
ఇవేం రాజకీయాలు!
- ఇలాంటి ఫిరాయింపులు ఎన్నడూ చూడలేదు
- టీఆర్‌ఎస్ ఉద్యమ ఊపులో గెలిచింది
- నేనడిగితే కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారు.. పదవులు ముఖ్యం కాదు
- ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తిటౌన్: పార్టీ ఫిరాయింపులు ఇంతలా తానెప్పుడూ చూడలేదని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులు, అబ్దుల్ కలాం బ్యాడ్జి టీఆర్‌ఎస్ పార్టీ రంగులో తయారు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం వనపర్తిలోని అంబేద్కర్ విగ్రహాం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు సంస్థాగత బలం లేదని, ఉద్యమ ఊపులో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తనకుండే పరిచయంతో అడిగితే సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇస్తారని, కానీ రాజకీయ విలువలు ముఖ్యం.. పదవులు కాదని పేర్కొన్నారు. ఇసుక అక్రమ దందా, తప్పుడు పద్ధతుల్లో ఆదాయానికి ఆశపడే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో 63 సీట్లు సాధించిన టీఆర్‌ఎస్ 85 సీట్లకు ఎలా చేరిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వనపర్తిని విస్మరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 14 నెలల్లో ఏ అభివృద్ధిని చూపి మునిసిపల్ చైర్మన్ పార్టీ మారారో తెలపాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ, శంకర్‌ప్రసాద్, ఉంగ్లం తిరుమల్, అశోక్, ఖయ్యూం, రాజేందర్‌రెడ్డి, జ్యోతి, ఇందిరమ్మ, పార్వతి, పి.రవి, వేణు, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు అసెంబ్లీలో లెవనెత్తుతా..
పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లెవనె త్తుతానని ఎమ్మెల్యే చిన్నారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలుంటేనే సీఎంకు పారిశుద్ధ్య కార్మికులు కనిపిస్తారా అని ప్రశ్నించారు. కార్మికులు వెనుకడుగు వేయకుండా పోరాడాలన్నారు.