
కలల లోకంలో... తెలంగాణ ‘తమ్ముళ్లు’
‘కలలు కనండి... సాకారం చేసుకోండి ’.. అని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్న మాటల్లో మొదటి రెండు పదాలను తెలంగాణ తమ్ముళ్లు బాగా వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. ‘కాచుకోండి, వన్.. టూ.. త్రీ.. ఇంకెంత కాలం ఎనిమిదే ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది.. ముఖ్యమంత్రి మారిపోతారు...’ అని కలల్లో తేలిపోతున్నారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూశారని ఆరోపణలు ఉన్నాయి. ‘తమ్ముళ్లు’ ఇపుడు మళ్లీ అదే పాత వ్యూహాన్ని అమలు చేస్తున్నారా... అని సందేహం వ్యక్తం చేస్తే అదేం కాదంటున్నారు.
మరి ఇంతగా వీరు ఈ కాలజ్ఞానం ఎలా వినిపిస్తున్నారో తెలుసుకుంటే ఔరా ! అని అనక మానరు. తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ స్వామిజీ చెప్పిన మాటలు అక్షర సత్యం అయ్యాయని వీరంతా భావిస్తున్నారు. ఇప్పుడదే స్వామిజీ.. ‘ మరో ఏడెనిమిది నెలల్లో తెలంగాణలో ప్రభుత్వం పడిపోతుంది.. ముఖ్యమంత్రి మారిపోతారు ..’ అని సెలవిచ్చారట. దీంతో వీరి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయని అనుకుంటున్నారు. ‘ముఖ్యమంత్రి ఎవరవుతారో నేను లీక్ చేయను.. కానీ, మారడం ఖాయం ’ అంటూ ఆ పార్టీ నేతొకరు బహిరంగంగానే చెబుతూ నవ్వులు పూయిస్తున్నారు. తమ్ముళ్లా ... మజాకా !