Rail Over Bridge
-
పైనొక రైలు.. కిందొక రైలు
సాక్షి, హైదరాబాద్: పైన రైలు.. కింద రైలు.. అలాంటి వంతెనలు మన దేశంలో తక్కువ. ఒక రైలు మార్గాన్ని మరో మార్గం క్రాస్ చేసే సందర్భాల్లో వీటి అవసరమున్నా.. ఆర్థిక భారం, ఇతర కారణాలతో నిర్మించడం లేదు. అయితే క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడూరు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రెండు మూడు మార్గాల సమస్య తీరేలా.. ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది.ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది. మరోవైపు విష్ణుపురం–మోటుమర్రి మధ్య 89కిలోమీటర్ల మేర సరుకు రవాణా రైలు మార్గం ఉంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్ చేశారు. అది పూర్తయితే రైళ్లు నిరీక్షించే ఇబ్బంది తప్పుతుంది. ప్రయాణ సమయం కొంత తగ్గుతుంది. 1,400 మీటర్ల ఎలివేటెడ్ మార్గం ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దా టిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. దీనికి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలైంది. భూసేకరణ ముగిసేలోపు వంతెన భాగాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రమాదకరంగా బెల్లంపల్లి రైల్‌ఓవర్ బ్రిడ్జి
-
జోగేశ్వరీ రైల్ ఓవర్ బ్రిడ్జికి కలాం పేరు
సాక్షి, ముంబై : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మృతికి చిహ్నంగా జోగేశ్వరిలోని రైల్ ఓవర్ బ్రిడ్జికి కలాం పేరును నామకరణం చేయాలని స్థానికులు ఆశిస్తున్నారు. ఇందుకుగాను సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు ప్రారంభమవకపోవడంతో అబ్దుల్ కలాం పేరు మీదుగా బ్రిడ్జిని ప్రారంభించాలని కోరుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వెస్ట్రర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి ఎస్వీ రోడ్ వరకు అనుసంధానం చేస్తూ ఈ జోగీశ్వరీ రైల్ ఓవర్ బ్రిడ్జ్‌ను నిర్మించారు. మిస్సైల్ మన్‌గా పేరుగాంచిన దివంగత మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం పేరును ఈ బ్రిడ్జికి పెట్టినట్లయితే ఆయనకు ఒక గొప్ప నివాళి అర్పించిన వారమవుతామని స్థానికులు అభిప్రాయపడ్డారు. సంతకాల సేకరణను వివిధ విభాగాల అధికారులకు పంపించామని వారు వెల్లడించారు. బ్రిడ్జిని ఎప్పుడు ప్రారంభిస్తారో...? గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి వరకు, మున్సిపల్ క మిషనర్ నుంచి కార్పొరేషన్ వార్డు అధికారుల వరకు సంతకాల సేకరణను పంపించామని స్థానికులు చెప్పారు. ఇటీవల చాలా మంది రాజకీయ నాయకులు రోడ్లకు, నగరాలు, ట్రాఫిక్ ఇంటర్సెక్షన్లకు తిరిగి కొత్తగా నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నారని, అయితే ఇప్పటివరకు ప్రారంభించని ఈ బ్రిడ్జికి అబ్దుల్ కలాం పేరును పెట్టాల్సిందిగా తామందరం కోరుకుంటున్నామని జోగేశ్వరి స్థానికులు పేర్కొంటున్నారు. జోగేశ్వరి ఈస్ట్-వెస్ట్‌ను కలిపే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి చాలా కాలం అయిందని, అయితే కొ న్ని రాజకీయ కారణాల వల్ల ఈ బ్రిడ్జిని ఇంకా ప్రారంభించడం లేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రైల్ ఓవర్ బ్రిడ్జిని ఎప్పు డు ప్రారంభిస్తారో అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. బ్రిడ్జిని ప్రారంభిస్తే సమయం ఆదా! బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఓషివారా, జోగేశ్వరి స్థానికులు రైల్వే ట్రాక్‌లను దాటడానికి అంధేరీ సబ్వేను లేదంటే గోరేగావ్ ద్వారా చుట్టూ తిరగి వెళ్లాల్సి వస్తోందని, రైల్వే ట్రాక్ దాటడానికి ఆటోలలో రూ. 50 వెచ్చించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జిని ప్రారంభిస్తే చార్జీ తక్కువవడంతోపాటు సమయం వృథా అవదని చెబుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని బ్రిడ్జిని త్వరగా ప్రారంభించి అబ్దుల్ కలాం పేరుతో నామకరణం చేయాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు. -
ఘట్కేసర్ ఆర్వోబీకి మోక్షం!
- బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ - యుద్ధప్రాతిపదికన స్టీల్ గర్డర్స్ ఏర్పాటు - రైల్వే, ఓఆర్ఆర్ అధికారుల పర్యవేక్షణలో పనులు సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డులోని ఘట్కేసర్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)కి ఎట్టకేలకు మోక్షం లభించింది. రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు బుధవారం నుంచి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా ఘట్కేసర్ వద్ద రైల్వే ట్రాక్ పైనుంచి సుమారు 45 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో ఆర్వోబీ నిర్మించాల్సి ఉంది. రూ.25కోట్ల వ్యయంతో తలపెట్టిన ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా స్టీల్ గర్డర్స్ ఏర్పాటుకు వారానికి 3రోజులు చొప్పున రోజుకు 2గంటలు అంటే... సాయంత్రం 2గంటల నుంచి 4గంటల మధ్యలోనే రైల్వే ట్రాక్‌పై పనులు నిర్వహించుకునేందుకు ైరె ల్వే శాఖ అనుమతిచ్చింది. ప్రత్యేకించి సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే ఆర్వోబీ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్న ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులు బుధవారం నుంచి పనులు ప్రారంభించారు. 3 భారీ క్రెయిన్లు, 35 మంది వర్కర్స్‌తో ఆగమేఘాలపై గ ర్డర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. 42మీటర్ల పొడవు, 50 టన్నుల బరువుండే భారీ గర్డర్స్‌ను రోజుకు 2-4వరకు ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యంతో ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే... రైళ్ల రాకపోకల ఫ్రీక్వెన్సీ అధికంగా ఉండే ఈ మార్గంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోజుకు 2-3 గర్డర్స్ చొప్పున ఏర్పాటు చేసే విధంగా పనులు చేపట్టారు. మొత్తం 16 గర్డర్స్‌ను 2వారాల్లోగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనులకు కౌంట్ డౌన్ మొదలైంది. తొలిరోజున క్రేన్లు, వర్కర్స్ సహకారంతో నిర్దేశిత 2 గంటల వ్యవధిలో 2 గర్డర్స్‌ను ఏర్పాటు చేసి రికార్డును సృష్టించారు. ఓఆర్ఆర్ సీజీఎం ప్రత్యక్ష పర్యవేక్షణలో లక్ష్యాల మేరకు గర్డర్స్‌ను పైకి ఎక్కించగలిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వడివడిగా పనులు రైల్వే పోర్షన్లో కాంపోజిట్ స్ట్రక్చర్ (స్టీల్ గర్డర్స్-కాంక్రీట్ స్లాబ్)ను డిజైన్ చేసిన అధికారులు మెయిన్ క్యారేజ్‌లో ఒక్కో వైపు 8 చొప్పున మొత్తం 16 బీమ్‌లను ప్లాన్ చేశారు. రైల్వే శాఖ ఇచ్చిన 2గంటల వ్యవధిలోనే పనులు వేగంగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని నిర్దేశిత సమయం ఎలా పూర్తిచేస్తాం..? ఇందుకు వినియోగించే టెక్నాలజీ, పట్టే సమయం వంటి వివరాలన్నింటినీ ఇప్పటికే రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి అందజేశారు. అయితే... రైళ్ల రాకపోకలు అధికంగా ఉండే ఈ మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా రైల్వే ఇంజనీరింగ్ అధికారులు సైతం సైట్లో మోహరించి పనుల తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. స్టీల్ గర్డర్స్ ఏర్పాటు పూర్తయ్యాక వాటి మధ్యలో కంపోజిట్ స్ట్రక్చర్(స్లాబ్) నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటినీ వచ్చే 3 నెలల్లో పూర్తిచేయాలన్న లక్ష్యంతో వడివడిగా పనులు నిర్వహిస్తున్నారు. అయితే... ఆర్వోబీ నిర్మాణం విషయంలో పక్కాగా ప్రమాణాలను పాటిస్తూ నాణ్యతపై రాజీ పడకుండా అటు రైల్వే, ఇటు ఓఆర్ఆర్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆర్వోబీ నిర్మాణంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పనులు నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. కీలకమైన గర్డర్స్ ఏర్పాటు పూర్తయితే కాంక్రీట్ స్లాబ్ పనులను వెంటనే చేపట్టేందుకు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు. కీలకమైన ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే ముంబయ్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా వరంగల్, విజయవాడ హైవేలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.