వైఎస్సార్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనం
మార్గం మధ్యలో రోడ్డుపైకి తరలి వచ్చిన అభిమాన జనం
అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగిన జననేత
కూటమి సర్కారు బాధితులకు అండగా ఉంటామని భరోసా
సాక్షి ప్రతినిధి, కడప/ సాక్షి నెట్‌వర్క్: వైఎస్సార్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం పులివెందుల– బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్డుపైకి వచ్చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఆ రహదారిలో వెళ్తున్నారని తెలుసుకుని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు. దారి పొడువునా జననేతకు బ్రహ్మరథం పట్టారు.
వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరినీ నిరాశ పరచకుండా అందరినీ పలకరిస్తూ, సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరునా పలకరిస్తూ ముందుకు సాగారు. అంబకపల్లి క్రాస్, దొరిగల్లు మీదుగా ముదిగుబ్బ బైపాస్ రోడ్డుకు చేరుకున్న జగన్‌కు.. కాకతీయ దాబా వద్ద కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరికీ జగన్ అభివాదం చేశారు. తర్వాత కట్టకిందిపల్లె మీదుగా బత్తలపల్లి మండలం రామాపురం చేరుకున్న జగన్ కాన్వాయ్‌ని ప్రజలు ఆపి, జై జగన్ అంటూ నినదించారు.
బత్తలపల్లి టోల్‌ప్లాజా వద్దకు కాన్వాయ్ చేరుకునే సరికే భారీ సంఖ్యలో జనం, పార్టీ శ్రేణులు వేచి ఉన్నారు. ఇక్కడ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు కాన్వాయ్‌కు అడ్డుపడుతూ తమతో మాట్లాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాహనంలో నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. టోల్‌ప్లాజా వద్దనే అడుగడుగునా వాహనానికి అడ్డుపడడంతో జగన్ వాహనంలో నుంచి మూడు సార్లు బయటకు వచ్చి అభివాదం చేయాల్సి వచ్చింది.
కరచాలనానికి పోటాపోటీ
రాప్తాడులోని నాలుగు రోడ్ల కూడలికి జగన్ కాన్వాయ్ చేరుకోగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
జగన్‌తో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి ప్రజలు పోటీ పడ్డారు. మార్గం మధ్యలోని బొమ్మేపర్తి, లింగనపల్లి, హంపాపురం, గొల్లపల్లి, మరూరు, ఎం.చెర్లోపల్లి, చెన్నేకొత్తపల్లి సమీపంలో పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు ఎక్కడికక్కడ ఘన స్వాగతం పలికారు. సోమందేపల్లి వై.జంక్షన్ వద్ద శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్, వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, చిలమత్తూరు మండలానికి సమీపంలోని బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
ఇక్కడ జగన్‌తో కరచాలనం చేసేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. టోల్ ప్లాజా దాటేందుకు సుమారు గంట సమయం పట్టడం గమనార్హం. జగన్‌ను చూసేందుకు వచ్చిన జనాన్ని, పార్టీ శ్రేణుల్ని నిలువరించడానికి ఏపీ, కర్ణాటక పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
అక్రమ కేసులకు భయపడొద్దు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. ఇటీవల చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్ రంగారెడ్డి చేసిన దాడిలో శివప్ప, అతని సోదరుడు వెంకట్‌తో పాటు మత్సేంద్ర, నారాయణప్ప, పవన్ గాయపడ్డారు. అయితే.. పోలీసులు బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో వారంతా పెద్దనపల్లి వద్ద వైఎస్ జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయించారని వాపోయారు. వారి కష్టాన్ని ఓపికగా విన్న జగన్.. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడొద్దని వారికి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment