రుణమాఫీ కోసం ఎదురుచూపు
కొవ్వూరు, న్యూస్‌లైన్:సార్వా సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు రుణమాఫీ, కొత్త రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు తీసుకున్న రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక ఆ విషయంపై నేటికీ స్పష్టత ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టకపోవడంతో రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు వెలువడలేదు. మరోవైపు మాఫీ ఏ మేరకు చేస్తారో.. అసలు చేస్తారో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ పరిస్థితుల్లో కొత్త రుణాల కోసం వస్తున్న రైతులకు బ్యాంకు అధికారులు మొండిచెయి చూపుతున్నారు. పాత రుణాలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. అప్పటివరకూ పాత రుణాలు కట్టొద్దని చెప్పారని రైతులు పేర్కొంటున్నారు.
తగ్గుతున్న స్వర్ణ సాగు
ఇదిలావుండగా, జిల్లాలో స్వర్ణ రకం వరి సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతోంది. స్వర్ణ వరి దుబ్బులు నేల వాలుతుండటంతో నష్టాలొస్తున్నాయి. దీంతో ప్రత్యమ్నాయ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు 70 శాతం వరకు ఉండే స్వర్ణ సాగు విస్తీర్ణం ప్రస్తుతం 30 శాతానికి పడిపోయింది. దీనికి ప్రత్యమ్నాయంగా ఎంటీయూ-1061 రకం 20 శాతం భూముల్లోను, 1064 రక ం 10 శాతం విస్తీర్ణంలోను సాగు చేస్తున్నారు.
రుణమాఫీ వర్తింపచేయాలి
రుణమాఫీ పథకాన్ని త్వరగా అమలు చేయూలి. లేదంటే కొత్త రుణాలు రావు. ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపచేయాలి. ఇప్పటికే సార్వా పనులు మొదలుపెట్టాం. గత ఏడాది రూ.60 వేల రుణం తీసుకున్నాను. ఆ రుణం మాఫీ అవుతుందో లేదో తెలియదు. కొత్తగా రుణం పొందాలంటే బ్యాంకర్లు పాత బాకీ చెల్లించమంటున్నారు. నూతన ప్రభుత్వం త్వరితగతిన మాఫీ పథకాన్ని అమలు చేయాలి. - కాపా వీరవెంకట సత్యనారాయణ, రైతు, పశివేదల
రసీదు తీసుకోండి సుమా
విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు లెసైన్సులు కలిగిన డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి. కచ్చితంగా రశీదు తీసుకోవాలి. పంట చివరి దశ వరకు విత్తనాల ఖాళీ సంచులను, రసీదులను భద్రపరుచుకోవాలి. విత్తనం కొన్న తరువాత మొలక కట్టి పరీక్షించుకోవాలి. 80 శాతం మేరకు మొలిస్తేనే విత్తనంగా వాడుకోవాలి.
- ఎం.వెంకటరామారావు, అసిస్టెంట్ డెరైక్టర్, వ్యవసాయ శాఖ, కొవ్వూరు