ఘట్‌కేసర్ ఆర్వోబీకి మోక్షం!
- బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- యుద్ధప్రాతిపదికన స్టీల్ గర్డర్స్ ఏర్పాటు
- రైల్వే, ఓఆర్‌ఆర్ అధికారుల పర్యవేక్షణలో పనులు
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డులోని ఘట్‌కేసర్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)కి ఎట్టకేలకు మోక్షం లభించింది. రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు అధికారులు బుధవారం నుంచి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంలో భాగంగా ఘట్‌కేసర్ వద్ద రైల్వే ట్రాక్ పైనుంచి సుమారు 45 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో ఆర్వోబీ నిర్మించాల్సి ఉంది. రూ.25కోట్ల వ్యయంతో తలపెట్టిన ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా స్టీల్ గర్డర్స్ ఏర్పాటుకు వారానికి 3రోజులు చొప్పున రోజుకు 2గంటలు అంటే... సాయంత్రం 2గంటల నుంచి 4గంటల మధ్యలోనే రైల్వే ట్రాక్‌పై పనులు నిర్వహించుకునేందుకు ైరె ల్వే శాఖ అనుమతిచ్చింది.
ప్రత్యేకించి సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే ఆర్వోబీ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకున్న ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు అధికారులు బుధవారం నుంచి పనులు ప్రారంభించారు. 3 భారీ క్రెయిన్లు, 35 మంది వర్కర్స్‌తో ఆగమేఘాలపై గ ర్డర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 42మీటర్ల పొడవు, 50 టన్నుల బరువుండే భారీ గర్డర్స్‌ను రోజుకు 2-4వరకు ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యంతో ఓఆర్‌ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే... రైళ్ల రాకపోకల ఫ్రీక్వెన్సీ అధికంగా ఉండే ఈ మార్గంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోజుకు 2-3 గర్డర్స్ చొప్పున ఏర్పాటు చేసే విధంగా పనులు చేపట్టారు.
మొత్తం 16 గర్డర్స్‌ను 2వారాల్లోగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనులకు కౌంట్ డౌన్ మొదలైంది. తొలిరోజున క్రేన్లు, వర్కర్స్ సహకారంతో నిర్దేశిత 2 గంటల వ్యవధిలో 2 గర్డర్స్‌ను ఏర్పాటు చేసి రికార్డును సృష్టించారు. ఓఆర్‌ఆర్ సీజీఎం ప్రత్యక్ష పర్యవేక్షణలో లక్ష్యాల మేరకు గర్డర్స్‌ను పైకి ఎక్కించగలిగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
వడివడిగా పనులు
రైల్వే పోర్షన్‌లో కాంపోజిట్ స్ట్రక్చర్ (స్టీల్ గర్డర్స్-కాంక్రీట్ స్లాబ్)ను డిజైన్ చేసిన అధికారులు మెయిన్ క్యారేజ్‌లో ఒక్కో వైపు 8 చొప్పున మొత్తం 16 బీమ్‌లను ప్లాన్ చేశారు. రైల్వే శాఖ ఇచ్చిన 2గంటల వ్యవధిలోనే పనులు వేగంగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని నిర్దేశిత సమయం ఎలా పూర్తిచేస్తాం..? ఇందుకు వినియోగించే టెక్నాలజీ, పట్టే సమయం వంటి వివరాలన్నింటినీ ఇప్పటికే రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి అందజేశారు. అయితే... రైళ్ల రాకపోకలు అధికంగా ఉండే ఈ మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా రైల్వే ఇంజనీరింగ్ అధికారులు సైతం సైట్‌లో మోహరించి పనుల తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
స్టీల్ గర్డర్స్ ఏర్పాటు పూర్తయ్యాక వాటి మధ్యలో కంపోజిట్ స్ట్రక్చర్(స్లాబ్) నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటినీ వచ్చే 3 నెలల్లో పూర్తిచేయాలన్న లక్ష్యంతో వడివడిగా పనులు నిర్వహిస్తున్నారు. అయితే... ఆర్వోబీ నిర్మాణం విషయంలో పక్కాగా ప్రమాణాలను పాటిస్తూ నాణ్యతపై రాజీ పడకుండా అటు రైల్వే, ఇటు ఓఆర్‌ఆర్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆర్వోబీ నిర్మాణంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పనులు నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు ఓఆర్‌ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. కీలకమైన గర్డర్స్ ఏర్పాటు పూర్తయితే కాంక్రీట్ స్లాబ్ పనులను వెంటనే చేపట్టేందుకు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు. కీలకమైన ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే ముంబయ్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా వరంగల్, విజయవాడ హైవేలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.