రైల్‌ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్‌ చేశారు. అది పూర్తయితే రైళ్లు నిరీక్షించే ఇబ్బంది తప్పుతుంది. ప్రయాణ సమయం కొంత తగ్గుతుంది. 

1,400 మీటర్ల ఎలివేటెడ్‌ మార్గం 
ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్‌ ఓవర్‌ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌–కాజీపేట మార్గంలో బీబీనగర్‌ స్టేషన్‌ దా టిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్‌ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్‌ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. 

సికింద్రాబాద్‌–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్‌ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్‌లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్‌ మార్గం ఉంటుంది. దీనికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. భూసేకరణ ముగిసేలోపు వంతెన భాగాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement