వచ్చే రెండేళ్లలో ద.మ.రైల్వే పరిధిలో 3 వేల రూట్ కి.మీ.లలో అందుబాటులోకి
ఇటీవల కవచ్ 4.0 వెర్షన్ విజయవంతం.. ఆ వెంటనే వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం
రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం
సాక్షి, హైదరాబాద్: భారీ రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు రైల్వే శాఖ మేల్కొంది. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు అవి పరస్పరం ఢీకొనకుండా నిరోధించే అత్యాధునిక ‘కవచ్’ను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రయోగాలు, పరీక్షలు అంటూ కాలయాపన చేసిన తర్వాత ఆ పరిజ్ఞానాన్ని ట్రాక్ మీద, లోకోమోటివ్‌లలో ప్రత్యక్షంగా ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచింది.
ఈ పరిజ్ఞానానికి సంబంధించి 4.0 వెర్షన్ ప్రయోగాలు విజయవంతం కావటంతో, దాన్ని దశలవారీగా అన్ని జోన్లలో ఏర్పాటు చేయనుంది.ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 వేల రూట్ కిలోమీటర్లలో ఈ పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో ఆ వ్యవస్థ ఉండగా, కొత్తగా మరో 1,618 రూట్ కి.మీ.లలో ఏర్పాటుకు తాజాగా రైల్వేశాఖ టెండర్లు పిలిచింది.
దక్షిణ మధ్య రైల్వేతో శ్రీకారం..: దేశంలో తొలిసారి కవచ్ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఏర్పాటు చేశారు. కవచ్ పరిజ్ఞా నాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు 2014–15లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్–వికారాబాద్–వాడి సెక్షన్‌లను ఎంచుకున్నారు. 250 కి.మీ. పరి ధిలో పలు దశల్లో పరీక్షించారు. 2015–16లో ప్యాసింజర్ రైళ్లలో క్షేత్రస్థాయి ట్రయల్స్ నిర్వ హించారు.
2017–18లో కవచ్ స్పెసిఫికేషన్ వెర్షన్ 3.2ను విజయవంతంగా ముగించారు. 2018–19లో ఈ పరిజ్ఞానానికి ఆర్‌డీఎస్‌ఓ ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి జోన్ పరిధిలో 1,465 రూట్ కి.మీ.లలో, 200 లోకోమోటివ్స్‌లో ఏర్పాటైంది. ఇప్పుడు కవచ్ మేజర్ వర్షన్ అయిన 4.0 ద్వారా ఆ పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షన్ ట్రయల్స్ కోసం సనత్‌నగర్–వికారాబాద్ సెక్షన్ పరిధిలో 65 రూట్ కి.మీ.లలో ఏర్పాటు చేశారు.
ఇటీవలే ఈ పరీక్షలు విజయవంతం కావడంతో ఈ పరిజ్ఞానాన్ని హై డెన్సిటీ నెట్ వర్క్ పరిధిలో ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోస బలార్షా–కాజీపేట– విజయవాడ, విజయవాడ–గూడూరు, విజయ వాడ–దువ్వాడ, వాడి–గుంతకల్–ఎర్రగుంట్ల–రేణిగుంట కారిడార్లలో ఏర్పాటు చేస్తారు. ఈ రూట్‌లలో మొత్తం 1,618 రూట్ కి.మీ. లలో ఏర్పాటుకు ఇటీవల టెండర్లు పిలిచారు.
కవచ్‌తో ఇవీ లాభాలు
» ఒకే ట్రాక్‌మీద రెండు రైళ్లు వచ్చినప్పు డు లోకోపైలట్ బ్రేక్ వేయకపోయినా, ఆ పరిజ్ఞానం వల్ల రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుంది.
» ఎక్కడైనా రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు లోకోపైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు నడిపినప్పుడు లోకో పైలట్‌ను ఈ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ రైలును ఆపకపోతే తనంతట తానుగా బ్రేక్ వేస్తుంది.
» అవసరమైన ప్రాంతాల్లో హారన్ మోగించనప్పుడు ఇది తనంతట తానుగా ఆ పని చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment