సాక్షి, చెన్నై: విశ్వనాయకుడు కమల్ హాసన్ రాజకీయపార్టీ ప్రకటనకు దూకుడు పెంచారు. ఈనెల 12న(సోమవారం) సీఈసీ ముందుకు వెళ్లనున్నారని సమాచారం. పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను సీఈసీకి సమర్పించి, రిజిస్ట్రేషన్ చర్యలో నిమగ్నమయ్యారు. ఇందుకు జిల్లాకు ఐదుగురు అభిమాన సంఘం నేతల్ని ఎంపిక చేసి, వారి సంతకాలతో ప్రమాణ పత్రాన్ని సిద్ధం చేశారు.
కమల్ రాజకీయ అరంగ్రేటం చేసినా, పార్టీ ప్రకటనలో మాత్రం జాప్యం చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేయడంతో కమల్ పార్టీ ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 21వ తేదీన భారత రత్నం, దివంగత అబ్దుల్ కలాం పుట్టిన గడ్డ రామేశ్వరంలో పార్టీ పేరును ప్రకటించేందుకు కమల్ నిర్ణయించారు. ఈ తేదీ దగ్గరపడటంతో ముందుగా సీఈసీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించేందుకు తగ్గ చర్యలో పడ్డారు. దీనికి ఐదుగురితో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీ పలు దఫాలు ఢిల్లీలో పర్యటించినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాల్ని, రాజకీయంగా పార్టీ ఏర్పాటుకు నియమ నిబంధనలు, రిజిస్ట్రేషన్ల వ్యవహారం అంశాలపై సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిననట్టు సంకేతాలు వెలువడ్డాయి.
12న సీఈసీ వద్దకు..
ఢిల్లీలో అన్ని పక్రియలు ముగియడం, పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఐదుగురితో కూడిన కమిటీ వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా సీఈసీ వద్ద పేరు నమోదుకు ప్రమాణ పత్రం సమర్పించేందుకు నిర్ణయించారు. ఈ పత్రాన్ని రూపొందించేందుకు కమల్ సన్నిహితుడు రాశి అలగప్పన్ చర్యలు చేపట్టారు. అంతేకాక జిల్లాకు ఐదుగురు అభిమాన సంఘం నేతల్ని చెన్నైకు శనివారం పిలిపించారు. ఈనెల 12వ తేదీ ఢిల్లీలో ఐదుగురితో కూడిన కమిటీ సీఈసీ వద్ద పార్టీ నమోదుకు తగ్గ చర్యలు చేపట్టినట్టుగా అభిమాన సంఘం వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment