న్యాయం కోసం లేఖాస్త్రం
సాక్షి, అమరావతి బ్యూరో : ప్రభుత్వం చేతిలో మోసపోయి దగాపడిన రాజధాని రైతులు ఏకమవుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలిపేందుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వ పెద్దలను ఎన్నిసార్లు కోరినా ప్రయోజనం లేకపోవడంతో లేఖలతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కొద్దిరోజుల క్రితం అనంతవరంలో ప్రారంభమైన ఈ ఉద్యమం ప్రస్తుతం రాజధాని మొత్తానికి పాకింది. నాడు తనకు జరిగిన అన్యాయాన్ని పదిమందికీ తెలపాలన్న తపనతో ఓ రైతు ఆకాశ రామన్న పేరుతో ఉత్తరాలు రాసి, వాటిని గ్రామంలో అక్కడక్కడా విసిరేసి, మరికొన్ని గోడలకు అంటించి సంచలనం సృష్టించాడు.
ఆ తరువాత కొద్ది రోజులకు కొందరు రైతులు కలిసి సామాజిక మాధ్యమంలో ఓ గ్రూపు ఏర్పాటు చేసి, తమకు జరుగుతున్న నష్టాన్ని, అన్యాయాన్ని సమాజం దృష్టిలో పడేలా చేస్తున్నారు. ‘అమరావతి క్యాపిటల్’ పేరుతో ఏర్పాటు చేసిన ఆ గ్రూపులో ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా రాజధాని గ్రామాల్లో కొందరు రైతులు తమకు జరిగిన అన్యాయాలపై కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు.
నిరవధిక దీక్షకు రంగం సిద్ధం...
తుళ్లూరు, వెలగపూడి, మల్కాపురం, మందడం, లింగాయపాలెం, రాయపూడికి చెందిన కొందరు రైతులు ప్రభుత్వ అక్రమాలపై లేఖాస్త్రాలు సంధించారు. ఏళ్ల తరబడి రైతుల అనుభవంలో ఉన్న పట్టా భూమిలో నుంచి కొంత మాయం చేసిన అధికారులు టీడీపీ పెద్దలకు కట్టబెట్టారు. ప్లాట్లు కేటాయించక ముందే గ్రామ కంఠాలను పంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు మాట తప్పారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా దాన్ని మరింత పెద్దది చేసి రెండు వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని పేర్కొంటున్నారు. నిరభ్యంతర సర్టిఫికెట్ల (ఎన్‌వోసీ)కు కూడా అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనాన్ని రైతులు లేఖల ద్వారా ప్రపంచానికి చాటారు.
ప్లాట్ల కేటాయింపులోనూ తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని నమ్మి అన్నంపెట్టే భూములను అప్పగిస్తే.. తమను నిలువునా ముంచుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగాపడ్డ రైతన్నలంతా ఏకం కావాలంటూ లేఖల ద్వారా పిలుపు నిచ్చారు. అంతా కలిసి ఈ నెల 26వ తేదీన సమావేశమై... గట్టి నిర్ణయం తీసుకుందామని ఆ లేఖలో పిలుపునిచ్చారు. అవసరమైతే నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని కూడా పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వం అడ్డు తగిలే అవకాశం ఉందని, ఎలాగైనా రైతులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. జరిగిన అన్యాయాలపై ఉద్యమించకపోతే పిల్లల భవిష్యత్‌ను తామే చేజేతులా సర్వనాశనం చేసిన వాళ్లం అవుతామని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే రైతుల లేఖాస్త్రాల ద్వారా చేస్తున్న ఆవేదనను ప్రభుత్వం పరిష్కరిస్తుందా? అణగదొక్కుతుందా? వేచి చూడాల్సి ఉంది.