లిటిల్‌ సోల్జర్స్‌ | Little Soldiers | Sakshi
Sakshi News home page

లిటిల్‌ సోల్జర్స్‌

Published Sun, Apr 30 2017 12:53 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

లిటిల్‌ సోల్జర్స్‌ - Sakshi

లిటిల్‌ సోల్జర్స్‌

అల్లరి చేయాల్సిన చిచ్చర పిడుగులు అక్షరాలకు పదును పెడుతున్నారు.పత్రికల్లోని శీర్షికలను కూడబలుక్కుని చదివే వయసులోనే పతాక శీర్షికలను నిర్దేశిస్తున్నారు. చిన్నపిల్లలే కదా, ఏవో కాకమ్మ కథలు రాసుకుంటార్లే అనుకుంటే పొరపాటే! మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాకు సైతం చిక్కని కథనాలను అలవోకగా దొరకబుచ్చుకుంటున్నారు. ఎంతటి ఘనాపాటీ నాయకులనైనా జంకూ గొంకూ
లేకుండా ఇంటర్వూ్యలు చేసేస్తున్నారు.పెద్దల పత్రికలకు సుద్దులు చెప్పే రీతిలో తమవైన పత్రికలను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. కలాలనే ఆయుధాలుగా చేసుకున్న ఈ లిటిల్‌ సోల్జర్స్‌ ఇండియాలోనే కాదు, ఇంకొన్ని దేశాల్లోనూ ఉన్నారు. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా వీళ్లు సాధిస్తున్న విజయాలను మీ ముందు ఉంచుతున్నాం.

బాలల గొంతు... బాలక్‌నామా
‘బాలక్‌నామా’... ఇది అచ్చంగా బాలల పత్రిక. బాలల కోసం స్వయంగా బాలలే నిర్వహిస్తున్న పదహారు పేజీల పూర్తిస్థాయి టాబ్లాయిడ్‌ మాసపత్రిక. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వెలువడుతోంది. దీని సర్క్యులేషన్‌ హిందీలో ఐదువేల కాపీలు, ఇంగ్లిష్‌లో మూడువేల కాపీలు. ‘చేతన’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఢిల్లీలోని వీధిబాలలు, బాల కార్మికులు పద్నాలుగేళ్ల కిందట దీనిని ప్రారంభించారు. ఈ పత్రికకు ఢిల్లీలోనే పద్నాలుగు మంది పూర్తిస్థాయి రిపోర్టర్లు పని చేస్తున్నారు. వీళ్లందరూ బాలలే. వీళ్లే కాకుండా అడపా దడపా రాసే ఔత్సాహిక బాలలు కూడా దీనికి తరచుగా కథనాలను అందిస్తూ ఉంటారు. మొదట ఢిల్లీలోనే ప్రారంభమైనా, ఇప్పుడిది హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకూ విస్తరించింది. ఈ ప్రాంతాల్లో కూడా కొందరు పూర్తిస్థాయి రిపోర్టర్లుగా ‘బాలక్‌నామా’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో పనిచేసే బాల రిపోర్టర్లలో కొందరికి తగిన అక్షరజ్ఞానం కూడా లేదు. తాము విన్నవి, కన్నవి వాళ్లు చెబుతుంటే అక్షరజ్ఞానం గల మిగిలిన బాలలు వారు చెప్పే విషయాలను రాసుకుని, వాటి ఆధారంగా తగిన కథనాలను రూపొందిస్తుంటారు. బాలలు రాసే కథనాలకు మెరుగులు దిద్దడంలో ‘చేతన’ కార్యకర్తలు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. అయితే, కథనాల రూపకల్పనలో, శీర్షికల ఎంపికలో ఈ బాలలే ఉమ్మడిగా తుది నిర్ణయాలు తీసుకుంటారు. ‘ప్రపంచంలోనే ఇది అత్యంత అరుదైన పత్రిక. వీధిబాలలు, బాల కార్మికులు నడిపించే ఏకైక పత్రిక ఇదే’ అని ‘ఇండియా టుడే’ రెండేళ్ల కిందట ఒక ప్రత్యేక కథనాన్నే ప్రచురించింది.  పలు అంతర్జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు కూడా ‘బాలక్‌నామా’పై తమ కథనాల్లో ప్రశంసలు కురిపించాయి. బాల రిపోర్టర్లు ఇందులో పనిచేస్తూనే ‘చేతన’ సాయంతో తమ చదువు సంధ్యలను సాగించుకుంటున్నారు.

ఎడిటర్స్‌ స్టోరీ
బాలలు నడిపే బాలల పత్రికే అయినా, ‘బాలక్‌నామా’ నిర్వహణ అంతా పక్కా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ప్రధాన పత్రికల తరహాలోనే ఎడిటోరియల్‌ సమావేశాలు జరుగుతుంటాయి. కథనాల ఎంపికపై సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరుగుతుంటాయి. పదో తరగతి చదువుకునే చాందినీ అనే బాలిక దీనికి సంపాదకురాలిగా ఉంటోంది. కథనాలపై ఆమె ఎప్పటికప్పుడు రిపోర్టర్లకు సూచనలు ఇస్తూ ఉంటుంది. ‘చేతన’ ఆసరాతోనే ఆమె ఈ స్థాయికి చేరుకుంది. చాందినీకి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం బరేలీ నుంచి ఢిల్లీకి వలస వచ్చింది.

తల్లిదండ్రులతో కలసి వీధుల్లో తిరుగుతూ ఆమె తాడుపై నడవడం వంటి గారడీ విద్యలు ప్రదర్శించేది. అయితే, 2008లో ఆమె తండ్రి మరణించడంతో పరిస్థితి తారుమారైంది. చాందినీ తల్లి ఇళ్లలో పనిచేసేది. తల్లికి ఆసరాగా ఆమె వేన్నీళ్లకు చన్నీళ్లులా వీధుల్లో తిరుగుతూ చెత్త ఏరుకుని అమ్ముకునేది. ‘చేతన’ కార్యకర్తలు ఆమెను చేరదీసి ఓపెన్‌ స్కూల్‌లో నమోదు చేయించారు. రిపోర్టర్‌గా తర్ఫీదు ఇచ్చారు. జర్నలిజంలో మెలకువలను నేర్చుకుని ఆరేళ్ల వ్యవధిలోనే ఆమె ఎడిటర్‌ స్థాయికి ఎదిగింది.

పాలస్తీనాలో పసి పాత్రికేయురాలు
నిరంతరం బాంబుల మోతతో దద్దరిల్లే పాలస్తీనాలో పనిచేయడానికి ఎంతటి బడా బడా జర్నలిస్టులైనా గుండెలు అరచేతుల్లో పెట్టుకుంటారు. అలాంటిది పదేళ్ల పసిపిల్ల జన్నా జీహాద్‌ అయ్యద్‌ ఏమాత్రం జంకుగొంకు లేకుండా పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న అరాచకాలను ప్రపంచానికి వెల్లడించేందుకు నడుం బిగించింది. కెమెరాను తన ఆయుధంగా చేసుకుని, తాను కళ్లారా చూసిన దాడులను, రక్తపాతాన్నీ ఎప్పటికప్పుడు వివిధ వార్తాసంస్థలకు అందించడం మొదలుపెట్టి అంతర్జాతీయ వార్తాసంస్థల దృష్టిని ఆకట్టుకుంది.

 పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ ఆక్రమిత ప్రాంతమైన వెస్ట్‌బ్యాంక్‌లోని నబీ సలే గ్రామంలో పుట్టిన జన్నా... తనకు ఊహ తెలిసినది మొదలు తన ప్రాంతంలో జరిగే మారణకాండను కళ్లారా చూస్తూనే ఉంది. ఆమె కుటుంబంలో ఎవరూ జర్నలిస్టులు కాదు. ఆమె బాబాయి ఒక కెమెరామన్‌. అతడి వద్ద కెమెరా వాడటం తెలుసుకుంది. మొదటిసారిగా ఏడేళ్ల వయసులో తన ప్రాంతంలో జరిగిన దాడులను చిత్రీకరించి వార్తాసంస్థలకు పంపింది. సైనికులను, క్షతగాత్రులను ఇంటర్వూ్య చేయడం, తోటి పిల్లలతో కలసి ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో పాల్గొనడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అనతికాలంలోనే అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.

 ‘చాలామంది జర్నలిస్టులు పాలస్తీనా గొంతును బయటి ప్రపంచానికి వినిపించడం లేదు. అలాంటప్పుడు నేనే ఎందుకు ఆ పని చేయకూడదనుకున్నా. అందుకే మా గ్రామంలోను, పరిసరాల్లోను జరుగుతున్న దాడులను, మా ప్రజలపై జరుగుతున్న అఘాయిత్యాలను నాకు చేతనైన రీతిలో చిత్రీకరిస్తూ వార్తాసంస్థలకు పంపుతున్నా. కెమెరా కన్నే నా గన్ను.’ అని చిన్నారి జన్నా ‘అల్‌ జజీరా’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పడం విశేషం.

స్థానిక నేరాలపై చిన్నారి లీ‘షాక్‌’
పట్టుమని పదేళ్లయినా లేని అమెరికన్‌ చిన్నారి హిల్డే కేట్‌ లిషాక్‌ మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా కంటే ముందుగానే ఒక హత్య సంఘటనను వెలుగులోకి తెచ్చింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో తాను నివాసం ఉండే సీన్స్‌గ్రోవ్‌ పట్టణంలో జరిగింది ఆ సంఘటన. గత ఏడాది ఏప్రిల్‌ రెండో తేదీన ఆమె వార్తల సేకరణ కోసం ఎప్పట్లాగానే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. స్టేషన్‌ అధికారితో ఆమె మాట్లాడుతుండగానే, హత్య సంఘటనపై ఫోన్‌కాల్‌ వచ్చింది.

 పోలీసులు తర్జన భర్జనలు పడుతుండగానే హిల్డే స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి మరీ వివరాలను సేకరించింది. హుటాహుటిన ఇంటికి చేరుకుని ముందుగా ఈ కథనాన్ని తన పత్రికకు సంబంధించిన వెబ్‌సైట్‌లో వీడియోతో సహా పోస్ట్‌ చేసింది. తర్వాత తన పత్రికలో వివరంగా కథనాన్ని ప్రచురించింది. చిన్నపిల్ల ఏదో ముచ్చటగా నడుపుకొనే పత్రికలో ఏవో ఆటపాటలు, చదువు సంధ్యల కథనాలు రాసుకోవచ్చు గానీ, ఏకంగా క్రైమ్‌స్టోరీలు ప్రచురించడమా!

అంత చిన్నపిల్లను హత్య జరిగిన చోటుకు ఆమె తల్లిదండ్రులు ఎలా వెళ్లనిచ్చారు..? అంటూ పెన్సిల్వేనియా పెద్దమనుషులు కొందరు నోళ్లు నొక్కుకున్నారు. నొసలు చిట్లించారు. దీనిపై ఎవరెలా స్పందించినా ‘ఐ డోంట్‌ కేర్‌’ అని నిక్కచ్చిగా తేల్చి చెబుతోంది హిల్డే. ‘ఏం చిన్నపిల్లనైనంత మాత్రాన పెద్దపెద్ద కథనాలు రాయడం తప్పవుతుందా?’ అని ప్రశ్నిస్తోంది. స్థానికంగా జరిగే ఎలాంటి సంఘటనలు, కార్యక్రమాలనైనా తాను రిపోర్ట్‌ చేస్తానని, అయితే క్రైమ్‌ కథనాలు రాయడమంటేనే తనకు ఎక్కువ ఇష్టమని చెబుతుందామె.

ఎలా జర్నలిస్ట్‌ అయ్యిందంటే..!
హిల్డే తండ్రి మాథ్యూ లిషాక్‌ ‘న్యూయార్క్‌ డెయిలీ న్యూస్‌’లో జర్నలిస్టు. తండ్రి ప్రభావంతోనే హిల్డే జర్నలిజంపై ఆసక్తి పెంచుకుంది. వార్తాకథనాల కోసం పరిశోధనలు సాగించే సమయంలో మాథ్యూ చిన్నారి హిల్డేను తనతో పాటే కార్యాలయానికి తీసుకు వెళ్లేవాడు. అక్కడ ఆమె తన తండ్రి చేసే పనులను ఆసక్తిగా గమనించేది. కొన్నాళ్లకు మాథ్యూ కుటుంబం న్యూయార్క్‌ నుంచి స్వస్థలమైన సీన్స్‌గ్రోవ్‌కు చేరుకుంది. జర్నలిజంపై కూతురి ఆసక్తి గమనించి ‘ఆరెంజ్‌న్యూస్‌’ను కుటుంబ పత్రికలా రూపొందించేలా ప్రోత్సహించాడు. తొలుత ఇది రాత పత్రికగానే మొదలైంది. క్రమంగా ఫేస్‌బుక్‌ పేజీకి, యూట్యూబ్‌ చానెల్‌కు విస్తరించింది. క్రమంగా 2014 నాటికి... అంటే హిల్డేకు ఎనిమిదేళ్ల వయసు వచ్చే నాటికి ఇది స్థానిక పత్రిక స్థాయికి ఎదిగి, ప్రింట్‌ ఎడిషన్‌గా వెలువడటం మొదలైంది.

పాత్రికేయులపై దాడులు, దమనకాండలు
పేరుకు మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే అయినా పత్రికా స్వేచ్ఛ మాత్రం ఇక్కడ అంతంత మాత్రమే. భారతదేశం మాత్రమే కాదు, చాలావరకు ‘శాంతియుత’ ప్రజాస్వామిక దేశాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ వెల్లడించిన వివరాల ప్రకారం 2015లో ప్రపంచవ్యాప్తంగా 110 మంది పాత్రికేయులు విధినిర్వహణలో ఉండగా హత్యకు గురయ్యారు. మరో 43 మంది పాత్రికేయులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.

 వీరే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా చురుగ్గా వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న 27 మంది సిటిజన్‌ జర్నలిస్టులు కూడా హత్యకు గురయ్యారు. పాత్రికేయులకు భారత్‌ ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా పరిణమించింది. 2015లొ భారత్‌లో విధి నిర్వహణలో ఉండగా పదిమంది జర్నలిస్టులు హత్యకు గురైతే, మరో నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అదే ఏడాది పాకిస్థాన్‌లో ఇద్దరు, అఫ్ఘానిస్థాన్‌లో ఇద్దరు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్‌లో నలుగురు బ్లాగర్లు హత్యకు గురయ్యారు.

ఇదిలా ఉంటే, మన దేశంలో జర్నలిస్టులపై భౌతిక దాడులు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతూనే ఉన్నాయి. మాఫియా ముఠాలు మాత్రమే కాదు, అధికారంలో ఉన్న రాజకీయ నేతల అనుచర గణాలు కూడా పాత్రికేయులపై యథేచ్ఛగా భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ప్రభుత్వాలు సైతం మీడియాపై సహనం కోల్పోయి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్న ఉదంతాలు కొల్లలుగా ఉంటున్నాయి. చివరకు ఎవరికీ కొరుకుడుపడని సోషల్‌ మీడియాను కట్టడి చేసేందుకు చట్టాలు కూడా తేవాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయంటే, పత్రికాస్వేచ్ఛపై మన పాలకులకు ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

బాలపాత్రికేయుల ‘ఫస్ట్‌ న్యూస్‌’
బ్రిటన్‌లోని ‘ఫస్ట్‌ న్యూస్‌’ వారపత్రికను స్థాపించినది పెద్దలే గానీ, ఎడిటర్‌ మినహా ఇందులోని పాత్రికేయులందరూ చిన్నారులే. బ్రిటన్‌లో చిన్నారి పాత్రికేయులు పనిచేస్తున్న ఏకైక పత్రిక ఇదే. వృత్తిరీత్యా పాత్రికేయులైన సారా థామ్సన్, స్టీవ్‌ థామ్సన్‌ దంపతులు పిల్లల కోసం ఒక పత్రికను పిల్లలతోనే నడిపితే బాగుంటుందనే ఆలోచనతో 2006లో ‘ఫస్ట్‌ న్యూస్‌’ను  ప్రారంభించారు. బాల పాత్రికేయులకు దిశానిర్దేశం చేయడానికి సంపాదకురాలిగా తమ స్నేహితురాలైన నిక్కీ కాక్స్‌ను నియమించుకున్నారు. కేవలం పదేళ్ల వ్యవధిలోనే దీని పాఠకుల సంఖ్య 20 లక్షలను అధిగమించారు. బ్రిటన్‌లోని ప్రతి పాఠశాలకూ ఇప్పుడీ పత్రిక క్రమం తప్పకుండా ప్రతివారం చేరుతోంది. కొమ్ములు తిరిగిన జర్నలిస్టులు పనిచేస్తున్న పత్రికలతో పోటీ పడుతూ ‘ఫస్ట్‌ న్యూస్‌’ 2012లో ‘బెస్ట్‌ నేషనల్‌ వీక్లీ న్యూస్‌పేపర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును సాధించిందంటే ఇందులో రిపోర్టర్లుగా పనిచేస్తున్న చిచ్చర పిడుగుల సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

బంగ్లాలో బాల పాత్రికేయులు
భారత్‌ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోనూ కొందరు చిన్నారులు జర్నలిజంలో సత్తా చాటుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి సహకారంతో  ‘ప్రిజమ్‌’ అనే వీడియో వార్తాసంస్థ కోసం దాదాపు వందమందికి పైగా బాలలు స్వచ్ఛంద పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. ప్రధాన పత్రికలు, టీవీ చానెళ్లు పట్టించుకోని అంశాలపై వీరు అద్భుతమైన కథనాలను అందిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన బాలల సంక్షేమ సంస్థ యూనిసెఫ్‌తో పాటు బంగ్లాలోని ‘బీడీన్యూస్‌24 డాట్‌ కామ్‌’ ఆన్‌లైన్‌ వారాసంస్థ ‘ప్రిజమ్‌’కు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ‘ప్రిజమ్‌’కు చెందిన బాల పాత్రికేయులు రూపొందించిన కథనాలను ‘బీడీన్యూస్‌24 డాట్‌ కామ్‌’ ప్రముఖంగా ప్రచురిస్తోంది. ‘ప్రిజమ్‌’ బాల పాత్రికేయులు జాతీయ కార్యక్రమాలను కవర్‌ చేయడమే కాదు, జంకుగొంకు లేకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ముఖాముఖి ఇంటర్వూ్యలు కూడా చేస్తుండటం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి...
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఎండమావిలో నీరులాంటిదేనని అంతర్జాతీయ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పాలక వర్గాలు, పోలీసు బలగాల నుంచి పాత్రికేయులకు ముప్పు ఎదురవుతున్న సందర్భాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కొల్లలుగా ఉంటున్నాయి. సహేతుకమైన విమర్శలను, వ్యంగ్యాస్త్రాలను ఏమాత్రం సహించలేని పాలకులు మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా ప్రతినిధులపైనే కాదు, సోషల్‌ మీడియాలో విమర్శలు సంధిస్తున్న వారిని సైతం కట్టడి చేసేందుకు అధికార బలప్రయోగానికి పాల్పడుతున్నారు.

 పాలకుల రాజకీయ అసహనానికి ఫేస్‌బుక్‌లో ‘పొలిటికల్‌ పంచ్‌’ పేజీ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ అరెస్టు ఒక తాజా ఉదాహరణ. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులపై భౌతిక దాడులు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తమపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారనే అక్కసుతో పాలకొల్లుకు చెందిన దళిత జర్నలిస్టు రవిపై అక్కడి ఎమ్మెల్యే అనుచరులు హత్యాయత్నానికి తెగబడ్డారు. చీరాలలో ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు నాగార్జునరెడ్డిపై సాక్షాత్తు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ సోదరుడే తన అనుచరగణంతో భౌతికదాడికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వార్తల కవరేజీకి వెళ్లిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. పత్రికాస్వేచ్ఛపై పాలకులు చెప్పేదొకటి చేసేదొకటిగా ఈ సంఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి.  మూడేళ్ల కిందట గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆంధ్రప్రభ విలేకరి ఎంవీఎన్‌ శంకర్‌ దారుణ హత్యకు గురయ్యారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కమిటీ స్వయంగా అక్కడకు చేరుకుని విచారణ చేపట్టడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరుడైన రౌడీషీటర్‌ వెంగళరాయుడు కూడా ఉండటం గమనార్హం. రెండేళ్ల కిందట వినుకొండలో ‘క్రైం టుడే ఏపీ’ మాసపత్రిక సంపాదకుడు స్టీవెన్‌బాబుపై హత్యాయత్నం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా కవరేజీకి వెళ్లిన ‘సాక్షి’ విలేకరి పోతుల జోగేష్‌పై టీడీపీ నాయకులు రాళ్లతో దాడిచేశారు.

 వార్తలు కవర్‌ చేయనివ్వకుండా కెమెరా లాక్కున్నారు. మట్టితవ్వకాల మాఫియాపై వార్తలు రాశాడనే అక్కసుతో ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి చెరుకూరి లక్ష్మణస్వామి నాయుడుపై టీడీపీ నాయకుడు ఒకరు తన అనుచరులతో కలసి దాడికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో తహశీల్దారు వనజాక్షిపై దాడి చేసిన సమయంలోనే అక్కడే ఉన్న ‘సాక్షి’ విలేకరి కర్రా నవీన్‌కుమార్‌పై కూడా చింతమనేని అనుచరులు దాడికి తెగబడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున గెలిచి, టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ సైతం వార్తల కవరేజీకి వెళ్లిన సాక్షి ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లపై దాడి చేయించారు.

 విశాఖపట్నంలోని గాజువాకలో దుబాయి ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసిన ఒక సంస్థ నిర్వాహకులు కవరేజీకి వెళ్లిన ‘సాక్షి’ టీవీ ప్రధాన విలేకరి వి.వెంకట జగన్నాథరావు, కెమెరామెన్‌ సుధాకర్‌లపై దాడికి తెగబడ్డారు.  రాష్ట్రవ్యాప్తంగా తరచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పత్రికా స్వేచ్ఛకు భరోసా కల్పించలేకపోవడం గమనార్హం.

– సాక్షి ఆంధ్రప్రదేశ్‌ నెట్‌వర్క్‌ సహకారంతో...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement