
అరుదైన రీతిలో అబ్దుల్ కలాంకు నివాళి!
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం మొదటి వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. కోచికి చెందిన లెటర్‌ఫామ్స్ అనే సంస్థ అరుదైన రీతిలో నివాళులర్పించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఏడాదిగా ఇందుకోసం శ్రమిస్తోంది. కలాం మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పిస్తూ ఉత్తరాలు రాయాలని దేశంలోని 200 నగరాల పౌరులను ఆహ్వానించింది.
‘డియర్ కలాం సర్’ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా యువత.. కలాం గురించి రాసిన లేఖలను, వేసిన పెయింటింగ్‌లను యథాతథంగా పుస్తకంలా ప్రచురించాలని భావిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కలాం జయంతి రోజు నుంచి తమ ప్రయత్నాన్ని ప్రారంభించామని, యువత నుంచి అద్భుతమైన స్పందన కనిపించిందని, వాటిని పుస్తకరూపంలోకి తీసుకురావడం ద్వారా మహామనిషి కలాంకు నివాళులర్పిస్తామని లెటర్‌ఫామ్స్ సహ వ్యవస్థాపకుడు జాబీజాన్ తెలిపారు. ఈ పుస్తకానికి ‘డియర్ కలాం సర్’గా నామకరణం చేయాలని నిర్ణయించారు. వేలాది లేఖలు వచ్చినా, అందులో నుంచి 358 లేఖలను ఎంపికచేసి, వాటిని పుస్తకంగా ప్రచురిస్తున్నారు.