Fun doctor
-
పేరులో ఏముంది?!
ఫన్ డాక్టర్ పేరులో ఏముంది? ‘వాటీజ్ ఇన్ ఎ నేమ్? దట్ విచ్ వియ్ కాల్ ఎ రోజ్ బై ఎనీ అదర్ నేమ్ - వుడ్ స్మెల్ యాజ్ స్వీట్’ అని షేక్స్పియర్ మహానుభావుడు ఎప్పుడో, ఎక్కడో అన్నాడట. అప్పటి నుంచి మనోళ్లందరూ తెగ రెచ్చిపోతుంటారు... పేరులో ఏముంది, అంతా మనలోనూ మనసులోనూ ఉండాలి కానీ అని! నన్నడిగితే (నన్ను అడక్కపోయినా, చాలాసార్లు అభిప్రాయాలు అలవోకగా చెబుతుంటానని మా ఆవిడ గట్టి నమ్మకం అనుకోండి, అది వేరే విషయం) అంతా పేరులోనే ఉంది అంటాను. గ్లామరు కాని, గ్రామరు కాని పేరుతోనే మొదలవుతుంది నా లెక్క ప్రకారం. మీకెవ్వరికైనా ఈ విషయం మీద నమ్మకం లేకపోతే ఓ రోజు, పోనీ ఓ గంట నా పేరు పెట్టుకుని చూడండి. ఆ పేరుతో మీకిష్టమైన వాళ్లతో కాసేపు, కష్టమైనవాళ్లతో కాసేపు... ఓ పది నిమిషాలు మురిపెంగా, మరో పది నిమిషాలు కోపంగా పిలిపించుకుని ఆ తర్వాత మాట్లాడండి. ఊహ తెలిసిన దగ్గర్నుంచీ నా పేరు మోటుగా నాటుగా ఉందనిన్నూ, ఏ ఆడపిల్ల అయినా నన్ను ప్రేమించడానికి అడ్డంకిగా ఉందనిన్నూ, ఆ మాటకొస్తే పిలవడానిక్కూడా పిసరంత అందంగా లేదనిన్నూ తెగ ఫీల్ అయిపోయేవాణ్ని. టీనేజిలో మన ఫేస్ టామ్ క్రూజ్‌కి దగ్గరగాను, కమల్ హాసన్‌కి మరీ దగ్గరగానూ ఉన్నట్టుగా ఫీలవుతుండేవాణ్ని. అప్పటికి మహేశ్‌బాబు చాలా చిన్న బుడతడులెండి. మన రేంజ్లో లేడు. మనకు మనమిచ్చుకున్న గ్లామర్ సర్టిఫికెట్తో పాటు నేను కొనిచ్చే మిరపకాయ బజ్జీల కోసం పక్కన చేరిన వందిమాగధుల ‘పొగ’డ్తలు - ‘వారేవా ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని. అలాంటి ఫేస్ పెట్టుకుని ఇంటర్మీడియెట్ రెండేళ్లూ ఎదురుచూశా... ఏ ఒక్క ఆడపిల్ల అయినా ఓ ప్రేమలేఖ రాస్తుందని! కొంతమంది నావైపు అదో రకంగా చూసేవాళ్లు కానీ, వాళ్లెవరి నుంచీ ఉత్తరాలు వచ్చినట్లు తోచదు. నూనూగు మీసాల వయసులో చాలామందికి వచ్చే ఈ ‘ప్రేమలేఖా రాహిత్య ప్రేరేపిత దుర్భర జీవిత రోగం’ నాక్కూడా అంటుకుంది. అప్పుడు సిద్ధాపంతుల అని చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ - ‘ఒరేయ్ మూర్ఖా విను’ అని ఓ క్లాస్ పీకాడు. ‘ఒరేయ్ నీకు గుర్తుందా? హైస్కూల్లో నిన్ను ‘రెడ్డీ మడ్డీ సాంబ్రాణి కడ్డీ’ అని ఆడుకునేవాళ్లు. ఆ పేరేరా నీకు శత్రువు. ఏ ఆడపిల్ల అయినా డియర్ రమేష్ అనో, డియర్ సురేష్ అనో రాయాలనుకుంటుంది కానీ... ప్రియమైన గురవారెడ్డికి అని లవ్ లెటర్ ఎలా రాయగలదురా? ఒరేయ్ నీ ఫేస్ అవ్వొచ్చు ముద్దు. కానీ నీ పేరుతో అది రద్దు’ అని నా పేరు ప్రతిష్టలన్నీ చీల్చి చెండాడేశాడు. అంతటితో ఆగకుండా - వాడి నవలా సాహిత్యం, సినిమా పాండిత్యం ఉపయోగించి, ‘యద్దనపూడి నవలల్లో హీరోల పేర్లు రాజశేఖర్ అనో, చక్రవర్తి అనో ఉంటాయి కానీ... ఎక్కడన్నా గురవారెడ్డి అని ఉందిరా? ఇన్ని సినిమాలు చూస్తున్నాం, ఏ ఒక్క సిన్మాలో అన్నా ఎన్టీవోడు కానీ, ఏయన్నార్ కానీ, కృష్ణ కానీ, శోభన్‌బాబు కానీ నీ పేరు పెట్టుకున్నారురా? కాబట్టి ఆ పేరు ఉన్నన్నాళ్లూ నీ జీవితానికి ప్రేమ లేదురా. అంతే.. అంతే’ అని ఏయన్నార్ స్టైల్లో పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్టుమీదికి జారిపోయాడు. జ్ఞానోదయం అయిన నేను వెంటనే పరిగెట్టుకుని వెళ్లి, మా నాన్నతో నా పేరు రవిగా మార్చుకుందామనుకుంటున్నాను అని చెప్తే... ఆయన ఓ జెల్లకాయ, మొట్టికాయ కలిపి హైబ్రిడ్ జెట్టికాయ ఇచ్చి - ‘ముందు చదివేడు. పేరు మార్చుకోవడం కాదు, పేరు తెచ్చుకోవాలి’ అని మరో ప్రైవేట్ క్లాస్ తీశారు. రవి అని పేరు మార్చుకోగానే ‘రవీ, నువ్వే నా ప్రేమ కవీ... మనిద్దరం పట్టించుకోవద్దు అవీ ఇవీ’ అని ప్రాసాపూరితమైన ప్రేమలేఖ వస్తుందని తెగ ఇదయిపోతున్న నా గుండెపై వందల గునపాలు దిగాయని మీకెలా చెప్పను! అలానే, అదే ఫేస్‌తో, అదే పేరుతో గుంటూరు మెడికల్ కాలేజీలో చేరాను. అప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్లు, ఏనుగు చెవుల కాలర్లున్న షర్టులు ఫ్యాషన్ (అర్థం కాకపోతే వేటగాడు సిన్మా చూడుడు). క్చడౌ క్లినిక్‌లో లివర్లు మార్చుకుంటూ, కిడ్నీలు కూర్చుకుంటూ బతుకుతున్న సుధాకర్గాడు ఆ రోజుల్లో ఫ్యాషన్‌ని ఇంకొంచెం సాగదీసి, ఎలిఫెంట్ బాటమ్‌లు వేసేవాడు. మన రూటే వేరు టైపులో నేను ఫ్యాషన్‌కి ఎదురీది న్యారో ప్యాంట్స్, అంటే గొట్టం ప్యాంట్లు వేసేవాణ్ని. అంతే... వారం రోజుల్లో ‘గొట్టం గురవారెడ్డి’ అనే పేరు స్థిరపడిపోయింది. అమ్మానాన్నలు పెట్టిన పేరుకే తెగ సిగ్గు పడిపోతుంటే, ఈ గొట్టం బిరుదు నన్నింకెంతగా కలవరపరిచి ఉంటుందో ఊహించుకోండి. మనింట్లో కరెంటు పోయినప్పుడు ముందుగా పక్కింట్లో కూడా పోయిందా లేదా చూసుకుంటాం. అక్కడ కూడా పోతే హమ్మయ్య అనుకుంటాం. అంటే మన ఇబ్బందికి పక్కింటివాడి ఇబ్బంది కూడా తోడుంటే ఆ హాయే వేరు. అలానే నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి కూడా నాలాంటి నాటు పేర్లు ఉంటే బాగుండేది అనుకోవడంలో తప్పు లేదు కదా! ఉదాహరణకి నా మిత్రుడొకడికి పెంటారెడ్డి పేరుందనుకోండి... అద్భుతం కదా! కానీ ఇక్కడ కూడా విధి నాతో ఆడుకుంది. సుధాకర్, భాస్కర్, శివనారాయణ, ఉమామహేశ్వర్ లాంటి దేవుళ్ల పేర్లు... టాగూర్, గోఖలే, గాంధీ లాంటి మహనీయుల పేర్లు ఉన్నవాళ్లే తయారయ్యారు నా చుట్టూ. అలా పేరూ పెటాకులూ లేకుండా తిరుగుతున్న రోజుల్లో హఠాత్తుగా దేవుడు కనిపించాడు ఇద్దరు సీనియర్ల రూపంలో. ఒకాయన పేరు పెద్దబ్బాయి. ఇంకొకాయన పేరు తాతయ్య. అంతే... ఆ రోజు నుంచీ నా పేరు చాలా అందంగా కనబడసాగింది. సపోజ్ తాతయ్యని ఓ అమ్మాయి లవ్ చేసిందనుకోండి. ‘డియర్ తాతయ్యా... ఐ లవ్యూ’ అని రాయగానే ఇంకెక్కడి రొమాన్స్ అండీ బాబూ. అంతా నీరు కారిపోదూ! నేను తర్వాత ఈ పేర్ల గురించి చాలా రీసెర్చ్ చేశాను. దాంట్లో తేలిందేమిటంటే... మన రాష్ట్రాలలోనే ఇలాంటి వింత వింత పేర్లుంటాయని. ముందుగా ఒకరిద్దరు పిల్లలు చిన్నప్పుడే చనిపోతే, దిష్టి తగలకూడదని తర్వాతి వాళ్లకి మోటు పేర్లు పెడతారట. ముత్తాతల పేర్లు, దేవుళ్ల పేర్లు కూడా మన సంప్రదాయమే. నాకు చిన్నప్పుడు ఓ స్నేహితుడుండేవాడు. వాడి పేరు వెంకట శివ రామ కృష్ణ భాస్కర ప్రసాద్. ఏ దేవుడినీ హర్ట్ చేయకుండా అందరినీ కలిపేసుకుపోవడం అంటే ఇదేనేమో! నార్త్ ఇండియన్ పేర్లు గమనించారా! అందరి పేర్లూ ముద్దుగా రాహుల్ అనో, రిషీ అనో, విజయ్ అనో ఉంటాయి. వాళ్లకు మన సెంటిమెంట్స్ లేవనుకుంటా. ఆ తర్వాత ఇంగ్లండ్‌కి వెళ్లాక తెలిసింది.. అక్కడ కూడా అతి విరసమైన ఇంటి పేర్లుంటాయని. ఓ ప్రొఫెసర్ ఇంటిపేరు ప్రౌడ్‌ఫుట్. మరో ప్రొఫెసర్ పేరు హజ్బెండ్. సెక్రెటరీ లెటర్ రాసిందనుకోండి... డియర్ హజ్బెండ్ అని... ఏదోలా ఉండదూ! ఇంతకీ నా పేరుకి ఒక్క లవ్ లెటర్ అయినా వచ్చిందా అని మీ అందరికీ అనుమానంగా ఉంది కదా! ఒక్కటేంటి ఖర్మ... వందలొచ్చాయి. అవన్నీ ఒక్కమ్మాయి నుంచే. ఆమె నా పేరుని ముద్దుగా ‘గురివి’ కింద మార్చుకుంది. అఫ్కోర్స్... కోపం వచ్చినప్పుడు ‘కొరివి’ అంటుందనుకోండి! (మా ముత్తాత పేరు పెట్టి - ‘నేను పెట్టిన పేరు కాదురా ఢింబకా, నీ అంతట నువ్వు పేరు తెచ్చుకో’ అని ప్రోత్సహించి, నాకు విలువలు నేర్పి, నాకు కొద్దో గొప్పో పేరొచ్చేవరకు నిద్రపోని మా నాన్నకి క్షమాపణలతో) -
ఇల్లు ఇల్లులాగా లేదు!
ఫన్ డాక్టర్ ఆదివారం సాయంత్రం. ఒక్కడినే ఇంట్లో. గజల్ శ్రీనివాస్ మధుర స్వరం... సీడీ ప్లేయర్ నుంచి అలలు అలలుగా గుండెను తాకుతోంది. ఎందుకో మధ్యాహ్నం భోజనాల వేళ నుంచి వెలితిగా, గుబులుగా ఉంది. నేను, నాన్న మాత్రమే ఉన్నాం. మా అమ్మాయి కావ్య డ్యూటీలో ఉంది. అబ్బాయి ఆదర్శ్‌ని తీసుకుని నా వైఫ్ భవాని, చెల్లెలి కొడుకు పెళ్లికి అమెరికా వెళ్లింది. ప్రతి ఆదివారం ఉదయం కుటుంబమంతా కలిసి భోజనం చేయాలని మా ఆవిడ ఆన. బాహుబలిలో శివగామి ఆన లాంటిదే. అంత పవర్ఫుల్. కాబోయే అల్లుడితో సహా అందరం గత రెండు నెలల నుంచి పాటించడానికి పాట్లు పడుతున్నాం. పిల్లలందరూ ఏవో వంకలు చెప్పి జంప్ చేయాలని చూస్తారు కాని, నేను తెగ బుద్ధిగా డైనింగ్ టేబుల్ దగ్గర హాజర్. ‘మనిద్దరం వయసు మీద పడుతున్నవాళ్లం. పిల్లలకు మనతో బోరులే వదిలేద్దాం. వాళ్ల మానాన వాళ్లని ఆదివారం పండుగ చేసుకోనీ’ అంటే మా ఆవిడ... ‘‘దీన్ని నాన్ నెగోషియబుల్ ఫ్యామిలీ బాండింగ్ అంటారు. ఈ కొంచెంసేపన్నా కలవకపోతే కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు అంత రించుకుపోతాయి’’ అని ఉపదేశం చేసింది. అలా సండే లంచ్ బాండింగ్ - అంటే ఆదివార భోజనానురాగబంధం అలవాటై పోయి, ఈరోజెవరూ లేకపోయేసరికి వెలితిగా అనిపించిందన్నమాట. ‘ఆ! నీ కటింగులు, ఓవరాక్షన్లు మాకు తెలియనివా పితృదేవా, అమ్మ లేకపోతే చాన్స్ పే డ్యాన్స్ ఫక్కీలో తెగ రెచ్చిపోయి ఎంజాయ్ చేస్తా వుగా, ఈ వెలితి, గుబులు అని హరికథలు ఎందుకు’ అని నా పిల్లలిద్దరూ మూకుమ్మ డిగా అరుస్తున్నట్టు ఓ చిన్న ఫీలింగ్ అంత రాంతరాలలో. కాని, నిజంగా సత్తె ప్రమాణంగా మా లేడీస్ ఇంట్లో లేకపోతే ఏం తోచి చావదు. ఇదేదో బహు వచనంలా ఉందేమిటి చెప్మా అని ఆశ్చర్య పడమాకండి. ఏకవచనమే గౌరవంతో కలిపినప్పుడు అలా బహువచనంలా మారుతుందన్నమాట. మూడు ముళ్లు వేసి మూడు పదుల సంవత్సరాలైపోయాయి. ఫర్వాలేదు ఇంకా బాగానే ఉన్నాం. మా గురువుగారు కనపడ్డ వాళ్లని ‘‘ఆర్ యూ హ్యాపీ ఆర్ మ్యారీడ్’’ అని అడుగుతుండేవారు. ఆయన ఉద్దేశం అది కాని, ఇది కాని ఏదో ఒకటే సాధ్యమని. అలా పెళ్లి మీద బోలెడన్ని జోకులు, సూక్తులు. ఆస్కార్ వైల్డ్ అయితే పెళ్లి సూక్తులతో ఓ చిన్నపాటి పుస్తకమే రాసేశాడు. ఆయన వైవాహిక జీవితం గురించి పెద్ద తెలీదనుకోండి. ‘‘అంటే మీ ఇద్దరూ పాలు నీళ్లలా, దాసరి ఎపుడో రాసినట్టు - సైకిల్‌కి రెండు చక్రాల్లా కలిసి మెలిసి సొలసి అలసిపోయారా, అంత సీనుందని మీరంటే మేము నమ్మాలా’’ అని మీలోని భార్యలూ భర్తలూ నన్ను నిలదీస్తున్నారని తెలుసు నాకు. హిందీ సీరియల్స్లోలాగా ‘కర్వా చౌత్’ (ఏదో ఒక పండుగ ఉంటుంది, అదృష్టం అది తెలుగులో లేనట్టుంది) రోజున మా ఆవిడ చందమామను చూసి, ఆ తర్వాత నా ముఖారవిందం కాంచడం లాంటి పనులేవీ చేయదు. రోజూ ఉదయాన లేచి నా కాళ్లెక్కడున్నాయాని వెతికి దణ్నం పెట్టుకుని, మంగళసూత్రాలు కళ్లకద్దుకోవం కూడా చేయదు. పోనీ కనీసం ఏ ఏకాదశి నాడో, ద్వాదశి నాడో మొగుడి ఆరోగ్యం కోసం పస్తులన్నా ఉంటుందా అంటే అదీ లేదు. మరి మీ ఇద్దరి దాంపత్యంలో ఏముందని ఇలా ఆదివారం దొరింది కదాని సాక్షిలో రాసేసి, మా పెళ్లాలకి లేక మా మొగుళ్లకి ఆత్మ న్యూనతా భావాన్ని, అనురాగ రహిత యాంత్రిక దాంపత్య అభద్రతా భయాన్ని అంటగడుతున్నావ్ అని మళ్లీ మీరు ఆవేశపడుతున్నారని నాకు బాగా తెలుసు. వస్తున్నా, వస్తున్నా, అసలు పాయింట్‌కే వస్తున్నా. సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చిత్రీకరించే ఉత్తమ భారత నారీమణి చేసే పనులు ఏ ఒక్కటీ చేయకపోయినా, దాసరిగారి దృష్టిలో మా ఆవిడ సైకిల్ చక్రం కాలేకపోయినా, విశ్వనాథ్‌గారి సృష్టిలో - జయప్రద బొట్టు చెరిగిపోతుందని కమల్‌హాసన్ వానకి చెయ్యి అడ్డం పెట్టినట్టు నేను పెట్టకపోయినా, మేమిద్దరం ఆది దంప తులం కాకపోయినా... ఆనంద దంప తులం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తిట్టుకుని, కొట్టుకుని, సిగలు పట్టుకుని, ఏ రోజూ ప్రతీకార జ్వాలతో నిద్దరపోయినట్టు గుర్తు లేదు నాకు. అది చాలు మేము ఆనం దంగా ఉన్నామని నిరూపించడానికి. అలా అని మేమిద్దరం ఒకే రుచి, ఒకే అభిరుచి ఉన్న రెండు శరీరాలు, ఒకటే ఆత్మ టైపు కాదు. అసలు ఆ మాటకొస్తే, మా ఇద్దరి ఇష్టాలు, దృక్పథాలు ఎక్కడా కలవ్వు. బెడ్రూమ్లో ఫ్యాన్ స్పీడ్ దగ్గర్నుంచి మా విభేదాలు మొదలు. నాకు ఒకటో నంబరులో మలయ మారుతంలా కావాలి. ఆమెకి ఐదో నంబరులో చండ ప్రచండంగా కావాలి. ఆమె తక్కువ మాట్లాడుతుంది. ఆ రెండు మాటలు కూడా చించి చించి ఆలోచించి వాల్యూమ్ వన్‌లో వదులుతుంది. మన స్టైల్ వేరు. మనం ముందు మాట్లాడేస్తాం. అదీ వాల్యూమ్ ఫైవ్‌లో. తరువాత అవసరమైతే ఆలోచిస్తాం. ఆమెకు సంవత్సరానికి ఖర్చయ్యే మాటలు మనం ఒక్కరోజులో వాడేస్తాం. అందుకే తను ముద్దుగా నాకు ‘వెర్బల్ డయేరియా - కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్’ అంటే ‘ఆలోచనా మలబద్దకం - మాటల విరేచనాలు’ అనే రోగాన్ని అంటగట్టింది. అయినా ఇలాంటి చిన్న రోగాల గురించి మనం భయపడతామా? మాటలు మానేస్తామా?! ఆమెకి ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే గుంపు. మనకి కనీసం వంద మందైనా ఉంటేనే ఇంపు. ఆమెకి సినిమాలంటే కంపు. మనకి సినిమా లంటే సొంపు. ఇంత కంటే ఎక్కువ రైమ్‌లు వాడితే ఆమె నన్ను చంపు. ఇన్ని భేదాలు, విభేదాలు ఉన్నా మేమిద్దరం హ్యాపీగా ఎలా ఉన్నామా అని మా ఆనంద దాంపత్య రహస్యం మీరు కూడా తెలుసుకుని - ‘‘పచ్చని మన కాపురం పాలవెలుగై, మణి దీపాల వెలుగై కలకాలం నిలవాలి’’ అని డ్యూయెట్ పాడుకోవడానికి రెడీ అయిపోతున్నా రని తెలుసు నాకు. ఇంతకీ రహస్యం ఏమిటంటారు! ఏమీ లేదండీ బాబూ - అడ్జస్ట్ అయిపోవడమే. గివ్ అండ్ టేక్. అంటే కొంచెం ఇష్టపడు - కొంచెం కష్టపడు. అపుడపుడూ కొంచెం నష్టపడు - అవసరమైనపుడు. నేను ఎంత అడ్జస్ట్ అయ్యానో తెలీదు కానీ తను నాకోసం, నా ఆనందం కోసం బోల్డన్ని త్యాగాలు చేసింది. తనకి ఇష్టం లేకపోయినా, నా నిర్ణయాలకి తలొగ్గి ఈ పరుగులో నాకు తోడుగా నిలిచింది. పిల్లల పాలనా పోషణా తనే చూసుకుంది. తలకాయతో ఆలోచించి రేషనల్‌గా చేయాల్సిన పనుల స్థానంలో గుండె కాయతో స్పందించి ఎమోషనల్‌గా తీసుకున్న నిర్ణయాల ఫలితాల అలజడి నన్ను ముంచేస్తున్న పుడు తన మనోనిబ్బరం ఓ గొడుగై నిలిచింది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకింత సర్దుకుని, ఒకింత హత్తుకుని ప్రయాణం చేసే అలవాటు అంతరించిపోయింది ఈ రోజుల్లో. బలవంతంగా వ్యక్తిత్వాన్ని చంపుకుని, బానిస బతుకులు వెళ్లబుచ్చమని సలహా ఇవ్వడం లేదు నేను. ఆ మధ్య ఎవరో చెప్పారు. ఎంగేజ్మెంట్ పార్టీలో... కాబోయే మొగుడు లేకిగా మూడు కోడిగుడ్లు ఒకేసారి వడ్డించుకున్నాడని, ఓ అమ్మాయి - ‘ఈ మొగుడు క్యాన్సిల్’ అనేసి ఎగిరిపోయిందట. మరీ అతిగా లేదూ! గజల్ శ్రీనివాస్ పాట మనసును తడిమే స్తోంది, తడిపేస్తోంది. ‘‘ఇల్లు ఇపుడు ఇల్లులాగా లేనే లేదు. ఊరు నుంచి తను ఇంకా రానే లేదు - గమనించావో లేదో ఓ మనసా దాంపత్యం లాంటి మైత్రి లేనే లేదు.’’ - డా॥గురవారెడ్డి -
ఆయన దొరికితే అంతే...
ఫన్ డాక్టర్ కలాంగారు నాకు బాగా తెలుసు. ఆయనే కాదు - వాజ్‌పాయి కూడా బాగా తెలుసు. ఆ మాటకొస్తే మోడీ, సోనియా కూడా బాగా తెలుసు. కాకపోతే వాళ్లెవరికీ నేను తెలీదు. అంతే. నేమ్ డ్రాపింగ్ అన్నది ఓ కళ. మనకి చాలామంది తారసపడ్తుంటారు. సంభాషణలో సూటిగా చెప్పకుండా, ఇలా మాట్లాడుతూ ఓ అమితాబ్‌ని, అలా మాట్లాడ్తూ ఓ టెండుల్కర్ని - ‘‘మాకు చాలా క్లోజ్ అండి బాబూ’’ అని బిల్డప్ ఇస్తుంటారు. మరికొంతమంది పేర్లతో ఆగరు. ఫొటో ఆల్బమ్‌లు వెంటేసుకుని తిరుగుతుంటారు. పరిచయం మొదటి నిమిషంలోనే - వాళ్లు సెలెబ్రిటీస్‌తో దిగిన, దింపిన ఫొటోలన్నీ చూయించే స్తారు. సెల్ కెమెరాలు, సెల్ఫీలు వచ్చిన తర్వాత వీళ్ల పని ఇంకా సులువైంది. అంతకుముందంటే కెమెరా వేరేవాడికిచ్చి ‘‘బాబ్బాబూ, ఓ ఫొటో తీయవా పెద్దా యనతో’’ అని అడుక్కో వాల్సి వచ్చేది. మళ్లీ సదరు వ్యక్తి సాగర సంగమంలో ‘భంగిమ’ ఫొటోగ్రాఫర్లాంటివాడను కోండి.. ‘‘ఇవి నా కాళ్లు, అవి మహేష్ బాబు కాళ్లు’’ అని చెప్పుకోవాల్సి వచ్చేది. అసలు విషయానికి వద్దాం. అబ్దుల్ కలాంగారి గురించి. ఓ వ్యక్తి చనిపోయి - ఇంతమంది గుండెల్లో బ్రతికుండటం చాలారోజుల తర్వాత చూశాను. చాలా మంది, చాలా రకాలుగా పరమపదిస్తుం టారు. కానీ ఈయన చావేంటండీ బాబూ! ఎంత అద్భుతం, ఎంత అదృష్టం! తనకు ఇష్టమైన పని.. అదే, యువతని ప్రబోధ పరిచే ఉపన్యాసం ఇస్తూ అలానే నిష్ర్కమిం చడం... ఎంత పుణ్యం చేసుకుంటే ఆ వరం దొరుకుతుందో కదా! ఇంకో రకంగా ఆలోచించండి. ఈ మాజీ ప్రెసిడెంట్‌గారి అదృష్టం బాగోలేక - ఆ రోజు హార్ట్ అటాక్‌తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడనుకోండి. మా డాక్టర్లం దరం రెచ్చిపోయి స్టంట్లు చేసి, స్టంట్లు వేసి వెంటిలేటర్ మీద బాధించి, ‘ఎపుడు వదులుతార్రా - నా పని నేను చేసుకో వాలి’ అనుకుంటూ - చుట్టుపక్కలే తిరుగుతున్న ఎం.ధర్మరాజుతో పోట్లాడి ఆట్లాడి, ప్రెసిడెంట్గార్ని కనీసం ఓ సంవత్సరం పాటన్నా కోమాలోనో, హార్ట్ ఫెయిల్యూర్లోనో, స్ట్రోక్లోనో ఉంచే ఏర్పాటు చేసేవాళ్లం. అందుకనే నాకు చాలా భయం. చావంటే కాదు - చచ్చిపోయే ప్రదేశం గురించి! హాయిగా ఎక్కడో హాలీడేలో, అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూనో టపా కట్టేస్తే - ఎంత ఆనందం. ‘‘కరెక్ట్‌గా చచ్చిపోయే టైమ్‌కి నిన్ను స్విట్జర్లాండ్‌కో, ప్యారిస్కో తీసుకెళ్లడం.. అక్కడి నుంచి నీ పార్ధివ దేహాన్ని ఇండియా తీసుకురావడం, చాలా ప్లానింగ్‌తోనూ, ఖర్చుతోనూ కూడిన పని మగడా. అలాంటి చచ్చు ఐడియాలు పెట్టుకోమాకు’’ అని మా ఆవిడ క్లాస్ పీకే అవకాశం ఉంది కాబట్టి ఈ కోరికని చంపేస్తున్నాను ప్రస్తుతానికి. సరే ఆ ఇష్టం తీరడం కష్టం అంటున్నారు కాబట్టి ఇంకో చిన్న ఇష్టా న్నైనా తీర్చుకుంటూ పోనివ్వండర్రా! ఏమిటంటారా! చాలా సులువైన ఇష్టం ఇది. జీవిత నేస్తాలతో సొల్లు చెప్పు కుంటూ బాల్చీ తన్నేయడం ఊహించు కోండి. ‘ఒరేయ్’... ‘వెధవా’... ‘నీకంత సీనులేదురా’ లాంటి మాటలు మాట్లాడు కోగల ఫ్రెండ్స్‌తో నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ‘ఒరేయ్’, ‘చచ్చావురా నా చేతుల్లో’ అని చతుర్లాడుకుంటూ కుంటూ - ఇంతే సంగతులు. ఎంత అదృష్టం! చెప్పానుగా నా భయం. పొరపాటున, నా చివరి రోజులు బాగోక - మా హాస్పిటల్లోనే దొరికిపోయాననుకోండి. చచ్చానే. ‘వీడు నా జీతం పెంచడా’ అని కోపంతో కొంతమంది, ‘వీడి టార్చర్ ఇన్నాళ్లూ భరించాం, ఇదే ఛాన్స్’ అని మరికొంతమంది... డాక్టర్లు, సర్జన్లు, సర్సులు, వార్డ్ బాయ్స్ అందరూ మూకుమ్మడిగా నాకు గ్యాస్ట్రోస్కోప్, ఆర్థోస్కోప్, లరింగోస్కోప్ - చివరకు కొలనోస్కోప్ కూడా చేసేసి - నాకు చావడానికి స్కోప్ లేకుండా చేస్తారేమోనని చచ్చేంత భయం. ఈ చావు కబుర్లు, చావు కోరికలన్నీ ఎందుకు రాస్తున్నానంటే పుణ్యాత్ములకే ఇలాంటి వరం దొరుకుతుందట. కాబట్టి పుణ్యాలు చేయండి అని చెప్పడానికే. కాళోజీ అన్నట్లు ‘పుటక నీది - చావు నీది - బ్రతుకంతా దేశానిది’. ఇంకోరకంగా చెప్పాలంటే పుట్టుక మన చేతుల్లో లేదు. చావు మన చేతుల్లో లేదు. మధ్యనున్న బ్రతుకే - మనిష్టం. నల్గురిలో మంచి ఉంచుకుంటూ, పెంచుకుంటూ జీవించ డమే ముఖ్యం. నాకు కోట్స్ చాలా ఇష్టం. అవి గుండెల్లో స్ఫూర్తినింపుతాయి. ధైర్యాన్ని స్తాయి. ‘సాహసం చేయరా డింభకా’ అని ముందుకు తోస్తాయి. మార్టిన్ లూథర్ కింగ్, గాంధీ, వివేకానందుడు లాంటి మహనీయులు ఇచ్చిన ప్రబోధ వాక్యాలు మనందరినీ వెన్నుతట్టి ముందుకు నడుపు తుంటాయి. కాంటెంపరరీ టైమ్స్‌లో అలాంటి మాణిక్యాలు అందించినవాళ్లు అరుదు - అబ్దుల్ కలాం మినహా. ఆయన రాసిన పుస్తకాల్లో అయితేనేమి - ఆయన ప్రసంగాల్లో అయితేనేమి - దొర్లిన కొన్ని మాటలు సదా గుర్తుకొచ్చి, కర్తవ్య బోధన చేసే ఆణిముత్యాలు. కలాం చెప్పారు... ‘‘నిద్రలో వచ్చి పోయే కలల గురించి కాదు నేను చెప్పేది, నువ్వు కనే కల నిన్ను నిద్రపో నివ్వకుండా చేయాలి. అలాంటి కలలు రావాలి నీకు.’’ అదేంటో నాకొచ్చే కలలన్నీ సన్నాసివి వస్తుంటాయి. పరీక్షకు లేట్‌గా వెళ్తే లోపలికి రానివ్వనట్లు, నా ఐస్‌క్రీమ్ ఎవడో లాక్కు న్నట్లు, కలాంగారి లెవెల్‌కి ఎప్పుడు ఎదుగుతానో!! - డా॥గురవారెడ్డి