Dr. Gurava Reddy
-
మా నాన్న పులి!
‘‘మా ఫాదర్ ఓ టైగర్, మాట్లాడారంటే థండర్’’ అన్న పాట వినబడింది మొన్నోరోజు. ఆ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లిటిల్ సోల్జర్స్ సినిమా కోసం రాసింది. ఆ పాట, ఆ సిన్మా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సిన్మాలో నటించిన ‘బన్నీ’ నా కూతురు కావ్య. ఇరవైరెండేళ్ల కిందటి మాట అది. మొన్న ఈ పాట వినగానే మా నాన్న గుర్తొచ్చారు. మా ఇద్దరి అనుబంధం గురించి ఆలోచిస్తూ ఆ రోజుల్లోకెళ్లిపోయాను. చాలామంది ఇళ్లల్లో నాన్నకి పెద్దపీట. అలానే, నాన్నకి బోల్డన్ని నిక్‌నేమ్‌లు. టైగర్ అని, హిట్లర్ అని, బిగ్‌బాస్ అని, ఓల్డ్‌మాన్ ... వగైరా వగైరా. మా నాన్నకి అలాంటి ముద్దు పేరేదీ పెట్టినట్లు గుర్తులేదు. కానీ, కాసేపు బిగ్‌బాస్ అని పిలుచుకుందాం. చిన్నప్పుడు తన్నులు మినహాయిస్తే, మా నాన్న చాలా మంచోడు. ఆయన ఆయుధాలు చేతబూని మాకు చేసిన గురూపదేశం ఈ గురవడికి వడిగా ఎలా అర్థమయ్యిందో కూడా కాస్త చెబుతా వినండి. నేను డాక్టర్నయ్యాను. అందునా ఎముకల డాక్టర్ని. ఎముక విరిగితే ఎంతటి ట్రామానో... ఎంత డ్రామా తర్వాత అది బాగవుతుందో క్రీముతో పెట్టినట్టుగా (అంటే వెన్నతో పెట్టినట్టుగా) అర్థమైనప్పుడు – మా నాన్న గొప్పదనమూ అర్థమైంది. మునగచెట్టు నుంచి నేను పుసుక్కున జారితే... ఎముక పుట్టుక్కున విరిగితే... అదెంతగా కలుక్కుమనిపిస్తుందో నాకు చటుక్కున తెలిశాక మా నాన్నపై గౌరవం రెట్టింపయ్యింది. చిన్నప్పుడు నేను, బాబాయి గొప్ప పనులు చేసి, మా నాన్నతో తన్నులు తినేవాళ్లం. శాంపుల్‌కి ఒక సంఘటన చెప్పడం సముచితం. ఇదో రవ్వలడ్ల ఉదంతం. అమ్మ చేసిన రవ్వలడ్లు అద్భుతమైన రుచిగా ఉండేవి. కానీ ఖర్మ ఏమిటంటే... ఆ రోజుల్లో కిరసనాయిలు నుంచి చక్కెర దాకా కజ్జికాయల నుంచి రవ్వలడ్ల దాకా ప్రతిదానికీ రేషన్ ఉండేది. రోజుకి రెండు కంటే పెట్టేది కాదు మా అమ్మ. కానీ మన జిహ్వచాపల్యమేమో అమోఘం. నాలుగు లడ్లు తస్కరించి వాటిని మెట్లు లేని మేడ మీద పదిలంగా దాచి, మునగచెట్టు మీదుగా కిందకు దిగుతుండగా మా బిగ్‌బాస్ కంటపడ్డాను. అంతే రెస్ట్ ఈజ్ హిస్టరీ. ‘మునగ చెట్టు పెళుసు. దాన్నెక్కి కిందపడి కాళ్లు విరగగొట్టుకోవద్దు’ అన్న శాసనాన్ని ఉల్లంఘించినందుకు పది బెల్టు దెబ్బలు, రవ్వలడ్లు దొంగతనం చేసినందుకు ఇంకో పది దెబ్బలు, ‘పైకి ఎందుకు ఎక్కావురా?’ అంటే ‘సూర్యుడిని చూడ్డానికి. అంతేగానీ లెక్కతేలని రవ్వలడ్లకూ, నాకూ ఏమాత్రం సంబంధం లేదు’ అంటూ పెడసరంగా మాట్లాడినందుకు మరో పది దెబ్బలు వెరసి ముచ్చటగా ముప్ఫై దెబ్బల శిక్షపడింది. ‘ఏదో చిలిపి కృష్ణుడి ఫక్కీలో వెన్నముద్దలకు బదులు రవ్వలడ్లు దొంగిలించాడులే’ అని ముచ్చటపడి వదిలేయకుండా, ఒళ్లు వాచిపోయే ఈ బెల్టుదెబ్బల్ని ప్రసాదించిన ఈ తండ్రిని నేను కాబట్టి క్షమించి వదిలేశాను. ఏం...? చిన్నికృష్ణుడిలాగే నావీ లీలలని అనుకోకూడదా? పైగా వందేకృష్ణం జగద్గురుం అంటూ ఆయన జగత్తుకు ‘గురువు’. ఇక నా పేరు సాక్షాత్తూ ‘గురవా’రెడ్డి కదా! అలా దెబ్బలు తింటూ తింటూ ఇంటర్మీడియట్కి వచ్చేశాను. ‘కాలేజీ, టీనేజీ కదా – ఇక దెబ్బలుండవులే’ అని విర్రవీగుతుండగా... మా డాడ్ ఇంకో అనూహ్యమైన దెబ్బకొట్టారు. ‘నీకు ఇంటర్మీడియట్లో ఫస్ట్‌క్లాస్ రాకపోతే నేను ఇల్లు వదిలి వెళ్లిపోతాను కుమారా’’ అని తెగ ముద్దుగా, గోముగా ప్రకటించారు. ఇక చూస్కోండి నా టెన్షన్. నాకు ఫస్ట్‌క్లాస్ ఒక్క మార్కుతో మిస్ అయినట్టు, నాన్న హిమాలయాలకు వెళ్లిపోయినట్లు... అమ్మని, తమ్ముళ్లని పోషించడానికి నేను రాత్రిళ్లు రిక్షా తొక్కుతున్నట్లు... ఒకటే కలలు. ఆ తర్వాత బాపట్లలో వ్యవసాయ కళాశాలలో నేను శిష్యుడిని, ఆయన గురువు. చాలా సిగ్గుపడిపోయేవాడిని. అందరిలాగా గురువుల్ని గొడవ చేయడానికి లేదాయె. ఆయన క్లాసులు తప్పించుకోడానికే మెడికల్ కాలేజీలో చేరాల్సి వచ్చింది. ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అని పాడుకుంటూ, పట్టుమని ఆరు నెలల్లోనే, అప్పుడప్పుడే వికసిస్తున్న నా హాస్టల్ జీవితాన్ని మొగ్గలోనే తుంచేసి, మా డాడ్ గుంటూరుకు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మెడికల్ కాలేజీలో ‘చదువు ముఖ్యం – వినోదం చివరి అంకం’ అంటూ తానూ ‘వినోదమే ప్రథమం – చదువు అనవసరం’ అని నేనూ వాదించుకుంటూ రోదించుకుంటూ గడిపేశాం. నా ‘పెద్దరికానికి’ గౌరవం ఇచ్చేసి, లవ్ అఫైర్‌ని ఆమోదించేసి, అడపాదడపా నా సలహాలను పాటించే లెవల్‌కి (ఎ)దిగిపోయారు మా నాన్న. నాన్నకి మా అందరి గురించి ఎప్పుడూ ఆలోచనే, ఆందోళనే. ఈ రోజుకీ హాస్పిటల్ నుంచి రావడం లేటయితే, ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని ఎంక్వైరీ చేయాల్సిందే. అమ్మకి రెండేళ్ల పాటు బాగోలేక వీల్‌చైర్‌కి పరిమితమైనప్పుడు – నాన్న, అమ్మను సాకిన తీరు అనిర్వచనీయం, ప్రతిక్షణం ఆమెతోనే ఉండి, ఆమె బాగోగులు చూసుకుంటూ నాన్న ఆమెకు చేసిన సేవలు అనితరసాధ్యం. నాన్న నుంచి వేరే ఏమీ నేర్చుకోకపోయినా – జీవిత చరమాంకంలో భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకొని ఆచరిస్తే జన్మ ధన్యమే. చిన్నప్పటి నుంచి నాన్న క్లాసులు తప్పించుకోవాలని, దూరంగా వెళ్లాలని ప్రయత్నించిన నేను, చివరకు ఇంగ్లాండ్‌లో తనకు దూరంగా పదేళ్లున్నప్పుడు తనని ఎంతో మిస్ అయ్యాను. మా నాన్న నాకు క్లాసులు తీస్తుండేవారని నేను అనుకుంటుండేవాడినా... ఇప్పుడు అందరూ అంటుంటారు... నేను నా కొడుక్కి, అచ్చం మా నాన్న నాకు తీసినట్లే క్లాసులు తీస్తుంటానని! ఏం చేస్తాం... తండ్రి కొడుకుల అనుబంధం అచ్చం క్రికెట్ బంతిలాంటిది. అది నిత్యం స్పిన్నవుతూ అలా గిర్రున నర్తిస్తుంటుంది. వలయంలా వర్తిస్తుంటుంది. ఎస్... లైఫ్ ఈజ్ ఏ సైకిల్. దిసీజ్ లైఫ్ సైకిల్. – డాక్టర్ గురవారెడ్డి -
కూరకి తాలింపు మాటకు లాలింపు
డా.గురవారెడ్డి మా అమ్మ ఎప్పుడూ ఒక సూక్తి చెప్తుండేది... ‘కూరకి తాలింపు - చీరకి జాడింపు - మాటకి లాలింపు’ అవసర మని. కూర సంగతి, చీర సంగతి మనకు పెద్ద తెలియదు కానీ - మాటకి మట్టుకు లాలింపు ఉండాల్సిందేనని నా గట్టి నమ్మకం. అలా అని నేను మహా మృదు భాషాప్రవీణుడిని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. మన ఒంట్లో మృదు భాషణం లేదు - మిత భాషణం అంత కన్నా లేదు. నాకు నిశ్శబ్దం నిస్తేజంలా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ వాగుతూనే, తూగుతానే (తాగుతూ కాదండీ బాబూ) బాల్చీ తన్నేయాలని నా కోరిక. వాగుడు ఇష్టం కాబట్టి చుట్టుపక్కల వాళ్లని గమనించడం సహజమే కదా! అప్పుడు తెలిసింది ఏమిటంటే వాగుడులో చాలా రకాలుంటాయని. కొందరు ఇనుప సుత్తెలు. వారు బాదుతుంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. తప్పించుకో వచ్చు ఏదో వంకబెట్టి. కానీ మరికొందరు రబ్బరు సుత్తెలు. వీళ్లతో డేంజర్. మొదట పెద్ద నొప్పి ఉండదు. ఓ గంట పోయాక కాని ఆ దెబ్బల ప్రభావం తెలీదు. సంభాషణాచతురులు కొందరుం టారు. వీరితో మనం ఏం మాట్లాడ ప్రయత్నించినా దాన్ని లాఘవంగా మెడలు వంచి, విరిచి, తమవైపుకు తిప్పేసి, వారెంత ఘనాపాటులో, వారికి ఎంత పరపతి ఉందో, వారెంతమంది బడుగు వర్గాలను ఉద్ధరించారో, ఇత్యాది విషయాలన్నీ అయిదు నిమిషాల్లో చెప్పేయగలరు. కొంతమంది ప్రతి విష యానికీ, మళ్లీ మాట్లాడితే ప్రతి వాక్యానికీ వ్యంగ్య బాణాన్ని అనుసంధించి మన గుండెకి గుచ్చుకునే రీతిలో వదులుతారు. ఉదాహరణకి - ‘ఇపుడేనా రావడం’ అని పలకరిస్తే, - ‘ఆహా! రాత్రికే వచ్చి, మెట్ల కింద పడుకుని, ఇప్పుడు కనపడుతున్నాను మీకు’ అంటారు. సరే ఆ వ్యంగ్యాన్ని దిగమింగి, ‘ఆరోగ్యం బాగుందా’ అంటే ‘నాకేం గుండ్రాయిలాగున్నా - కనపడ్డంలా?’ అని మరో విసురు. నాకు తెలిసిన ఓ డాక్టరు స్నేహితుడుండేవాడు ఇంగ్లండులో. ఆయన పార్టీలో ఉన్నాడంటే - ఆ దరి దాపులకు వెళ్లేవాణ్ని కాదు. ఆయన డైలాగులు కొన్ని వినిపిస్తాను మీకోసం. ‘ఏవాయ్. పెద్ద హాస్పిటల్ పెట్టి తెగ సంపాదిస్తున్నావటగా. జాగ్రత్త - డబ్బు జబ్బు చేసి గబ్బుపట్టిపోతావ్.’ - ‘సూట్ కొత్తది లాగుందీ - ఒరిజినల్ యేనా - మేడ్ ఇన్ చైనానా’ - ఇవి మచ్చు తునకలు మాత్రమే. ఈ డాక్టరుగారి వ్యంగ్య హాస్యాన్ని వాళ్లావిడ ఎలా తట్టుకుంటుందో - తిట్టుకుంటుందో!! మరికొంతమంది ఊతపదాల సామ్రాట్టులుంటారు. సంభాషణలో ప్రతి మాట వెనక ఊతపదం లేకపోతే వాళ్లకి మాటలు పడిపోతాయి. బాపట్లలో ఓ తెలుగు టీచరుండేవాడు. ‘పోనీలే’ ఆయన ఊతపదం. ‘సర్, రేపు స్కూల్ సెలవు’ అంటే ‘పోనీలే’, ‘సర్, తెలుగు పుస్తకం పోయింది’ అంటే మళ్లీ ‘పోనీలే’. ఓసారి హెడ్మాస్టర్ భార్య చనిపోయింది. అసెంబ్లీలో బంట్రోతు వచ్చి ‘అయ్యా! హెడ్మాస్టర్గారి శ్రీమతి చనిపోయా రయ్యా’ అంటే - ఈయన వెంటనే ‘పోనీలే’ అనడం జరిగింది. ఏదో సిన్మా అనుకుంటా - ఒక ఆసామికి ‘అంతా మీ దయ’ ఊతపదం. ‘అయ్యా బాగున్నారా’ - ‘బాగున్నాను సార్. అంతా మీ దయ’. ‘ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నట్లున్నాయ్’ - ‘అవును సార్ - అంతా మీ దయ’. ‘ఈ మధ్య మీకు కొడుకు పుట్టాడట గదా’ - ‘అవును సార్ - అంతా మీ దయ’. ఇంక మాట్లాడను - ఊతపదాల గురించి స్వస్తి. నాకు సత్సంగం అంటే చాలా ఇష్టం. మంచి మాటలు రోజూ వింటుంటే కొన్నైనా హృదయంలో తిష్ట వేసుకుని, మనల్ని మంచి మార్గాన నడిపిస్తాయని నా నమ్మకం. చాగంటివారి దగ్గర నుంచి, రంగరాజన్, జగ్గీ వాసుదేవ్, ఆచార్య రజనీష్ దాకా అందరి బోధలూ వింటాను. మంచి వక్తలతో, మంచి వ్యక్తులతో కాసేపు కూచుంటే మనసు తరించి పోతుంది. కాకపోతే అలాంటి వ్యక్తులు దొరకడమే కష్టం. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ని. వివిధ రంగాలలో నిష్ణాతులై, తలపండిపోయిన అనేకమంది గొప్పవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వారితో అవకాశం దొరికి నప్పుడల్లా ముచ్చటిస్తుంటాను. ఆ సంభాషణలు నన్ను అనుక్షణం ఉత్తేజపరచి, జీవిత గమనంలో కొత్త కోణాలను ఆవిష్కరింప జేస్తుంటాయి. శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డిగారితో కాసేపు కూచుంటే - మానవీయత విలువలు ఎంత ఉన్నతంగా ఉండాలో తేటతెల్లమవుతుంది. గజల్ శ్రీనివాస్‌తో మాట్లాడుతుంటే - ఆణిముత్యా ల్లాంటి జీవిత సత్యాలు దొరుకుతాయి. భగవద్గీత మొత్తం శ్లోకాలను గానం చేసిన గంగాధరశాస్త్రితో ఎంతసేపు సంభాషించినా తనివి తీరదు. శ్లోకాలను ఉటంకిస్తూ, స్వచ్ఛ మైన స్వరంలో ఆయన అందించే సూక్తులు అంతరంగాన్ని ప్రశాంతపరుస్తాయి. బాలుగారి సాన్నిధ్యం అడపాదడపా దొరుకుతుంది. ఆయన పాటలే కాదు... మాటలు కూడా భావయుక్తంగా ఉంటాయి. ఎదుటివారి అభిరుచిని, అనురక్తిని గమనించి, సరస సల్లాపం చేయడం అందరికీ వచ్చే విద్య కాదు. చుట్టుపక్కల జనం సంగతి వదిలేసినా... టీవీ యాంకర్స్ మనల్ని ‘చిత్ర’ హింసలు పెడ్తుంటారు. కొంతమందికి ఉచ్చారణ రాదు. మరికొంత మందికి ఇంటర్వ్యూ ఎలా చేయాలో రాదు. ప్రశ్న సమాధానం కంటే నాలుగు రెట్లు నిడివి ఉంటుంది. టీవీలు వదిలేసి, మంచి ఉపన్యాసం విందామని ఏ రవీంద్రభారతికో వెళ్లామను కోండి. కొంతమంది మైకాసురులు గంటల తరబడి మాట్లాడి మాట్లాడి, మనల్ని ప్రసంగ బాధితుల సంఘంలో చేర్చేస్తారు. చివరగా, నేను చెప్పదలచుకున్న దేమిటంటే - మాట్లాడటం ఓ అద్భుతమైన కళ. అది నేర్చుకోవాలి. అభ్యాసం చేయాలి. ఉంది కదా అని నోరు పారేసుకోకూడదు నలుగురిలో. సున్నితంగా ప్రియభాషణం, అతి క్లుప్తంగా మితభాషణం చేయగలగాలి. మనకు రాకపోతే అలాంటివాళ్లని పెళ్లి చేసుకోవాలి. ఓ కవి రాశాడు వాళ్లావిడ గురించి అనుకుంటా. ‘‘నడిచిందంటే గుమ్మం వరకే - నవ్విందంటే అధరం వరకే - మాటాడిందంటే నా చెవి వరకే - కోపం వచ్చిందంటే కొద్దిపాటి మౌనం వరకే’’. మా ఆవిడ కూడా ఇలాంటి బాపతే. వాల్మీకి చెప్పాడు అసలు సంభాషణ ఎలా ఉండాలో. ‘అవిస్తరం - సుదీర్ఘంగా ఉండ కూడదు, అసందిగ్ధం - అస్పష్టత ఉండకూడదు, అవిలంబితం - సాగదీసినట్లు ఉండకూడదు, అవ్యథం - నొప్పించకూడదు, ఉరస్థ కంటగం వాక్యం వర్ధతే మధ్యమ స్వరం - హృదయం నుంచి జనించిన మాటలు కంఠం ద్వారా వృద్ధి చెందుతూ మంద్రంగా మొదలై, మధ్యస్థాయి వరకే పెరగాలి తప్ప ఉచ్ఛ స్వరంలో ఉండకూడదు’ అని. నా వాగుడు వాల్మీకి లెవెల్‌కి ఎపుడు వెళుతుందో!! -
ఆయన దొరికితే అంతే...
ఫన్ డాక్టర్ కలాంగారు నాకు బాగా తెలుసు. ఆయనే కాదు - వాజ్‌పాయి కూడా బాగా తెలుసు. ఆ మాటకొస్తే మోడీ, సోనియా కూడా బాగా తెలుసు. కాకపోతే వాళ్లెవరికీ నేను తెలీదు. అంతే. నేమ్ డ్రాపింగ్ అన్నది ఓ కళ. మనకి చాలామంది తారసపడ్తుంటారు. సంభాషణలో సూటిగా చెప్పకుండా, ఇలా మాట్లాడుతూ ఓ అమితాబ్‌ని, అలా మాట్లాడ్తూ ఓ టెండుల్కర్ని - ‘‘మాకు చాలా క్లోజ్ అండి బాబూ’’ అని బిల్డప్ ఇస్తుంటారు. మరికొంతమంది పేర్లతో ఆగరు. ఫొటో ఆల్బమ్‌లు వెంటేసుకుని తిరుగుతుంటారు. పరిచయం మొదటి నిమిషంలోనే - వాళ్లు సెలెబ్రిటీస్‌తో దిగిన, దింపిన ఫొటోలన్నీ చూయించే స్తారు. సెల్ కెమెరాలు, సెల్ఫీలు వచ్చిన తర్వాత వీళ్ల పని ఇంకా సులువైంది. అంతకుముందంటే కెమెరా వేరేవాడికిచ్చి ‘‘బాబ్బాబూ, ఓ ఫొటో తీయవా పెద్దా యనతో’’ అని అడుక్కో వాల్సి వచ్చేది. మళ్లీ సదరు వ్యక్తి సాగర సంగమంలో ‘భంగిమ’ ఫొటోగ్రాఫర్లాంటివాడను కోండి.. ‘‘ఇవి నా కాళ్లు, అవి మహేష్ బాబు కాళ్లు’’ అని చెప్పుకోవాల్సి వచ్చేది. అసలు విషయానికి వద్దాం. అబ్దుల్ కలాంగారి గురించి. ఓ వ్యక్తి చనిపోయి - ఇంతమంది గుండెల్లో బ్రతికుండటం చాలారోజుల తర్వాత చూశాను. చాలా మంది, చాలా రకాలుగా పరమపదిస్తుం టారు. కానీ ఈయన చావేంటండీ బాబూ! ఎంత అద్భుతం, ఎంత అదృష్టం! తనకు ఇష్టమైన పని.. అదే, యువతని ప్రబోధ పరిచే ఉపన్యాసం ఇస్తూ అలానే నిష్ర్కమిం చడం... ఎంత పుణ్యం చేసుకుంటే ఆ వరం దొరుకుతుందో కదా! ఇంకో రకంగా ఆలోచించండి. ఈ మాజీ ప్రెసిడెంట్‌గారి అదృష్టం బాగోలేక - ఆ రోజు హార్ట్ అటాక్‌తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడనుకోండి. మా డాక్టర్లం దరం రెచ్చిపోయి స్టంట్లు చేసి, స్టంట్లు వేసి వెంటిలేటర్ మీద బాధించి, ‘ఎపుడు వదులుతార్రా - నా పని నేను చేసుకో వాలి’ అనుకుంటూ - చుట్టుపక్కలే తిరుగుతున్న ఎం.ధర్మరాజుతో పోట్లాడి ఆట్లాడి, ప్రెసిడెంట్గార్ని కనీసం ఓ సంవత్సరం పాటన్నా కోమాలోనో, హార్ట్ ఫెయిల్యూర్లోనో, స్ట్రోక్లోనో ఉంచే ఏర్పాటు చేసేవాళ్లం. అందుకనే నాకు చాలా భయం. చావంటే కాదు - చచ్చిపోయే ప్రదేశం గురించి! హాయిగా ఎక్కడో హాలీడేలో, అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూనో టపా కట్టేస్తే - ఎంత ఆనందం. ‘‘కరెక్ట్‌గా చచ్చిపోయే టైమ్‌కి నిన్ను స్విట్జర్లాండ్‌కో, ప్యారిస్కో తీసుకెళ్లడం.. అక్కడి నుంచి నీ పార్ధివ దేహాన్ని ఇండియా తీసుకురావడం, చాలా ప్లానింగ్‌తోనూ, ఖర్చుతోనూ కూడిన పని మగడా. అలాంటి చచ్చు ఐడియాలు పెట్టుకోమాకు’’ అని మా ఆవిడ క్లాస్ పీకే అవకాశం ఉంది కాబట్టి ఈ కోరికని చంపేస్తున్నాను ప్రస్తుతానికి. సరే ఆ ఇష్టం తీరడం కష్టం అంటున్నారు కాబట్టి ఇంకో చిన్న ఇష్టా న్నైనా తీర్చుకుంటూ పోనివ్వండర్రా! ఏమిటంటారా! చాలా సులువైన ఇష్టం ఇది. జీవిత నేస్తాలతో సొల్లు చెప్పు కుంటూ బాల్చీ తన్నేయడం ఊహించు కోండి. ‘ఒరేయ్’... ‘వెధవా’... ‘నీకంత సీనులేదురా’ లాంటి మాటలు మాట్లాడు కోగల ఫ్రెండ్స్‌తో నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ‘ఒరేయ్’, ‘చచ్చావురా నా చేతుల్లో’ అని చతుర్లాడుకుంటూ కుంటూ - ఇంతే సంగతులు. ఎంత అదృష్టం! చెప్పానుగా నా భయం. పొరపాటున, నా చివరి రోజులు బాగోక - మా హాస్పిటల్లోనే దొరికిపోయాననుకోండి. చచ్చానే. ‘వీడు నా జీతం పెంచడా’ అని కోపంతో కొంతమంది, ‘వీడి టార్చర్ ఇన్నాళ్లూ భరించాం, ఇదే ఛాన్స్’ అని మరికొంతమంది... డాక్టర్లు, సర్జన్లు, సర్సులు, వార్డ్ బాయ్స్ అందరూ మూకుమ్మడిగా నాకు గ్యాస్ట్రోస్కోప్, ఆర్థోస్కోప్, లరింగోస్కోప్ - చివరకు కొలనోస్కోప్ కూడా చేసేసి - నాకు చావడానికి స్కోప్ లేకుండా చేస్తారేమోనని చచ్చేంత భయం. ఈ చావు కబుర్లు, చావు కోరికలన్నీ ఎందుకు రాస్తున్నానంటే పుణ్యాత్ములకే ఇలాంటి వరం దొరుకుతుందట. కాబట్టి పుణ్యాలు చేయండి అని చెప్పడానికే. కాళోజీ అన్నట్లు ‘పుటక నీది - చావు నీది - బ్రతుకంతా దేశానిది’. ఇంకోరకంగా చెప్పాలంటే పుట్టుక మన చేతుల్లో లేదు. చావు మన చేతుల్లో లేదు. మధ్యనున్న బ్రతుకే - మనిష్టం. నల్గురిలో మంచి ఉంచుకుంటూ, పెంచుకుంటూ జీవించ డమే ముఖ్యం. నాకు కోట్స్ చాలా ఇష్టం. అవి గుండెల్లో స్ఫూర్తినింపుతాయి. ధైర్యాన్ని స్తాయి. ‘సాహసం చేయరా డింభకా’ అని ముందుకు తోస్తాయి. మార్టిన్ లూథర్ కింగ్, గాంధీ, వివేకానందుడు లాంటి మహనీయులు ఇచ్చిన ప్రబోధ వాక్యాలు మనందరినీ వెన్నుతట్టి ముందుకు నడుపు తుంటాయి. కాంటెంపరరీ టైమ్స్‌లో అలాంటి మాణిక్యాలు అందించినవాళ్లు అరుదు - అబ్దుల్ కలాం మినహా. ఆయన రాసిన పుస్తకాల్లో అయితేనేమి - ఆయన ప్రసంగాల్లో అయితేనేమి - దొర్లిన కొన్ని మాటలు సదా గుర్తుకొచ్చి, కర్తవ్య బోధన చేసే ఆణిముత్యాలు. కలాం చెప్పారు... ‘‘నిద్రలో వచ్చి పోయే కలల గురించి కాదు నేను చెప్పేది, నువ్వు కనే కల నిన్ను నిద్రపో నివ్వకుండా చేయాలి. అలాంటి కలలు రావాలి నీకు.’’ అదేంటో నాకొచ్చే కలలన్నీ సన్నాసివి వస్తుంటాయి. పరీక్షకు లేట్‌గా వెళ్తే లోపలికి రానివ్వనట్లు, నా ఐస్‌క్రీమ్ ఎవడో లాక్కు న్నట్లు, కలాంగారి లెవెల్‌కి ఎప్పుడు ఎదుగుతానో!! - డా॥గురవారెడ్డి