ఆయన దొరికితే అంతే... | fun doctro story by apj | Sakshi

ఆయన దొరికితే అంతే...

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

ఆయన దొరికితే అంతే... - Sakshi

ఆయన దొరికితే అంతే...

ఫన్ డాక్టర్
కలాంగారు నాకు బాగా తెలుసు. ఆయనే కాదు - వాజ్‌పాయి కూడా బాగా తెలుసు. ఆ మాటకొస్తే మోడీ, సోనియా కూడా బాగా తెలుసు. కాకపోతే వాళ్లెవరికీ నేను తెలీదు. అంతే. నేమ్ డ్రాపింగ్ అన్నది ఓ కళ. మనకి చాలామంది తారసపడ్తుంటారు. సంభాషణలో సూటిగా చెప్పకుండా, ఇలా మాట్లాడుతూ ఓ అమితాబ్‌ని, అలా మాట్లాడ్తూ ఓ టెండుల్కర్‌ని - ‘‘మాకు చాలా క్లోజ్ అండి బాబూ’’ అని బిల్డప్ ఇస్తుంటారు. మరికొంతమంది పేర్లతో ఆగరు. ఫొటో ఆల్బమ్‌లు వెంటేసుకుని తిరుగుతుంటారు.

పరిచయం మొదటి నిమిషంలోనే - వాళ్లు సెలెబ్రిటీస్‌తో దిగిన, దింపిన ఫొటోలన్నీ చూయించే స్తారు. సెల్ కెమెరాలు, సెల్ఫీలు వచ్చిన తర్వాత వీళ్ల పని ఇంకా సులువైంది. అంతకుముందంటే కెమెరా వేరేవాడికిచ్చి ‘‘బాబ్బాబూ, ఓ ఫొటో తీయవా పెద్దా యనతో’’ అని అడుక్కో వాల్సి వచ్చేది. మళ్లీ సదరు వ్యక్తి సాగర సంగమంలో ‘భంగిమ’ ఫొటోగ్రాఫర్‌లాంటివాడను కోండి.. ‘‘ఇవి నా కాళ్లు, అవి మహేష్ బాబు కాళ్లు’’ అని చెప్పుకోవాల్సి వచ్చేది.
 
అసలు విషయానికి వద్దాం. అబ్దుల్ కలాంగారి గురించి. ఓ వ్యక్తి చనిపోయి - ఇంతమంది గుండెల్లో బ్రతికుండటం చాలారోజుల తర్వాత చూశాను. చాలా మంది, చాలా రకాలుగా పరమపదిస్తుం టారు. కానీ ఈయన చావేంటండీ బాబూ! ఎంత అద్భుతం, ఎంత అదృష్టం! తనకు ఇష్టమైన పని.. అదే, యువతని ప్రబోధ పరిచే ఉపన్యాసం ఇస్తూ అలానే నిష్ర్కమిం చడం... ఎంత పుణ్యం చేసుకుంటే ఆ వరం దొరుకుతుందో కదా!
 
ఇంకో రకంగా ఆలోచించండి. ఈ మాజీ ప్రెసిడెంట్‌గారి అదృష్టం బాగోలేక - ఆ రోజు హార్ట్ అటాక్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడనుకోండి. మా డాక్టర్లం దరం రెచ్చిపోయి స్టంట్లు చేసి, స్టంట్లు వేసి వెంటిలేటర్ మీద బాధించి, ‘ఎపుడు వదులుతార్రా - నా పని నేను చేసుకో వాలి’ అనుకుంటూ - చుట్టుపక్కలే తిరుగుతున్న ఎం.ధర్మరాజుతో పోట్లాడి ఆట్లాడి, ప్రెసిడెంట్‌గార్ని కనీసం ఓ సంవత్సరం పాటన్నా కోమాలోనో, హార్ట్ ఫెయిల్యూర్‌లోనో, స్ట్రోక్‌లోనో ఉంచే ఏర్పాటు చేసేవాళ్లం.
 అందుకనే నాకు చాలా భయం. చావంటే కాదు - చచ్చిపోయే ప్రదేశం గురించి!

హాయిగా ఎక్కడో హాలీడేలో, అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూనో టపా కట్టేస్తే - ఎంత ఆనందం. ‘‘కరెక్ట్‌గా చచ్చిపోయే టైమ్‌కి నిన్ను స్విట్జర్లాండ్‌కో, ప్యారిస్‌కో తీసుకెళ్లడం.. అక్కడి నుంచి నీ పార్ధివ దేహాన్ని ఇండియా తీసుకురావడం, చాలా ప్లానింగ్‌తోనూ, ఖర్చుతోనూ కూడిన పని మగడా. అలాంటి చచ్చు ఐడియాలు పెట్టుకోమాకు’’ అని మా ఆవిడ క్లాస్ పీకే అవకాశం ఉంది కాబట్టి ఈ కోరికని చంపేస్తున్నాను ప్రస్తుతానికి.
 
సరే ఆ ఇష్టం తీరడం కష్టం అంటున్నారు కాబట్టి ఇంకో చిన్న ఇష్టా న్నైనా తీర్చుకుంటూ పోనివ్వండర్రా! ఏమిటంటారా! చాలా సులువైన ఇష్టం ఇది. జీవిత నేస్తాలతో సొల్లు చెప్పు కుంటూ బాల్చీ తన్నేయడం ఊహించు కోండి. ‘ఒరేయ్’... ‘వెధవా’... ‘నీకంత సీనులేదురా’ లాంటి మాటలు మాట్లాడు కోగల ఫ్రెండ్స్‌తో నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ‘ఒరేయ్’, ‘చచ్చావురా నా చేతుల్లో’ అని చతుర్లాడుకుంటూ కుంటూ - ఇంతే సంగతులు. ఎంత అదృష్టం!
 చెప్పానుగా నా భయం. పొరపాటున, నా చివరి రోజులు బాగోక - మా హాస్పిటల్లోనే దొరికిపోయాననుకోండి. చచ్చానే.

‘వీడు నా జీతం పెంచడా’ అని కోపంతో కొంతమంది, ‘వీడి టార్చర్ ఇన్నాళ్లూ భరించాం, ఇదే ఛాన్స్’ అని మరికొంతమంది... డాక్టర్లు, సర్జన్లు, సర్సులు, వార్డ్ బాయ్స్ అందరూ మూకుమ్మడిగా నాకు గ్యాస్ట్రోస్కోప్, ఆర్థోస్కోప్, లరింగోస్కోప్ - చివరకు కొలనోస్కోప్ కూడా చేసేసి - నాకు చావడానికి స్కోప్ లేకుండా చేస్తారేమోనని చచ్చేంత భయం.
 
ఈ చావు కబుర్లు, చావు కోరికలన్నీ ఎందుకు రాస్తున్నానంటే పుణ్యాత్ములకే ఇలాంటి వరం దొరుకుతుందట. కాబట్టి పుణ్యాలు చేయండి అని చెప్పడానికే. కాళోజీ అన్నట్లు ‘పుటక నీది - చావు నీది - బ్రతుకంతా దేశానిది’. ఇంకోరకంగా చెప్పాలంటే పుట్టుక మన చేతుల్లో లేదు. చావు మన చేతుల్లో లేదు. మధ్యనున్న బ్రతుకే - మనిష్టం. నల్గురిలో మంచి ఉంచుకుంటూ, పెంచుకుంటూ జీవించ డమే ముఖ్యం.
 
నాకు కోట్స్ చాలా ఇష్టం. అవి గుండెల్లో స్ఫూర్తినింపుతాయి. ధైర్యాన్ని స్తాయి. ‘సాహసం చేయరా డింభకా’ అని ముందుకు తోస్తాయి. మార్టిన్ లూథర్ కింగ్, గాంధీ, వివేకానందుడు లాంటి మహనీయులు ఇచ్చిన ప్రబోధ వాక్యాలు మనందరినీ వెన్నుతట్టి ముందుకు నడుపు తుంటాయి. కాంటెంపరరీ టైమ్స్‌లో అలాంటి మాణిక్యాలు అందించినవాళ్లు అరుదు - అబ్దుల్ కలాం మినహా.

ఆయన రాసిన పుస్తకాల్లో అయితేనేమి - ఆయన ప్రసంగాల్లో అయితేనేమి - దొర్లిన కొన్ని మాటలు సదా గుర్తుకొచ్చి, కర్తవ్య బోధన చేసే ఆణిముత్యాలు. కలాం చెప్పారు... ‘‘నిద్రలో వచ్చి పోయే కలల గురించి కాదు నేను చెప్పేది, నువ్వు కనే కల నిన్ను నిద్రపో నివ్వకుండా చేయాలి. అలాంటి కలలు రావాలి నీకు.’’ అదేంటో నాకొచ్చే కలలన్నీ సన్నాసివి వస్తుంటాయి. పరీక్షకు లేట్‌గా వెళ్తే లోపలికి రానివ్వనట్లు, నా ఐస్‌క్రీమ్ ఎవడో లాక్కు న్నట్లు, కలాంగారి లెవెల్‌కి ఎప్పుడు ఎదుగుతానో!!
- డా॥గురవారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement