సాక్షి, అనకాపల్లి/మునగపాక/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా): నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు... అన్నట్టుగా ఉంది టీడీపీ నేత నారా లోకేశ్ తీరు. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 7వ తేదీతో మిచాంగ్ తుపాను ప్రభావం పోయింది. అప్పటినుంచి చినుకు జాడలేదు. గడచిన వారం రోజుల్లో పొలాలు అన్నీ తడారిపోయాయి. కల్లాల్లోని వరి పంట కడ దశకు చేరుకుంది. కానీ.. లోకేశ్ పుణ్యమా అని ఇప్పుడు రోడ్డుపై ఉన్నపళంగా నీళ్లొచ్చాయి. అక్కడ పచ్చ చొక్కాలతో కలిసి లోకేశ్ ఫొటోలకు ఎడాపెడా ఫోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకుని లేనిపోని హడావుడి చేశారు. ఈ ఫొటోలు ఎల్లో మీడియాకు చేరడంతో ఒక్కసారిగా ఊదరగొట్టేశాయి.
ఆ రాతలు చూసిన స్థానికులు అవాక్కయ్యారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జిల్లాలో జనం నుంచి ఎక్కడా స్పందన లేకపోవడంతో చినబాబు ఇటువంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా తిమ్మరాజుపేట వద్ద అచ్యుతాపురం–అనకాపల్లి రహదారిపై గుంతలో టీడీపీ కార్యకర్తలతో నీళ్లు పోయించి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన లోకేశ్ అడ్డంగా దొరికిపోయారు.
22 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రోడ్డులో ఎక్కడా చుక్కనీరు లేదు. అలాంటిది రాత్రి 8 గంటల సమయంలో మరో ఐదు నిమిషాల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్న దశలో రోడ్డుపై గుంతలో మాత్రం అప్పుడే పెద్ద వర్షం వచ్చినట్టుగా నీళ్లు ప్రత్యక్షమవడంతో స్థానికులు నివ్వెరపోయారు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లాలని ఇలా చీప్ ట్రిక్స్‌కు పాల్పడడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వచ్చేది టీడీపీ ప్రభుత్వమే
ఇదిలా ఉండగా, పాదయాత్రలో భాగంగా లోకేశ్ శనివారం మునగపాక, అనకాపల్లి మండలాల్లో నడిచారు. మునగపాకలో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపిన లోకేశ్ ఈ సందర్భంగా వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, మరో మూడు నెలల్లో కష్టాలు తీరిపోతాయని చెప్పారు. అనంతరం పూడిమడక రోడ్డు జంక్షన్ వద్ద విశాఖపట్నం–విజయవాడ జాతీయ రహదారి దాటుకుని అనకాపల్లి పట్టణంలోకి ప్రవేశించిన లోకేశ్ నెహ్రూచౌక్ మీదుగా గవరపాలెంలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. యువగళం యాత్ర 3,100 కిలోమీటర్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడినుంచి మునగపాక మండలం తోటాడలో ఏర్పాటుచేసిన బసకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment