మా నాన్న పులి! | a sof father and sons gurava reddy and family | Sakshi
Sakshi News home page

మా నాన్న పులి!

Published Sat, Jun 17 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

మా నాన్న పులి!

మా నాన్న పులి!

‘‘మా ఫాదర్‌ ఓ టైగర్, మాట్లాడారంటే థండర్‌’’ అన్న పాట వినబడింది మొన్నోరోజు. ఆ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లిటిల్‌ సోల్జర్స్‌ సినిమా కోసం రాసింది. ఆ పాట, ఆ సిన్మా నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే ఆ సిన్మాలో నటించిన ‘బన్నీ’ నా కూతురు కావ్య. ఇరవైరెండేళ్ల కిందటి మాట అది. మొన్న ఈ పాట వినగానే మా నాన్న గుర్తొచ్చారు. మా ఇద్దరి అనుబంధం గురించి ఆలోచిస్తూ ఆ రోజుల్లోకెళ్లిపోయాను.

చాలామంది ఇళ్లల్లో నాన్నకి పెద్దపీట. అలానే, నాన్నకి బోల్డన్ని నిక్‌నేమ్‌లు. టైగర్‌ అని, హిట్లర్‌ అని, బిగ్‌బాస్‌ అని, ఓల్డ్‌మాన్‌ ... వగైరా వగైరా. మా నాన్నకి అలాంటి ముద్దు పేరేదీ పెట్టినట్లు గుర్తులేదు. కానీ, కాసేపు బిగ్‌బాస్‌ అని పిలుచుకుందాం.

చిన్నప్పుడు తన్నులు మినహాయిస్తే, మా నాన్న చాలా మంచోడు. ఆయన ఆయుధాలు చేతబూని మాకు చేసిన గురూపదేశం ఈ గురవడికి వడిగా ఎలా అర్థమయ్యిందో కూడా కాస్త చెబుతా వినండి. నేను డాక్టర్‌నయ్యాను. అందునా ఎముకల డాక్టర్‌ని. ఎముక విరిగితే ఎంతటి ట్రామానో... ఎంత డ్రామా తర్వాత అది బాగవుతుందో క్రీముతో పెట్టినట్టుగా (అంటే వెన్నతో పెట్టినట్టుగా) అర్థమైనప్పుడు – మా నాన్న గొప్పదనమూ అర్థమైంది. మునగచెట్టు నుంచి నేను పుసుక్కున జారితే... ఎముక పుట్టుక్కున విరిగితే... అదెంతగా కలుక్కుమనిపిస్తుందో నాకు చటుక్కున తెలిశాక మా నాన్నపై గౌరవం రెట్టింపయ్యింది.

చిన్నప్పుడు నేను, బాబాయి గొప్ప పనులు చేసి, మా నాన్నతో తన్నులు తినేవాళ్లం. శాంపుల్‌కి ఒక సంఘటన చెప్పడం సముచితం. ఇదో రవ్వలడ్ల ఉదంతం. అమ్మ చేసిన రవ్వలడ్లు అద్భుతమైన రుచిగా ఉండేవి. కానీ ఖర్మ ఏమిటంటే... ఆ రోజుల్లో కిరసనాయిలు నుంచి చక్కెర దాకా కజ్జికాయల నుంచి రవ్వలడ్ల దాకా ప్రతిదానికీ రేషన్‌ ఉండేది. రోజుకి రెండు కంటే పెట్టేది కాదు మా అమ్మ. కానీ మన జిహ్వచాపల్యమేమో అమోఘం. నాలుగు లడ్లు తస్కరించి వాటిని మెట్లు లేని మేడ మీద పదిలంగా దాచి, మునగచెట్టు మీదుగా కిందకు దిగుతుండగా మా బిగ్‌బాస్‌ కంటపడ్డాను. అంతే రెస్ట్‌ ఈజ్‌ హిస్టరీ.

‘మునగ చెట్టు పెళుసు. దాన్నెక్కి కిందపడి కాళ్లు విరగగొట్టుకోవద్దు’ అన్న శాసనాన్ని ఉల్లంఘించినందుకు పది బెల్టు దెబ్బలు, రవ్వలడ్లు దొంగతనం చేసినందుకు ఇంకో పది దెబ్బలు, ‘పైకి ఎందుకు ఎక్కావురా?’ అంటే ‘సూర్యుడిని చూడ్డానికి. అంతేగానీ లెక్కతేలని రవ్వలడ్లకూ, నాకూ ఏమాత్రం సంబంధం లేదు’ అంటూ పెడసరంగా మాట్లాడినందుకు మరో పది దెబ్బలు వెరసి ముచ్చటగా ముప్ఫై దెబ్బల శిక్షపడింది. ‘ఏదో చిలిపి కృష్ణుడి ఫక్కీలో వెన్నముద్దలకు బదులు రవ్వలడ్లు దొంగిలించాడులే’ అని ముచ్చటపడి వదిలేయకుండా, ఒళ్లు వాచిపోయే ఈ బెల్టుదెబ్బల్ని ప్రసాదించిన ఈ తండ్రిని నేను కాబట్టి క్షమించి వదిలేశాను. ఏం...? చిన్నికృష్ణుడిలాగే నావీ లీలలని అనుకోకూడదా? పైగా వందేకృష్ణం జగద్గురుం అంటూ ఆయన జగత్తుకు ‘గురువు’. ఇక నా పేరు సాక్షాత్తూ ‘గురవా’రెడ్డి కదా!  

అలా దెబ్బలు తింటూ తింటూ ఇంటర్మీడియట్‌కి వచ్చేశాను. ‘కాలేజీ, టీనేజీ కదా – ఇక దెబ్బలుండవులే’ అని విర్రవీగుతుండగా... మా డాడ్‌ ఇంకో అనూహ్యమైన దెబ్బకొట్టారు. ‘నీకు ఇంటర్మీడియట్‌లో ఫస్ట్‌క్లాస్‌ రాకపోతే నేను ఇల్లు వదిలి వెళ్లిపోతాను కుమారా’’ అని తెగ ముద్దుగా, గోముగా ప్రకటించారు.

ఇక చూస్కోండి నా టెన్షన్‌. నాకు ఫస్ట్‌క్లాస్‌ ఒక్క మార్కుతో మిస్‌ అయినట్టు, నాన్న హిమాలయాలకు వెళ్లిపోయినట్లు... అమ్మని, తమ్ముళ్లని పోషించడానికి నేను రాత్రిళ్లు రిక్షా తొక్కుతున్నట్లు... ఒకటే కలలు.

ఆ తర్వాత బాపట్లలో వ్యవసాయ కళాశాలలో నేను శిష్యుడిని, ఆయన గురువు. చాలా సిగ్గుపడిపోయేవాడిని. అందరిలాగా గురువుల్ని గొడవ చేయడానికి లేదాయె. ఆయన  క్లాసులు తప్పించుకోడానికే మెడికల్‌ కాలేజీలో చేరాల్సి వచ్చింది.

‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అని పాడుకుంటూ, పట్టుమని ఆరు నెలల్లోనే, అప్పుడప్పుడే వికసిస్తున్న నా హాస్టల్‌ జీవితాన్ని మొగ్గలోనే తుంచేసి, మా డాడ్‌ గుంటూరుకు ట్రాన్స్‌ఫర్‌ అయిపోయారు. మెడికల్‌ కాలేజీలో ‘చదువు ముఖ్యం –  వినోదం చివరి అంకం’ అంటూ తానూ ‘వినోదమే ప్రథమం – చదువు అనవసరం’ అని నేనూ వాదించుకుంటూ రోదించుకుంటూ గడిపేశాం. నా ‘పెద్దరికానికి’ గౌరవం ఇచ్చేసి, లవ్‌ అఫైర్‌ని ఆమోదించేసి, అడపాదడపా నా సలహాలను పాటించే లెవల్‌కి (ఎ)దిగిపోయారు మా నాన్న.

నాన్నకి మా అందరి గురించి ఎప్పుడూ ఆలోచనే, ఆందోళనే. ఈ రోజుకీ హాస్పిటల్‌ నుంచి రావడం లేటయితే, ఫోన్‌ చేసి ఎక్కడున్నావురా అని ఎంక్వైరీ చేయాల్సిందే. అమ్మకి రెండేళ్ల పాటు బాగోలేక వీల్‌చైర్‌కి పరిమితమైనప్పుడు – నాన్న, అమ్మను సాకిన తీరు అనిర్వచనీయం, ప్రతిక్షణం ఆమెతోనే ఉండి, ఆమె బాగోగులు చూసుకుంటూ నాన్న ఆమెకు చేసిన సేవలు అనితరసాధ్యం. నాన్న నుంచి వేరే ఏమీ నేర్చుకోకపోయినా – జీవిత చరమాంకంలో భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకొని ఆచరిస్తే జన్మ ధన్యమే.

చిన్నప్పటి నుంచి నాన్న క్లాసులు తప్పించుకోవాలని, దూరంగా వెళ్లాలని ప్రయత్నించిన నేను, చివరకు ఇంగ్లాండ్‌లో తనకు దూరంగా పదేళ్లున్నప్పుడు తనని ఎంతో మిస్‌ అయ్యాను. మా నాన్న నాకు క్లాసులు తీస్తుండేవారని నేను అనుకుంటుండేవాడినా... ఇప్పుడు అందరూ అంటుంటారు... నేను నా కొడుక్కి, అచ్చం మా నాన్న నాకు తీసినట్లే క్లాసులు తీస్తుంటానని!
ఏం చేస్తాం... తండ్రి కొడుకుల అనుబంధం అచ్చం క్రికెట్‌ బంతిలాంటిది. అది నిత్యం స్పిన్నవుతూ అలా గిర్రున నర్తిస్తుంటుంది. వలయంలా వర్తిస్తుంటుంది. ఎస్‌... లైఫ్‌ ఈజ్‌ ఏ సైకిల్‌. దిసీజ్‌ లైఫ్‌ సైకిల్‌. – డాక్టర్‌ గురవారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement