ఒక్కొక్కప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేకపోవచ్చు. విచారించనవసరం లేదు. మీరు కష్టపడ్డారు. త్రికరణశుద్ధిగా కృషి చేసారు. మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే తప్పు కాదు. కానీ అసలు లక్ష్యం లేకపోవడం మాత్రం దారుణం. జీవితంలో లక్ష్యం ఉండి తీరాలి. దాన్ని సాధించగలనన్న నమ్మకం ఉండాలి. అందుకే అబ్దుల్ కలాంగారు విద్యార్థుల చేత తరువాత ప్రతిజ్ఞగా ‘‘నేను నా విశ్వాసం అంత యువకుడను. సందేహమంత వృద్ధుడను. కాబట్టి నా హృదయంలో విశ్వాసం అనే దీపాన్ని వెలిగిస్తాను’’ అని ప్రమాణం చేయించారు.మనిషికి విశ్వాసం, సందేహం పక్కపక్కనే ఉంటాయి. ఈ పని నేను చేయగలననుకుంటాడు. ఆ మరు క్షణంలోనే ‘చేయగలనా?’ అనుకుంటాడు.
అందుకే నమ్మకం దృఢంగా ఉండాలి. ఒకప్పుడుకలాంగారిని ఇరాన్ నుంచి వచ్చిన కొందరు దివ్యాంగులయిన విద్యార్థులు కలిసారు. వారిలో ఆత్మ స్థయిర్యాన్ని నింపడానికి కలాంగారు ఒక కవిత రాసి వినిపించారు. ‘‘మీ శరీరంలో అక్కడక్కడా వైక్లబ్యాలు ఉండవచ్చు. కానీ మీలో భగవంతుడున్నాడు. మీకు ఎప్పుడు ఏది అవసరమో దానిని ఆయన ఎప్పుడూ భర్తీచేసి కాపాడుతూ ఉంటాడు.’’ అని చెపుతుండగా కాళ్ళు సవ్యంగా లేని ఒక విద్యార్థి చేతికర్రల సాయంతో వచ్చి కలాం గారి పక్కన నిలబడి తాను రాసిన ఒక కవితను ఆయన చేతికిచ్చాడు. అందులో ఇలా ఉంది –‘‘నాకు కాళ్ళు సరిగా లేవు. వంచలేను.
కానీ ఎంతటి గొప్పవాడు నా ఎదురుగా ఉన్నా, మహారాజయినా వారి ముందు వంగవలసిన అవసరాన్ని నాకా భగవంతుడు కల్పించలేదు’’ అని ఉంది. ఆ కుర్రవాడి ఆత్మస్థయిర్యం చూసి కలాంగారు చలించి పోయారు.చేతులు తెగిపోయినా, కాళ్ళు రెండూ పూర్తిగా లేకపోయినా వారి పనులు వారు చేసుకోవడమే కాదు, చిత్రకళలవంటి కళల్లో, క్రీడల్లో కూడా రాణిస్తున్నారు. కష్టపడి చదివి పరీక్షకు వెళ్ళేముందు క్షణంలో తండ్రి చనిపోతే, గుండె దిటవు చేసుకుని తండ్రి ఆకాంక్షలను నెరవేర్చడానికి వెళ్ళి పరీక్షలు రాసి వచ్చిన పిల్లలున్నారు. ఆ విశ్వాసం, ఆ ధైర్యం చెదిరిపోనంత కాలం మిమ్మల్ని పడగొట్టడం ఎవరికీ సాధ్యంకాదు.మీరు ఎంత ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్నా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయాణం మొదలు పెట్టిన తరువాత ప్రతిబంధకాలు వచ్చి తీరుతాయి. అవి లేకుండా ఎవరి జీవితమూ గడవదు.
సానబెడితే తప్ప వజ్రానికి కాంతి రాదు. అగ్నితప్తం చేసి సాగదీస్తే తప్ప బంగారం కూడా ఆభరణం కాదు. కష్టాలు అనుభవిస్తేనే రాణించి ప్రకాశించేది. సూర్యుడి కాంతిని అరచేతిని అడ్డుపెట్టి ఎవరూ ఆపలేరు. ధర్మంతో ముందుకెడుతున్న వాడిని ఆపగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. వాడు ప్రకాశించి తీరతాడు. అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్... ఇలా గొప్పవాళ్ళయిన వారంతా జీవితంలో భయంకరమైన కష్టాలు అనుభవించి వచ్చినవారే. మొక్క పెరుగుతున్నప్పుడు పైన ఏదో అడ్డువచ్చిందని ఆగిపోదు, దిశ మార్చుకుని పెరుగుతూ అడ్డు తొలగంగానే తిరిగి నిటారుగా పైకి లేస్తుంది. సీతాకోక చిలుకల్లా రంగులతో ఎగరాలంటే గొంగళి పురుగు దశ దాటాల్సిందే. బురదలోంచి వచ్చిన తామరపువ్వు సువాసనలు వెదజల్లుతూ వికసించినట్లుగానే మీరంతా ఆత్మ విశ్వాసంతో వికసనం చెందాలి. అటువంటి ధైర్యంతో, పూనికతో మీరంతా ముందుకు నడవాలన్న బలమైన ఆకాంక్షతోనే కలాంగారు విద్యార్థులతో ఈ ప్రతిజ్ఞలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment